ఒక నాయకురాలిగా మీరేం చేయాలంటే..

Friday February 26, 2016,

3 min Read

నాయకత్వ లక్షణాలు పుట్టుకతో వస్తాయా… లేకపోతే నేర్చుకుంటే వస్తాయా? నాయకులు పుడతారా… తయారవుతారా? ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తిత్వ నిపుణుడు స్టీపెన్ కోవె మాత్రం … సాధన ద్వారానే నాయకుడు/నాయకురాలు అవుతుందంటారు. లీడర్షిప్ మీద కొన్ని మాటలు తన సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే పుస్తకంలో రాశారు.

దూరదృష్టి, ధైర్యం, చిత్తశుద్ధి, వినయం, వ్యూహాత్మక విధానం, కలుపుకుపోయే తత్వం, చేసే పనిపై ఏకాగ్రత, కార్యచరణ. స్థూలంగా వీటినే నాయకత్వ లక్షణాలు అని చెప్పుకుంటారు. అయితే ఈ లక్షణాలను ఎలా అలవర్చుకోవాలన్నదే ప్రశ్న. ఎన్ని వ్యక్తిత్వ వికాస పుస్తకాలు వచ్చినా… ఈ విషయంలో మాత్రం స్పష్టం లేదు. లీడర్ షిఫ్ క్వాలిటీల్లో మహిళలకు, పురుషులకు తేడా ఉందా అంటే.. కచ్చితంగా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా నాయకత్వం విషయంలో మహిళల పాత్ర పెరుగుతోంది. అతివల విజయానికి కార్పొరేట్ ప్రపంచం కేరాఫ్ అడ్రస్ అయింది. ఆత్మవిశ్వాసానికి , సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తున్నా… పురుషులతో పోల్చితే నాయకురాలిగా ఎదగాలంటే కాస్త ఎక్కువ కృషి చేయక తప్పని పరిస్థితి.

మారాల్సింది మైండ్ సెట్

సమాజంలో ముఖ్యంగా మూడు రకాల మైండ్ సెట్స్ ఉంటాయి. కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలు, విలువలకు కట్టుబడి ఉండటం. దీనివల్ల చేసే పనిలో, ఆలోచనలో స్థిరత్వం వస్తుంది. రెండోది- ప్రణాళికాబద్దంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం. మనం ఎటు వెళ్తున్నామో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మూడోది- చేస్తున్న పనిలో ఏది ముఖ్యమైనదో… ఏది కాదో తెలుసుకోవడం. దీనివల్ల మన ప్రాధాన్యతలు తెలుస్తాయి. టైం సేవ్ అవుతుంది.

పనిపై నియంత్రణ

పరిస్థితులు పూర్తి అనుకూలంగా ఎవరికీ ఉండవు. ముఖ్యంగా మహిళలకు. ఎంత పెద్దస్థాయిలో ఉన్నా, ఇల్లు.. పిల్లలు బాధ్యత చూడాల్సింది మహిళలే. వాస్తవాలను అంగీకరిస్తూనే పరిస్థితులను తమ అదుపులోకి తెచ్చుకోవాలి. ఇంట గెలిచి రచ్చగెలవాలన్న సూత్రం మార్చిపోకూడదు. ఫ్రస్ట్రేషన్ కు గురవ్వడం వల్ల ఉపయోగం లేదు. సమస్యలకు పరిష్కారాలు వెదకాలి. ఇంట్లోని కొన్ని పనులను వేరేవారికి బదలాయించాలి. చేయాల్సిన పనులను వారు ప్రాధాన్యతనా క్రమంలో పూర్తిచేయాలి.

ఆలోచనలు, ప్రవర్తన పరిశీలించుకోవాలి

మనం ఎలా ప్రవర్తిస్తున్నాం… ఎదుటివారి ప్రశ్నలకు ఎలా స్పందిస్తున్నామన్నది చాలా ముఖ్యం. తరతరాలుగా ఈ సమాజం కొన్ని విలువలను, సిద్ధాంతాలను బోధించింది. మహిళలకు మరీ ఎక్కువ. అయితే వీటికి మీరు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా బాధితులుగా భావిస్తున్నారా? మీరు తరచూ చిర్రుబుర్రులాడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా? అలా అయితే మాత్రం కొంత ఆత్మావలోకనం తప్పనిసరి. అలాంటి సమయంలో మనం అమితంగా ఇష్టపడే నాయకుడిని గుర్తు చేసుకోవాలి. సహనంతో, శాంతియుతంగా ఉన్నా పనులు అవుతాయని… మనమాట వింటారని గుర్తించాలి. ఇది కొంత అనుభవంతో వస్తుంది.

