సంకల్ప బలం వుండాలేగానీ సముద్రాన్ని సైతం శుద్ధి చేయొచ్చని నిరూపించారు  

0

సముద్రం అంటే ఒక గంభీరతకు చిహ్నం. సముద్రం అంటే ఆవేశానికీ ప్రతిరూపం. ప్రశాంతతకు మరో రూపం. ఒడ్డున కూర్చుంటే పోటెత్తే కెరటాల నుంచి వేలభావాలు పలికించొచ్చు. అర్ధరాత్రి సముద్ర హోరులో అనంత కావ్యాన్ని వినొచ్చు. అలాంటి సముద్రం చెత్తకుప్పలా మూలుగుతుంటే ఉసూరు మనిపించదా? డంప్ యార్డుకంటే హీనంగా ఉంటే మనసు చివుక్కుమనదా?

వాయువ్య ముంబైలో ఉన్న వెర్సోవా బీచ్ మొన్నటిదాకా అలాగే వుండేది. ముంబైలో అత్యంత దారుణంగా వుండే బీచ్ ఏదైనా వుందంటే అది వెర్సోవా బీచ్. బీరు సీసాలు, నీళ్ల బాటిళ్లు, చెత్తా, చెదారం, ప్లాస్టిక్.. ఇలా దాని రూపురేఖలే కనిపించేవి కావు. ఈ దుస్థితి చూసిన ముంబై హైకోర్టు లాయర్ అఫ్రోజ్ షా చలించిపోయారు. మహానగరంలోని సముద్రపు ఒడ్డు ఇంత మురికి కూపంలా మారడం.. దాన్ని చూస్తూ జనం నిట్టూర్పు విడవడం.. అంతకు మించి ఏమీ చేయలేమా అని ఆలోచించాడు. అడుగు ముందుకు వేశాడు. అతని అడుగులో వందల అడుగులు జతకలిశాయి. అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూడా వారికి జత కలిసింది.

చెత్త వేట మొదలైంది. రోజుకి 150 మంది వరకు చెత్త ఏరివేత కార్యక్రమంలో పాల్గొనేవారు. అలా ఒకరోజు కాదు.. రెండ్రోజులు కాదు.. ఏకంగా ఏడాదిన్నర. అంతా చేతులతోనే. ట్రక్కుల కొద్దీ వేస్టేజ్. చాకొలేట్ రేపర్ల నుంచి బీర్ బాటిళ్లదాకా.. సుమారు 5 మిలియన్ కిలోల చెత్త బయటకొచ్చింది. ఇప్పుడు సముద్రం పూర్వవైభవాన్ని సంతరించుకుంది.

సంకల్ప బలం ఉండాలేగానీ సముద్ర జలాలను కూడా శుద్ధి చేయొచ్చని నిరూపించారు ముంబై పౌరులు. ఒకప్పుడు మురికికి ఆలవాలంగా ఉండే వెర్సోవా బీచ్ ని ఇప్పుడు నురగలతో కళకళలాడేలా తయారు చేశారు. ఇప్పుడా సముద్రపు ఒడ్డున నిలబడి నైరుతి రుతుపనాలను స్వాగతం పలకాలని ముంబైకర్లు ఉవ్విళ్లూరుతున్నారు.

అన్నట్టు చెప్పడం మరిచాం.. దీనికంతటికీ కారణమైన అఫ్రోజ్ షాను ఐక్యరాజ్య సమితి మెచ్చుకుంది. జూన్ 5న అంటే.. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజున అవార్డు కూడా ఇవ్వబోతోంది. 

Related Stories