ఆస్తులు అమ్మి.. అనాథలను అక్కున చేర్చుకొన్న మనసున్న మారాజు

ఆస్తులు అమ్మి.. అనాథలను అక్కున చేర్చుకొన్న మనసున్న మారాజు

Tuesday November 03, 2015,

4 min Read

పండగనాడో పుట్టిన రోజునాడో అనాథలకు తోచిన సాయం చేయడం మనలో చాలామంది చేసేదే. కానీ ఆ అనాథల కోసం జీవితాన్నే అంకితమిచ్చిన వాళ్లు చాలా అరుదు. ఆ కోవలోకే వస్తారు ఉత్తర్ ప్రదేశ్‌ ఘజియాబాద్‌కు చెందిన తరుణ్ గుప్తా. అభంశుభం తెలియని చిన్నారుల మోముల్లో ఆనందాన్ని నింపడానికి ఐదెంకల జీతాన్ని సైతం వదులుకున్నారు. జీవనాధారమైన దుకాణాలనూ అమ్మేసుకున్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి ప్రేరణగా అనాథలకు అండగా నిలుస్తున్న ఆయన జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. తాను ఎంబీఏలో నేర్చుకున్న మేనేజ్‌మెంట్ పాఠాలు ఇప్పుడు ఎందరో చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఎన్నో వ్యయప్రయాసలు, కష్టనష్టాలకోర్చి ఆయన ఏర్పాటుచేసిన ‘ప్రేరణ సేవా సంస్థాన్’ 26 మంది అనాథలకు ఓ గూడును అందించింది. అయిన వారు లేని ఆ అభాగ్యులను తలెత్తుకొని జీవించేలా చేసింది.

image


అలా మొదలైంది

సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో ఎంబీఏ పూర్తి చేసిన తరుణ్ గుప్తా.. పదేళ్ల కిందట ఓ పెద్ద కంపెనీలో పనిచేసేవారు. సొంతంగా ఓ హెచ్ ఆర్ కన్సెల్టెన్సీని కూడా నడిపేవారు. కానీ 2006లో ఓ బిడ్డకు తండ్రయిన తరువాత తరుణ్ గుప్తా ఆలోచనా విధానంలో ఎంతో మార్పు వచ్చింది. నా అన్నవాళ్లు లేక సమాజంలో దీనంగా బతుకీడుస్తున్న చిన్నారులకు అండగా నిలవాలని ఆయన నిశ్చయించుకున్నారు. సమాజంలో ఉన్నత హోదాలో ఉన్న తరుణ్ గుప్తా కుటుంబానికి బంధువులు, స్నేహితుల నుంచి ఎన్నో బహుమతులు వచ్చేవి. అందులో చాలావరకు తమకు అక్కరలేనివో, అప్పటికే తమ దగ్గర ఉన్న వస్తువులో ఉండేవి. అలాంటివాటిని ఆ అభాగ్యులకు ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన తరుణ్ మదిలో మెదిలింది. అనుకున్నదే తడువుగా ఈ మంచి పనికి శ్రీకారం చుట్టారు తరుణ్ గుప్తా. అదే ఆయన జీవితాన్ని మలుపుతిప్పింది. 

ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది అనాథ పిల్లలను కలవడం, వారితో మమేకమవటం తరుణ్ ఆలోచనల్లో ఎంతో మార్పు తీసుకొచ్చింది. తాను చేస్తున్న సాయం చాలా చిన్నదని, చేయాల్సింది ఎంతో ఉందని ఆయన గ్రహించారు. తరుణ్ ఆలోచనలకు కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల ప్రోత్సాహం కూడా లభించింది. ‘మాకు అవసరం లేని వస్తువులను అనాథ పిల్లలకు ఇవ్వడం ప్రారంభించినపుడు నా స్నేహితులు, సహోద్యోగులు, చుట్టుపక్కలవాళ్లు కూడా నాతో చేయి కలిపారు. ఈ క్రమంలో ఆ అనాథ చిన్నారుల జీవితాలను మరింత లోతుగా అధ్యయనం చేసే అవకాశం దక్కింది. మేము చేస్తున్న సాయం చాలా చిన్నదని అప్పుడే అర్థమైంది. వాళ్లకు కావాల్సింది కేవలం బహుమతులే కాదు.. ఇంకా చాలా ఉందని తెలుసుకున్నాను’ అని అంటారు తరుణ్. అంధకారంలో మగ్గుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి తన వంతు కృషి చేయాలని సంకల్పించారు. వారు మరింత మెరుగ్గా జీవించడానికి అవసరమైన సదుపాయాలను తాత్కాలిక ప్రాతిపదికన అందించడం ప్రారంభించారు. 

