ఈ హిట్ వికెట్ సూపర్ హిట్

టి-20 క్రికెట్ క్రేజ్‌ను గుర్తించిన యువ బృందం... ఆన్ లైన్‌లోనే క్రికెట్ ఆటగాళ్లను కొనొచ్చు, గేమ్ ఆడించొచ్చు... ఖండాంతరాలకు వ్యాపిస్తూ ఎంతో మందిని మెప్పిస్తున్న హిట్ వికెట్... హిట్ వికెట్ గేమ్ రూపొందించిన హైదరాబాదీ యువకుడు కశ్యప్ రెడ్డి...

ఈ హిట్ వికెట్ సూపర్ హిట్

Tuesday June 16, 2015,

3 min Read


క్రికెట్‌లో టీ20 మ్యాచ్‌లు ఎంత ప్రాచుర్యం పొందాయో తెలియనిది కాదు. ఇప్పుడు ఆన్‌లైన్ వేదికగా టీ20 క్రికెట్ గేమ్ ‘హిట్‌వికెట్’ సంచలనం సృష్టిస్తోంది. 35 వేలకుపైగా యాక్టివ్ యూజర్లను దక్కించుకున్న ఈ గేమ్‌ను వీఐటీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన హైదరాబాద్‌కు చెందిన కశ్యప్ రెడ్డి, రిషవ్ రస్తోగితోపాటు రజత్ సింఘాల్, సౌరభ్ మహేశ్వరి అభివృద్ధి చేశారు. 

2012 మే నెలలో బీటా విడుదలైంది. ఆ తర్వాత ఆరు నెలల్లో కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. అనతి కాలంలోనే అభిమానులను సొంతం చేసుకుందీ గేమ్. అలెక్సా ఇంటర్నెట్ ప్రకారం భారత్‌లో టాప్-2,500, ప్రపంచంలో టాప్-20,000 వెబ్‌సైట్లలో హిట్ వికెట్.కామ్ ఒకటిగా నిలిచింది. గేమ్ ఎలా ఆడాలో ఇందులో సవివరంగా వివరించారు. ఆఫ్‌లైన్లోనూ కంపెనీ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనడం ద్వారా గేమ్‌ను మరింత ఉత్తమంగా ఎలా ఆడాలో ఔత్సాహికులు తెలుసుకుంటున్నారు. గత 48 గంటల్లో సుమారు 1,100 కొత్త టీమ్స్ ఏర్పడ్డాయి. 4,200 మంది ఆటగాళ్లు అమ్ముడయ్యారు. ఇప్పటి వరకు 59 లక్షలకు పైగా మ్యాచ్‌లు జరిగాయి. గేమ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన కశ్యప్ రెడ్డితో యువర్‌స్టోరీ సంభాషించింది.

image


యువర్ స్టోరీ- యూజర్లను దక్కించుకోవడంలో మీ వ్యూహం ఏమిటి?

కేఆర్: ఫేస్‌బుక్ ప్రకటనలు, యూజర్ ఆహ్వానం ద్వారా ఔత్సాహికులను చేరుకుంటున్నాం. మొత్తం యూజర్లలో 70 శాతం మంది యూజర్ ఆహ్వానం ద్వారా వచ్చి చేరినవారే. స్నేహితులు, వారి బృందాల్లో హిట్‌వికెట్‌కు ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. ఒక్కో ప్రాంతంలో గేమ్ ఆడుతున్న తీరు ఇట్టే తెలిసిపోతుంది.

యువర్ స్టోరీ- గేమ్‌ను ఎలా ప్రారంభించారు? ఆటంకాలేవైనా ఉన్నాయా?

కేఆర్: స్నేహితులు, కుటుంబ సభ్యులే తొలి యూజర్లు. మొదటి 200 మంది యూజర్ల పేర్లు మాకు అందరికీ తెలుసు కూడా. సాధారణ గేమ్స్‌తో పోలిస్తే ఇది అత్యంత భిన్నంగా ఉండడమే అతి పెద్ద అడ్డంకి. వ్యూహాత్మకంగా ఆడాల్సిన గేమ్ ఇది. నెలల తరబడి ఆడాల్సి ఉంటుంది. యూజర్లు కొంత కాలం తర్వాత వెనక్కి వెళ్లడాన్ని గమనించాం. ఈ నేపథ్యంలో గేమ్ ఎలా ఆడాలో తెలిపే ట్యుటోరియల్‌ను పరిచయం చేశాం. ఇది బాగా పనిచేసింది. యూజర్లు తిరిగి కొనసాగడం పెరిగింది.

