అచ్చుగుద్దినట్టు బొమ్మలను తయారుచేసే 'ది అల్టిమేట్ కాపీ'

అచ్చుగుద్దినట్టు బొమ్మలను తయారుచేసే 'ది అల్టిమేట్ కాపీ'

Saturday October 03, 2015,

3 min Read

ప్రత్యేక సందర్భాల్లో మీ ఆత్మీయులకు ఇచ్చే గిఫ్ట్ ఎలా ఉండాలని కోరుకుంటారు ? బంగారు, వెండి , డైమండ్స్ ఇలా ఎంతకాస్ట్లీ ఇచ్చినా సరిపోనంత ఆనందాన్ని వారి కళ్లలో చూడాలంటే ' ది అల్టిమేట్ కాపీ డాట్ కామ్' కు లాగిన్ కావాలని అంటున్నారు ఆ సంస్థ ఫౌండర్ అవ్లీన్ కౌర్. ఫోటో పంపితే నెలరోజుల్లో మీ లాంటి బొమ్మలను మీ ఇంటి అడ్రస్‌కు పంపుతారు. మనుషుల మధ్య ఉన్నఎమోషన్స్ పదికాలాలు నిలిచేలా మా సంస్థ పనిచేస్తుందని ఆమె చెప్తారు. ఒక వ్యక్తికి సంబంధించిన రెప్లికాను తయారు చేయడం అంటే అన్నింటికంటే ఆ వ్యక్తి ఎంత సంతోషిస్తారో అది మాటల్లో చెప్పలేనిది అంటారామె.

image


అలామొదలైంది

“మా పెళ్లి రోజునాడు, మావారు నాకు బహుమతిగా ఇచ్చిన నా బొమ్మ నన్ను ఎంతగానో కట్టిపడేసింది. ఆక్షణం నా ఎమోషన్స్ అవధులు దాటాయి.” అవ్లీన్ కౌర్.

భారత దేశంలో ఈ తరహా బొమ్మల తయారీ ఉన్నప్పటికీ మార్కెటింగ్, ఆన్ లైన్ ఫ్లాట్‌ఫాం లేదనిపించింది. దీంతో అల్టిమేట్ కాపీ స్టార్టప్ ప్రారంభించినట్టు చెప్తారు. ఈ తరం అంతా ఉరుకుల పరుగుల ప్రపంచంలో బతికేస్తోంది. ప్రతీదీ మెకానికల్ అయిపోయాయి. అంతా ఇన్‌స్టెంట్, రెడీమేడ్‌గా మారిపోయింది. పాతతరానికి చెందిన ఇలాంటి కళను మరోసారి జనం ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ది అల్టిమేట్ కాపీ డాట్ కామ్ (theultimatekopie.com) మొదలు పెట్టామన్నారు. పాండిచేరికి చెందిన ఈ సంస్థ ఇప్పటి వరకూ వందల సంఖ్యలో బొమ్మలను తయారు చేసింది. ఆన్ లైన్‌లో ట్రాఫిక్ బాగానే ఉంది. సోషల్ మెసేజింగ్ సైట్ ద్వారా మా సైట్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందని వివరిస్తారు కౌర్. పాండిచ్చేరిలో ఉన్న కొంతమంది కళాకారులు ఈ బొమ్మల తయారీలో పనిచేస్తున్నారు.

image


చేతితో చేసిన బొమ్మలే

నూటికి నూరుశాతం హ్యాండ్‌మేడ్ బొమ్మలివి. శిల్పాలు తయారు చేసే కళాకారులు వీటిని రూపుదిద్దుతున్నారు . వెబ్ సైట్ పేరులో చెప్పినట్లు ది అల్టిమేట్ కాపీ(KOPIE) ఇక్కడ కాపీ అంటే డచ్‌లో ప్రతి సృష్టి (రెప్లికా) అని అర్థం. ఫోటోలను చూసి వాటి రెప్లికాలను తయారు చేస్తారు. ఇందులో ఉపయోగించే మెటీరియల్ తక్కువే అయినా షేప్‌ని అందంగా తీర్చిదిద్దడంలోనే అంతా ఆధారపడి ఉంటుంది. హై రెజల్యూషన్ ఫోటో ఇస్తే దాని ప్రకారం తయారు చేయడానికి వీలవుతుందని కౌర్ వివరించారు. చాలా మంది మెషిన్ ఉపయోగించమని సలహాలిచ్చారు. కానీ మెషిన్ ఎప్పటికీ మెకానికలే. మనవ సంబంధాల్లో ఈ బొమ్మలు సైతం భాగస్వామ్యం కావాలనేది మా లక్ష్యం. దీంతో మెషీన్ తయారీవైపు మేము మొగ్గు చూపలేదు. హ్యాండ్‌మేడ్ బొమ్మలనే తయారు చేస్తున్నామని అన్నారామె.