అనాథ పిల్లలకు తానే స్వయంగా పాఠాలు చెప్తున్న తరుణ్ గుప్తా

అనాథ పిల్లలకు తానే స్వయంగా పాఠాలు చెప్తున్న తరుణ్ గుప్తా


మిస్సింగ్ కేసుల మిస్టరీ

ఎప్పుడైతే కైలాశ్ సత్యార్థి ప్రారంభించిన ‘బచ్‌పన్ బచావో ఆందోళన్’ సంస్థతో అనుబంధం ఏర్పడిందో అప్పటి నుంచీ పూర్తిస్థాయిలో బాలల హక్కులపై పోరాటం మొదలుపెట్టారు తరుణ్ గుప్తా. మొదట్లో వందల సంఖ్యలో అపహరణకు గురవుతున్న, తప్పిపోతున్న నిరుపేద, అనాధ పిల్లల ఆచూకీ తెలుసుకొనే ప్రయత్నం చేశారు. ఘజియాబాద్ పోలీసుల ‘ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమంలో తరుణ్ గుప్తాదే కీలకపాత్ర. ఎన్నో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది తప్పిపోయిన పిల్లలను పోలీసులు వెతికిపట్టుకోవడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. తప్పిపోయిన పిల్లలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన డేటాబేస్ మనదేశంలో అందుబాటులో లేదని అప్పుడే తరుణ్ గ్రహించారు. ‘మిస్సింగ్ చిల్డ్రన్ ఆఫ్ ఘజియాబాద్’ పేరుతో ఓ ప్రత్యేకమైన డేటాబేస్ రూపొందించారు. ప్రతి ఏటా ఘజియాబాద్ లో తప్పిపోతున్న పిల్లలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇందులో పొందుపరచడం మొదలుపెట్టారు తరుణ్ గుప్తా. ‘వందల సంఖ్యలో తప్పిపోతున్న నిరుపేద, అనాథ పిల్లలను వెతికి పట్టుకోవడానికి రూపొందించిన ప్రభుత్వ విధానాలను అధ్యయనం చేశాము. కానీ అవన్నీ క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రభావం చూపడం లేదని తొందరగానే మాకు తెలిసొచ్చింది. మనుషుల అక్రమ రవాణా, వెట్టిచాకిరీ, బాలకార్మిక వ్యవస్థలకు మురికివాడలు నిలయాలయ్యాయి. దశాబ్దాలుగా వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన ఈ సమస్యను ఎన్నో మంత్రిత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. బాలల హక్కుల ఉల్లంఘన కూడా జరుగుతోందని ఎన్సీపీసీఆర్, ఎన్.హెచ్.ఆర్.సి. దృష్టికి తీసుకెళ్లాం. ప్రతీ ఏడాది వేల సంఖ్యలో పిల్లలు మాయమైపోతున్నారు. కానీ వీరికి సంబంధించిన సమాచారం ఎవరి దగ్గరా లేదు. అందుకే ‘మిస్సింగ్ చిల్డ్రన్ ఆఫ్ ఘజియాబాద్’ పేరుతో ప్రత్యేకంగా ఓ డేటాబేస్ తయారుచేశాం’ అని తరుణ్ గుప్తా చెప్పారు.

వీధి బాలలకు ఆప్యాయంగా తినిపిస్తూ..

వీధి బాలలకు ఆప్యాయంగా తినిపిస్తూ..