యువర్ స్టోరీ- మీ భవిష్యత్ వ్యూహం ఏంటి? ఆఫ్‌లైన్ విశేషాలు తెలపండి?

కేఆర్: చదువు, ఉద్యోగం కారణంగా చాలా మంది ఒత్తిడికి లోనవుతున్నారు. ఒత్తిడిని దూరం చేసే ఔషధంలాగా హిట్‌వికెట్ గేమ్ ప్రారంభమైంది. మా అంచనాలను మించి ప్రయోజనాలు ఉంటున్నాయి. నగరాల మధ్యే కాదు విదేశాలకూ స్నేహాలు విస్తరిస్తున్నాయి. ఈ విషయంలో మేము వేదికగా నిలవడం ఆనందంగా ఉంది.

ఈ గేమ్ కారణంగా కళాశాల సీనియర్లతోనూ స్నేహం ఏర్పడింది. చదువుకునే రోజుల్లో వారితో పరిచయం కూడా లేదు. యూజర్లతో కూడిన హిట్‌వికెట్ ఫేస్‌బుక్ గ్రూప్‌లో వేలాది మంది సభ్యులుగా ఉన్నారు. ఫోరమ్‌లో ప్రతిరోజు వేలాది పోస్ట్‌లు వచ్చి చేరుతున్నాయి. ఆన్‌లైన్‌లో ఎన్నో గేమ్స్ ఉన్నాయి. గేమ్ ద్వారా పరిచయమైన వ్యక్తులను ప్రత్యక్షంగా కలుసుకోవడం వినూత్న, అరుదైన అనుభూతి. యూజర్ ఓ 10 నిముషాలు గేమ్‌లో కొనసాగడమే కష్టం. అలాంటిది మేము ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనడం మా విజయానికి నిదర్శనం. హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కత, కొచ్చి, పాట్నా, వడోదర, వెల్లూరు, పుణే తదితర నగరాల్లో సమావేశాలను ఏర్పాటు చేశాం.

యువర్ స్టోరీ- ఎంత మంది పెయిడ్ యూజర్లు ఉన్నారు?

కేఆర్: ప్రపంచవ్యాప్తంగా 35,000లకు పైచిలుకు యాక్టివ్ యూజర్లు ఉన్నారు. భారత్‌తోపాటు యూఎస్, ఇండోనేషియాలో అత్యధిక యూజర్లు ఉన్నారు. బంగ్లాదేశ్, శ్రీలంకలో విస్తరిస్తున్నాం. ఆండ్రాయిడ్ యాప్ 50,000 పైచిలుకు డౌన్‌లోడ్స్ నమోదయ్యాయి. సమయం వచ్చినప్పుడు పెయిడ్ కస్టమర్ల వివరాలు వెల్లడిస్తాం.

చెన్నైలో జరిగిన హిట్ వికెట్ ఆఫ్ లైన్ మీట్

చెన్నైలో జరిగిన హిట్ వికెట్ ఆఫ్ లైన్ మీట్


యువర్ స్టోరీ- కమ్యూనిటీని సృష్టించడంలో మీ అనుభవాలు ఏమిటి ?

కేఆర్: నలుగురు సభ్యులతో కూడిన బృందం మాది. కోడింగ్, నిర్వహణ కార్యకలాపాలకు తక్కువ సమయం ఉండేది. మ్యాచ్ సిమ్యులేషన్ అల్గోరిథం మాదిరిగానే యూజర్లు కూడా కీలకమని తెలుసుకున్నాం. ఫోరమ్స్‌కు మరింత సమయం కేటాయించడం ప్రారంభించాం. యూజర్లతో నిరంతరం సమావేశమవుతున్నాం. గేమ్ విషయంలో సమస్యలు ఏవైనా ఉన్నాయా అని వారి నుంచి తెలుసుకుంటున్నాం. వారిచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా గేమ్‌కు అప్‌గ్రేడ్ చేస్తున్నాం. యూజర్లిచ్చే సలహాలను ఓపికగా వింటున్నాం. గేమ్‌కు తోడవుతున్న ఫీచర్లలో అత్యధికం యూజర్ల సలహాలపై రూపొందినవే.