అందం.. అభినయం.. కరాటే..! ఈమె కత్తి కాదు.. అమ్మోరు కత్తి..!!

0

మోడలింగ్.. మార్షల్ ఆర్ట్స్. రెండింటికీ క్వయిట్ కాంట్రాస్ట్ ఉంది. రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడవు అన్నది ఎంత నిజమో- మోడలింగ్.. మార్షల్ ఆర్టస్ ఒకే దారిలో ఉండవు అన్నది కూడా అంతే వాస్తవం. అలాంటిది అలవోకగా రెండు ఫీల్డుల్లో అదరగొడుతున్నది పొడుగు కాళ్ల సుందరి సంధ్యాషెట్టి. ముంబైకి చెందిన ఈ మోడల్ ర్యాంప్ వాక్ లోనే కాదు కరాటే రింగులోనూ ఎదురులేదు. నాలుగు స్వర్ణాలు.. ఒక రజతం, నాలుగు కాంస్య పథకాలతో అటు అందాలను ఇటు రణవిద్యను ఏకఛత్రాధిపత్యంగా ఏలుతోంది.

తొమ్మిదేళ్ల క్రితం మొదటిసారి కరాటే ఎలా వుంటుందో ప్రత్యక్షంగా చూసింది. ఒకరి మీద ఒకరు ముష్టఘాతాలు కురిపిస్తుంటే ఆ క్షణంలో భయపడింది. కానీ ఎందుకో గేమ్ ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ఆలోచనలో పడింది. ఆడవారికి అందం, అణకువ ఉంటే చాలా? ధైర్యం సాహసం అక్కెర్లేదా అనిపించింది. మరోమాట లేకుండా కరాటే క్లాసులో జాయిన్ అయింది. అయితే అక్కడ ఉన్నవాళ్లంతా ర్యాంప్ మీద హొయలు పోయే ఈ అమ్మాయి కరాటే నేర్చుకోవడమేంటి? సుకుమారం తప్ప, రౌద్రం ఆమెకు ఎక్కడ చేతనవుతుంది? అని మొహం మీదే అన్నారు. అయినా కరాటే చేయడమంటే క్యాట్ వాక్ చేసినంత ఈజీ కాదని దెప్పిపొడిచారు.

ఆ మాటలన్నీ సంధ్య చెవిన పడ్డాయి. నీరుగారిపోలేదు. మరింత కసిపెరిగింది. ఆడది అంటే అందం ఒక్కటే కాదు.. అంతు చూసే ఆడపులి అనిపించుకోవాలని పట్టుపట్టింది. అంతే.. వింటిని విడిచిన బాణంలా దూసుకెళ్లింది. మొదటిసారి 2007లో మహారాష్ట్ర స్టేట్ ఛాంపియన్ షిప్ గెలుచుకుంది. అలా మొదలైన కరాటే ప్రస్థానం ఆగలేదు. గెలుపు అలవాటైంది. ఓటమి దరిదాపుల్లో కూడా లేదు.

కరాటే కంటే ముందు 2000 సంవత్సరంలో సంధ్య మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. వాస్తవానికి ఈ రంగానికి వస్తానని అనుకోలేదు. లాయర్ లేదంటే ఆర్మీలోకి వెళ్లాలని భావించింది. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్టు.. అనుకోకుండా ఈ గ్లామర్ ఫీల్డులోకి వచ్చింది. కాలేజీ రోజుల్లో స్నేహితులు ఆమెను ఫెమినా మిస్ ఇండియా ఈవెంట్ లో పాల్గొనవలసిందిగా ఒత్తిడి చేశారు. అలా అందాల ప్రపంచంలో ఆమె తొలి అడుగు పడింది. ఆ తర్వాత అనేక ర్యాంప్ షోస్, ప్రింట్, మ్యూజిక్ వీడియోలలోనూ పాల్గొంది. పలు బుల్లితెర షోలకు హోస్ట్‌ గా వ్యవహరించింది.

సంధ్య దైనందని జీవితం ఉదయం 6 గంటలకు కరాటే సెషన్ తో మొదలవుతుంది. ఆహారం విషయంలో చాలా కఠినంగా ఉంటుంది. రాత్రి 10.30కల్లా నిద్రపోతుంది. సెల్ఫ్ డిసిప్లయిన్, టైం మేనేజ్మెంట్ అంతా కరాటేతోనే అబ్బింది. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన సంధ్య ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. అందుకే మహిళకు చదువు, రక్షణ, ఆర్ధిక స్వావలంబన ఎంతో ముఖ్యం అనేది ఆమె నమ్మిన సిద్ధాంతం.

Related Stories

Stories by team ys telugu