సున్నా నుంచి రెండున్నర కోట్ల దాకా..

2012లో ‘ప్రేరణా పరివార్ బాల్ ఆశ్రమ్’ పేరుతో ఘజియాబాద్ లోనే తొలి అనాథ శరణాలయాన్ని ప్రారంభించారు తరుణ్ గుప్తా. నిధుల కొరత తీవ్రంగా ఉన్నా మొదట్లో ఎన్నో కష్టనష్టాలకోర్చి అనాథాశ్రమాన్ని కొనసాగించారు. ప్రస్తుతం ఓ అద్దె ఇంట్లో నడుస్తున్న ఈ అనాథ శరణాలయంలో 26 మంది చిన్నారులు తలదాచుకుంటున్నారు. తిండికే కాదు విద్య, ఆరోగ్యపరంగా వారికి ఎలాంటి లోటూ లేకుండా చూసుకుంటున్నారు తరుణ్ గుప్తా, నిర్వహణ ఖర్చు కోసం తన జీవనాధారమైన దుకాణాలను కూడా అమ్మేసి తన ఉదారత్వాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం దాతలు కూడా భారీగా నిధులు సమకూరుస్తుండటంతో కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే గట్టెక్కుతున్నారు. ఈ మధ్యే రూ. 45 లక్షలతో ఖాళీ స్థలం కూడా కొన్నారు తరుణ్ గుప్తా. అందులో మరిన్ని సౌకర్యాలతో కూడిన అనాథ శరణాలయాన్ని నిర్మించడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి సుమారు రెండున్నర కోట్లదాకా ఖర్చవుతుందని, నిధులు సమకూర్చుకోవడం కోసం ప్రయత్నిస్తున్నామని తరుణ్ చెప్తున్నారు. తొందర్లోనే భవన నిర్మాణం మొదలుపెట్టనున్నారు. 

‘ఈ అనాథ శరణాలయాన్ని ప్రారంభించడానికి మొదట్లో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. పిల్లలు తలదాచుకోవడానికి చోటు కూడా దొరకలేదు. కానీ ఇవాళ ఈ స్థాయికి చేరుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఎలాంటి ప్రభుత్వ సాయం తీసుకోలేదు. ఈరోజు ఇక్కుడున్న 18 మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. సమయానికి వారి ఫీజులను చెల్లించగలుగుతున్నాం. వారు మరింత మెరుగైన జీవితం గడపడానికి కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నాం’ అని తరుణ్ గుప్తా తెలిపారు. 

image


అనాథ శరణాలయంతో పాటు ఓ డేకేర్ సెంటర్ ను కూడా నడిపిస్తున్నారు. రోడ్లు శుభ్రం చేస్తూ, అడుక్కుంటూ జీవనం సాగిస్తున్న 45 మంది పిల్లలు ఈ సెంటర్లో ఆశ్రయం పొందుతున్నారు. వీళ్లందరికీ మంచి విద్య అందించడంతోపాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహిస్తున్నారు. ఈ సంస్థలను నడిపించడంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని ఇళ్లలో పనిచేస్తున్న పిల్లలకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించడానికీ తరుణ్ గుప్తా కృషి చేస్తున్నారు. బాలల హక్కులు, వెట్టిచాకిరీ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన సదస్సులు నిర్వహిస్తుంటారు. వీటి నివారణతోపాటు నిరుపేద, అనాధ పిల్లల రక్షణ, వారికి పునరావాసం కల్పించడం కూడా ముఖ్యమేనన్నది తరుణ్ గుప్తా భావన. ఈ ఉరుకుల పరుగుల జీవితాల్లో, నేను.. నా కుటుంబం అనే భావన పెరిగిపోతున్న ఈ రోజుల్లో అనాథలకు అండగా నిలుస్తున్న తరుణ్ ఎందరికో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారనడంలో సందేహం లేదు. నిస్వార్థమైన ఆయన ఆశయం నెరవేరాలని మనమూ కోరుకుందాం.. వీలైతే చేతనైన సాయమూ చేద్దాం.