రోబో టెక్నాలజీతో చేపల పెంపకం..! హైదరాబాద్ కుర్రాళ్ల సూపర్ ఐడియా!!  

1

మన దగ్గర చేపల పెంపకం పూర్తిగా మాన్యువల్. మేత వేయడం దగ్గర్నుంచి ఎగుమతి చేసేదాకా అంతటా మనుషులు చేసే పనే. ఒకటీ అరా చోట్ల టెక్నాలజీ తోడైనా, ఓవరాల్ ఉత్పత్తిలో దాని ప్రభావం పెద్దగా లేదు. ఈ గ్యాప్ ని పూరిస్తూ, చేపల పెంపకంలో రోబో టైప్ టెక్నాలజీని జోడిస్తూ ముందుకు వచ్చింది అక్వా సోల్ స్టార్టప్.

చేపల ఉత్పత్తుల్లో ప్రపంచంలో చైనా తర్వాత ఇండియాదే స్థానం. విచిత్రం ఏంటంటే టెక్నాలజీ సాయంతో చైనా అగ్రభాగాన నిలబడితే.. ఏ సాంకేతిక పరిజ్ఞానం లేకుండానే భారత్ ద్వితీయ స్థానంలో ఉంది. చైనా 460 లక్షల టన్నుల చేపల్ని ఉత్పత్తి చేస్తే, ఇండియా 40 లక్షలకే పరిమితమై పోయింది. ఇందుకు కారణం అక్వా కల్చర్‌ లో టెక్నాలజీని పెద్దగా వాడకపోవడమే.

ఇలాంటి సమస్యకు టెక్నాలజీని జోడిస్తే, చేపల పెంపకంలో ఏ మేరకు లాభాలు వస్తాయో ప్రాక్టికల్ గా చేసి చూపిస్తామంటోంది అక్వా సోల్ స్టార్టప్. ఒకరకంగా చెప్పాలంటే ఇది రోబో టెక్నాలజీ. దీంతో చేపలకు మేత వేయడం చాలా ఈజీ. ప్రతీ చేపకు సమానంగా ఆహారం అందేలా చూస్తుంది. చేపలకొచ్చే సీజనల్ వ్యాధుల్ని సకాలంలో గుర్తిస్తుంది. ఇది నీళ్లలో తిరుగుతూ కంటిన్యూగా మానిటర్ చేస్తుంది. వాటర్ హెల్త్ ని ట్రీట్ చేస్తుంది. శాంపిల్స్, టెంపరేచర్, ఆక్సిజన్ విలువల్ని అన్నీ ఎప్పటికప్పుడు క్లౌడ్ కి పంపిస్తుంది. ఆర్టిఫీషియల్ ఇంటలెటిజెన్స్ లో ఏర్పాటు చేసిన మిషన్ లెర్నింగ్స్ ఆల్గారిథమ్స్ ద్వారా, నీటిలో జరిగే నిరంతర ప్రక్రియను ఈ రోబో స్టడీ చేస్తుంది. మార్పులను ఏకకాలంలో అటు అక్వా లాబ్ టెక్నీషియన్ కీ, ఇటు రైతుకీ చేరవేస్తుంది. దాన్ని బట్టి ఫార్మర్ వెంటనే తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాడు. ఇటు లాబ్ టెక్నీషియన్ కూడా -ఇంకా బెటర్ ట్రీట్‌మెంట్ కోసం ఏం చేయాలో చెప్తూ, రైతుకు సూచనలు సలహాలు ఇస్తాడు.

ఐదెకరాల చేపల చెరువుకు కావాల్సిన రోబో టెక్నాలజీకి రూ.2.5 లక్షలకు పైనే అవుతుందని అక్వా సోల్ ఫౌండర్ హరి అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం వేలాది చెరువుల్లో చేపల్ని పెంచుతున్న నేపథ్యంలో, ఇలాంటి టెక్నాలజీని ప్రవేశ పెట్టడం వల్ల చేపల ఉత్పత్తిలో అనుకున్నదానికంటే మెరుగైన ఫలితాలను సాధించవచ్చని అంటున్నారు.

అక్వా సోల్ ప్రోటో టైప్ రోబోని ఓఆర్ఎల్ ఇండస్ట్రీస్ అనే సంస్థ ఇంక్యుబేట్ చేస్తోంది. చేపల పెంపకంలో వచ్చే సమస్యలకు శాశ్వత పరిష్కారం చెప్పే ఈ ఐడియా వాళ్లకు నచ్చి ఇంక్యుబేట్ చేశారు. మెంటార్ సపోర్ట్ ఇప్పించారు. హాకథాన్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే ఎన్ఐఆర్ డీపీఆర్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రిస్క్-2017లోనూ మంచి స్పందన వచ్చింది.

అక్వా సోల్ టీం

ఫౌండర్ హరిబాబుతో కలిపి తొమ్మిది మంది వర్క్ చేస్తున్నారు. మధు పర్వతనేని కో ఫౌండర్/ఎండీ. అర్చనా రావ్-సీఆర్ మేనేజర్. సీటీవో- సూర్యకుమార్. అనిల్ కుమార్ మార్కెటింగ్ వ్యవహరాలు చూసుకుంటాడు. కిరణ్ రెడ్డి- చీఫ్ ఆండ్రాయిడ్ డెవలపర్. ముత్తాహర్- చీఫ్ కొల్లాబరేషన్స్. రమేశ్ - హార్డ్ వేర్ ఇంజినీర్. నవీన్- హార్డ్ వేర్, అప్లికేషన్ ఇంజినీర్.

గ్రామీణ ఆర్ధిక పరిపుష్టి కోసం వేలాది చెరువుల్లో లక్షలాది చేపల్ని పెంచుకున్న ప్రభుత్వం- తమ స్టార్టప్ కి ఆర్ధికంగా సాయం చేస్తే, సీఎం కేసీఆర్ నినాదమైన నీలివిప్లవం నిజం కావడానికి ఎంతో కాలం పట్టదని- అక్వా సోల్ ఫౌండర్ హరి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related Stories