ఆఫీసు – వాతావరణం

నమ్మకమే గెలుపు సూత్రం. మనపై నమ్మకం కలిగేలా మాట్లాడాలి. సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలి. నిజాయతీగా వ్యవహరించాలి. ఫీడ్ బ్యాక్ తీసుకుని, తప్పులుంటే సరిదిద్దుకోవాలి. అవసరమైన విషయాల్లో గోప్యత పాటించాలి. ఒక నాయకురాలిగా మీరు, కిందివారి అంచనాలకు తగ్గట్టు పనిచేయాలి. ఉద్యోగులను నియంత్రించాలి. ఒప్పందాలు కుదుర్చుకోవాలి. అందుకే నిలకడైన మనస్తత్వం అవసరం.

తద్వారా పనిచేసేచోట మనపై నమ్మకం కలుగుతుంది. అందరి ఆమోదం లభిస్తుంది. మన కింద ఉన్నవారి సత్తాను తెలుసుకుని… వారికి ఏ పని అప్పగించాలో అదే ఇవ్వాలి. వారు సొంతంగా నిర్ణయాలు తీసుకునేందుకు స్వేచ్ఛనివ్వాలి. పరిస్థితులకు అనుగునంగా స్పందించాలి. అప్పుడప్పుడూ అభిప్రాయాలు మార్చుకోక తప్పదు. మొదట పరిస్థితులను ఆకళింపు చేసుకోవాలి. తోటి ఉద్యోగుల భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి. దీని వల్ల సంబంధాలు పురుషాధిక్య సమాజంలో తమను ఆమోదించరని మహిళలను భావిస్తారు. అయితే పరిస్థితులు ఇప్పుడు మారాయి. వ్యాపారం, రాజకీయాలు, ఆర్థిక రంగంతోపాటు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఎంతో నిబద్ధతతో పనిచేసి… తోటి ఉద్యోగుల మనసు గెలుచుకోవడం వల్లే ఆ స్థాయికి వెళ్లారు. తరతరాలుగా వస్తున్న లింగ వివక్షకు ఎదురెళ్లి… వ్యాపార రంగం తలరాతలనే మార్చేస్తున్నారు. మహిళలు విశ్వాసానికి … ఆత్మస్థైర్యానికి కేరాట్ అడ్రస్ గా మారుతన్నారు.

మాటే మంత్రం

మహిళలు టీం లీడర్ గా ఉన్నప్పుడు- తాను తీసుకునే ప్రతి నిర్ణయానికి జట్టు సభ్యులంతా మద్దతిచ్చేలా చూసుకోవాలి. వారిని మాటలతో ఒప్పించాలి. సరైన సంభాషణలే గొప్ప నాయకురాలిని తయారుచేస్తాయి. మంచి వర్క్ కల్చర్ కు మంచి మాటే దోహదం చేస్తుంది. మామూలు సంభాషణల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. అందరూ భయం లేకుండా… స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం సృష్టించాలి.

టైం మేనేజ్ మెంట్

నాయకురాలికి టైం మేనేజ్ మెంట్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యమైన పనులకు ముందుగా సమయం కేటాయించాలి. అర్జెంట్ గా చేయాల్సిన పనులు… కాస్త టైం తీసుకున్నా ఫర్వాలేదనుకున్న పనుల మధ్య విభజన రేఖలు గీసుకుని పనిచేయాలి. తాను నాయకురాలన్న విషయాన్ని అనుక్షణం గుర్తుచేసుకుంటూ ప్రవర్తించడం చాలా ముఖ్యం. అయితే మహిళైనా… మగవారైనా … సమస్యలు, సవాళ్లు దాదాపు ఒకటే. మన సత్తాను, పనిని నమ్ముకోవాలి. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి. సంస్థలో లేదా సమాజంలో మనం చూడాలనుకున్న మార్పు మనతోనే మొదలవ్వాలి. బాధ్యతతో మెలగాలి. బలహీనతలను, ఆత్మన్యూనతా భావాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే ఆకాశంలో సగం ఉన్న నారీమణులు అవకాశాల్లోనూ సగమవుతారు. 

రచయిత: సంధ్య మథుర్- ఫౌండర్, సీఈవో, ఇన్వార్డ్ ఫోకస్ & సింబయోసిస్ కోచింగ్ సీనియర్ ఫ్యాకల్టీ