ఈ కుర్రాడు లీగల్ అడ్వయిజ్ ఇచ్చే రోబో లాయర్ ను సృష్టించాడు

ఈ కుర్రాడు లీగల్ అడ్వయిజ్ ఇచ్చే రోబో లాయర్ ను సృష్టించాడు

Saturday February 04, 2017,

2 min Read

ఈ రోజుల్లో చాట్ బాట్స్ గురించి తెలియని వ్యక్తి లేడు. ఉదాహరణకు గూగుల్ అలో. ఎమోజీలు, స్టిక్కర్లతో కూడిన పాపులర్ చాటింగ్ బాక్స్. సరిగ్గా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని డూ నాట్ పే అనే అద్భుతమైన కాన్సెప్టుతో ముందుకొచ్చాడు 19 ఏళ్ల లండన్ కుర్రాడు జోషువా బ్రౌడర్. ఒక రకంగా చెప్పాలంటే ఇది రోబో లాయర్.

ఎక్కడైనా పార్కింగ్ సమస్య కామన్. బండి ఆపీ ఆపగానే పోలీసులొస్తారు. వెహికిల్ లాక్కెళ్లి అవతల పడేస్తారు. అది న్యాయమా అన్యాయమా అని వాదించేందుకు టైం ఉండదు. ఒకవేళ అడ్డగోలుగా బండికి ఫైన్ విధించినా చేసేదేం లేక జరిమానా కట్టాలి. ఈ పరిస్థితిని లీగల్ గా ఎదుర్కోడానికి రోబో లాయర్ ని రూపొందించాడు జోషువా. పార్క్ చేసిన ప్రదేశం.. ఫైన్ వివరాలు.. చట్టాలను పరిశీలించి ఫైన్ ను ఎలా తిప్పికొట్టాలో బాధితుడికి చాట్ రూపంలో వివరించే ఆల్గారిథం తయారు చేశాడు. ఇప్పటిదాకా లండన్, న్యూయార్క్ నగరాలు కలిపి లక్షా 75వేల మంది డూ నాట్ పే లో యాక్టివ్ యూజర్స్ గా ఉన్నారు.

image


అయితే దీన్ని కేవలం పార్కింగ్ సమస్యకే పరిమితం చేయలేదు జోషువా. నిరాశ్రయులైన వారికి కూడా న్యాయ సహాయం అందించాలని భావించాడు. లండన్ లో ఎవరికైతే నిలువ నీడలేదో వారికి న్యాయపరమైన సాయం అందిస్తున్నాడు. హౌజింగ్ పాలసీలో ఉన్న సమస్యలను పరిష్కరించి, నిలువనీడలేని వారికి గూడు కల్పిస్తున్నాడు.

చాట్ బాట్ మరింత సింప్లిఫై చేసి ప్రశ్నలకు సమాధానాలిస్తున్నాడు. సమస్యను ఎలా ఎదుర్కోవాలి.. ఎలాంటి పరిష్కార మార్గాలున్నాయి.. తదితర వివరాలన్నీ అడిగిన వెంటనే ఆన్సర్ ఇచ్చేలా ఆల్గారిథాన్ని రూపొందించాడు. కేవలం సమాధానాలు ఇవ్వడమే కాదు.. చాట్ కి సంబంధించిన ఒక డ్రాఫ్ట్ కూడా ఇస్తాడు.

ఇల్లు లేని నిరుపేదలకు ఇదొక వరంలా మారింది. ఎందుకంటే లండన్ లాంటి నగరంలో పేదవాళ్లు లీగల్ అడ్వయిజ్ కాస్ట్ భరించలేరు. వందల పౌండ్లు అడుగుతారు. ఈ విషయంలో జోషువా ఎంతో గ్రౌండ్ వర్క్ చేశాడు. చాలామంది లాయర్లను కలిశాడు. అందులో ఉండే సాధకబాధకాల్ని తెలుసుకుని.. డూ నాట్ పే ఆల్గారిథాన్ని ఇలాంటి సేవలకు మళ్లించాడు.

ఒక్క యూకేలోనే కాదు.. అమెరికాలో కూడా ఇలాంటి సర్వీస్ అందించాలనే ఆలోచనతో ఉన్నాడు. కాకపోతే అక్కడి చట్టాలు తెలుసుకోడానికి చాలా టైం పడుతుంది. అదంత ఈజీ కాదని అతనికి తెలుసు. అయినా సరే, ఎలాగైనా సాధిస్తాననే పట్టుదతో ఉన్నాడు జోషువా.

శాస్త్ర సాంకేతిన విజ్ఞానం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ తరుణంలో 19 ఏళ్ల లండన్ కుర్రాడు క్రియేట్ చేసిన ఈ రోబో లాయర్ పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.