అభినవ కవిసార్వభౌముడు సినారె

0

ఆయన భూగోళమంత మనిషి. ఆయనతో నడిచిన కలం నాగార్జున సాగరం. రెక్కల సంతకాలు చేసిన ఆ మట్టిమనిషి వ్యక్తిత్వం విశ్వంభర దృక్పథం. సినారె కవిత్వాన్ని చదివినా, విన్నా శతకోటి మల్లికల సువానను ఆఘ్రాణించినట్టే. ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో అంటూ అజంతా సుందరిని చెక్కిన కవన శిల్పి. గాలికి కులమేది గోత్రమేది అని నిలదీసిన నిప్పులాంటి కవి. అన్నయ్య సన్నిధిని పెన్నిధిగా భావించిన సహృదయ కవి. నాన్న మనసు మీద వెన్నపూస రాసిన ఆత్మీయకవి. అమ్మను మించిన దైవం లేదన్న ప్రేమైక కవి. 

రిక్షావాలాకు జిందాబాద్ కొట్టిన హైదారాబాద్ కవి. స్నేహమంటే జీవితమని.. స్నేహమే శాశ్వతమని అని ఎలుగెత్తి చాటిన మధ్యతరగతి జాన్ జిగిరీ దోస్త్. మనుషులు మారాలి.. నడవడి మారాలి అని తపనపడ్డ అభ్యుదయ కవి. ముత్యాల ముగ్గులో గోగులు పూయించి.. పూగులు కాయించిన వెన్నెల రేడు. అభినవ తారను అభిమానతారగా మార్చిన వన్నెల పాటకాడు. శబ్దాలకు రంగు రుచి వాసన అద్దిన రాతల మాంత్రికుడు సినారె. 

మనిషిలోని కన్నీటినీ, మున్నీటినీ, అంగారాన్ని, శృంగారాన్ని కలిపి రంగరించిన సినారె కలం రెండువైపులా పదున్న కరవాలం. ఇటు అగ్గిని కురిపిస్తుంది.. అటు అమృతాన్నీ చిలికిస్తుంది. చిన్నవిత్తనం మట్టిపొర చీల్చుకుని వటవృక్షంగా ఎదిగినట్టు.. మిణుకుమిణుకు తార ఇంతింతై పూర్ణబింబమైనట్టు.. పరమాణువు అంతకంతకూ ఎగసి మహాపర్వతంగా మారినట్టు.. సినారె ఒక విశ్వ కవనమూర్తి. జన హృదయాంతరాల్లో చైతన్య జలపాతాల ఉరవడిని వినిపించిన ఆయన కలం సాహితీలోకంలో చెరగని సంతకం. కవితా జగత్తులో మానవతా దృక్పథానికి మనోజ్ఞ రూపాన్ని అద్దిన ఆయన కవనం ఎప్పటికీ ఇగిరిపోని గంధం. 

Related Stories

Stories by team ys telugu