అల్టిమేట్ కాపీ టీం

టీం విషయానికొస్తే అవ్లీన్ కౌర్ దీనికి ఫౌండర్‌గా వ్యవహరిస్తున్నారు. మార్కెటింగ్ అండ్ హెచ్.ఆర్‌.లో ఆమె ఎంబిఏ పూర్తి చేశారు. అనంతరం అమెజాన్ డాట్ కామ్‌లో క్యాటలాగ్ అనలిస్ట్‌గా పనిచేశారు. హనీకోంబ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆపరేషన్స్ హెడ్‌గానూ బాధ్యతలు నిర్వహించారు ఆమెతోపాటు ఇప్పుడు మరో నలుగురు టీం ఉన్నారు. వీరంతా ఎంబీయే పూర్తిచేసిన వారే. మరో నలుగురు ఉద్యోగులున్నారు.

ది అల్టిమేట్ టీం,ఫౌండర్ కౌర్(కుడి నుంచి మొదటి వ్యక్తి)

ది అల్టిమేట్ టీం,ఫౌండర్ కౌర్(కుడి నుంచి మొదటి వ్యక్తి)


బొమ్మలు కావాలంటే ఏంటి ప్రాసెస్

బొమ్మలు కావాలనుకునే వారి ఫోటోను ది అల్టిమేట్ కాపీ వెబ్ సైట్‌లో తెలిపిన మెయిల్ కు పంపాలి. ఫోటో హై రెజల్యూషన్ కలిగి ఉండాలి. ఫుల్ లెంగ్త్ ఫోటో మాత్రమే పంపించాలి. పంపినట్లు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. ఈ మెయిల్ వచ్చిన 30రోజుల్లో బొమ్మను ఇంటికి డెలివరీ చేస్తారు. ఎవరైన ప్రత్యేక సందర్భం కోసం బొమ్మలు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే నెలరోజుల ముందుగా ఆర్డర్ ఇస్తే బాగుంటుందని ఫౌండర్ వివరించారు. సింగిల్ కోపీ అయితే రూ.5500, కపుల్ అయితే తొమ్మిది నుంచి రూ.11 వేల వరకూ ఛార్జ్ చేస్తున్నారు.

ఈ ప్రాసెస్‌లో ఏవైనా ప్రశ్నోత్తరాలు జరపాలి అనుకుంటే కస్టమర్ సర్వీసు కూడా అందుబాటులో ఉంటుంది. ఫోటోలో పంపిన రంగులు, ఇతర విషయాల్లో మార్పులుండవు. ఇప్పటి వరకూ 300లకు పైగా బొమ్మల ఆర్డర్లను డెలివరీ చేశామని కౌర్ వివరించారు.

image


లక్ష్యాలు

త్రీడీ బొమ్మల తయారీ పరిశ్రమ భారత్ లో చాలా వేగంగా విస్తరించింది. ఈ తరహా బొమ్మల తయారీలో ఇప్పటికే పూణే కేంద్రంగా మరో కంపెనీ ఉత్పత్తులను ప్రారంభించింది. ఉత్తర భారత మార్కెట్ పై కూడా చాలా కంపెనీలు కన్నేసాయి. మెషిన్ మేడ్ బొమ్మలు మరింత చక్కగా, నాజూగ్గా, పొందిగ్గా కనిపిస్తున్నాయి. హ్యాండ్ మేడ్ బొమ్మల కంటే తొందరగానే మెషిన్ మేడ్ బొమ్మల డెలివరీ జరుగుతుంది. దీన్ని అధిగమించాలి. 30రోజులకంటే ముందే బొమ్మలు తయారు చేస్తే కానీ మార్కెట్ లో తొందరగా వ్యాపిస్తున్న ఈ తరహా కంపెనీల కాంపిటీషన్ నుంచి తట్టుకోవడం కష్టం. దీన్ని అధిగమించాల్సి ఉంది. అయితే ధర విషయంలో తమకు కాంపిటీషన్ ఎవరూ ఉండరని కౌర్ ఎంతో కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.

భవిష్యత్ ప్రణాళికలు

ది అల్టిమేట్ కాపీ కి దేశ వ్యాప్తంగా కస్టమర్లు ఉన్నారు. వెబ్ సైట్ కే పరిమితమైన కంపెనీని యాప్ ప్లాట్ ఫాంలోకి తీసుకు రావాలని చూస్తున్నారు. ఈ ఏడాది చివరి కల్లా టీంను విస్తరించి పాండిచ్చేరితో పాటు హైదరాబాద్ లేదా చెన్నైలో మరో కేంద్రాన్ని ప్రారంభించాలని యోచిస్తున్నారు. నెలరోజుల నిడివిని తగ్గించడానికి తయారీ దారుల సంఖ్యను పెంచాలని చూస్తున్నారు.