ఫోన్ లేకున్నా వాడుకునేలా టీ వాలెట్ !

సౌకర్యం, సెక్యూరిటీ, ప్రైవసీ ప్రాతిపదికగా రూపకల్పన

ఫోన్ లేకున్నా వాడుకునేలా టీ వాలెట్ !

Saturday December 10, 2016,

2 min Read



సకల హంగులతో తెలంగాణ ప్రభుత్వం డిజిట్ పేమెంట్ ప్లాట్ ఫామ్ టీ వాలెట్‌ను సిద్ధం చేస్తోంది. ప్రజల సౌకర్యం, సెక్యూరిటీ, ప్రైవసీ ప్రాతిపదికగా ఈ వాలెట్‌ను డిజైన్ చేస్తున్నారు. మొత్తం ఐదు పద్ధతుల్లో వాలెట్ ను వాడుకోవచ్చు. ఫోన్ లేకున్నా వాలెట్ వాడుకునే సదుపాయం ఉంటుంది. వచ్చే వారమే టీ వాలెట్ లోగోను సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు.

డీమానిటైజేషన్ నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం వేగంఆ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఒక సరికొత్త డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్లాట్ ఫాం తయారు చేస్తోంది. దానిపేరే టీ వాలెట్! సకల హంగులతో ఈ వాలెట్ తీసుకొస్తున్నారు. ఈ మేరకు ఐటీ శాఖ అధికారులు, టీ వాలెట్ సర్వీస్ ప్రొవైడర్లతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశాల మేరకు ప్రజలకు సులభమైన, సౌకర్యమైన వాలెట్ తయారు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కంపెనీల ప్రతినిధులకు తెలంగాణ ప్రభుత్వ విజన్ ను వివరించారు. అతి త్వరలోనే టీ వాలెట్ లోగోను సీఎం కేసీఆర్ అవిష్కరిస్తారని కేటీఆర్ తెలిపారు.

image



క్యాష్ లెస్ లావాదేవీల దిశగా తెలంగాణ రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్లడానికి టీ వాలెట్ పని చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఒక రాష్ట్రం ప్రత్యేకంగా సొంత వాలెట్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని మంత్రి గుర్తు చేశారు. టీ వాలెట్ తయారీలో ప్రజలకు సౌకర్యం, సెక్యూరిటీ, ప్రైవసీ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. అత్యుత్తమ వాలెట్ తయారీతో దేశంలోని ఇతర రాష్ర్టాలకు తెలంగాణ మార్గదర్శకంగా నిలుస్తుందని కేటీఆర్ అశాభావం వ్యక్తం చేశారు. పౌరులు ప్రభుత్వంతో చేసే ప్రతి నగదు ట్రాన్సాక్షన్ ఉచితంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ముందుగా జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ వంటి శాఖల్లో వాలెట్ సేవలు అందిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. దశల వారీగా విస్తరించుకుంటూ.. అన్ని రేషన్ షాపులు, స్కాలర్ షిప్ లు, ఈ-సేవా చెల్లింపులను సైతం టీ వాలెట్ కిందికి తీసుకొస్తామని మంత్రి ప్రకటించారు.

ప్రజలకు యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా టీ వాలెట్ ను ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. స్మార్ట్ ఫోన్, ఫీచర్ ఫోన్, కంప్యూటర్, కాల్ సెంటర్, నో ఫోన్ (ఫోన్ లేకున్నా) వంటి ఐదు పద్ధతుల్లో వాలెట్ పనిచేస్తుంది. టీ వ్యాలెట్ వినియోగానికి అధార్ కార్డు లేదా ఫోన్ నంబర్ ఉంటే సరిపోతుంది. ఈ రెండింటిని వాడుకునే ఆప్షన్ కూడా ఉంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా టీ వాలెట్ లో తెలుగు భాషలో కూడా ఉంటుంది. టీ వాలెట్ కు ఇచ్చే సమాచారం, ఇతర వివరాలు అత్యుత్తమ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ప్రకారం సురక్షితంగా ఉండేలా చూస్తున్నారు. వాలెట్ సేవలు, ఇతరత్రా అంశాలపై మిగతా శాఖలతో కూడా చర్చించాలని మంత్రి కేటీఆర్ ఐటీ శాఖాధికారులను ఆదేశించారు.