కార్పొరేట్లకే వ్యాపార సూత్రం నేర్పిన 'రంగసూత్ర'

స్వచ్ఛంద సంస్థ ఒకప్పటంత స్వచ్ఛత లేదని ఇప్పుడు జనాల అభిప్రాయం. లాభాలు లేకుండా ఒక పదిమందికో, ఇరవై మందికో మేలు చేస్తూ దానికే అమితమైన ప్రచారం కల్పించుకునే సంస్థలు ఇప్పుడు దేశంలో అనేకం. చివరకు ఎన్జీఓ ఒక ఫ్యాషన్ లా తయారైపోతోందనే రోజులివి. కానీ ఎన్జీఓ అంటే గ్రాంట్ల కోసం తాపత్రయపడ్తూ, ఎవరో విదిల్చే నాలుగు డబ్బులపై ఆశపడడం కానేకాదని రుజువు చేశారు సుమితా ఘోష్. సొసైటీ ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపయోగపడ్తూ, వాళ్ల కాళ్లమీద వాళ్లే నిలబడేలా ఆత్మస్థైర్యాన్ని, అంతకుమించి మెరుగైన జీతాన్ని, జీవితాన్ని అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కార్పొరేట్ ప్రపంచానికి కూడా ఇప్పుడు 'రంగసూత్ర' అనేక వ్యాపారసూత్రాలను నేర్పిస్తుంది.

కార్పొరేట్లకే వ్యాపార సూత్రం నేర్పిన 'రంగసూత్ర'

Thursday March 26, 2015,

5 min Read

సుమితా ఘోష్. కలకత్తాలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఈమె ముంబైలో చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి నలుగురికీ సాయపడాలనే తపన. అట్టడుగు వర్గాలను చూస్తే ఆపుకోలేనంత దుఃఖం, వాళ్లకు ఏదో చేయాలనే తాపత్రయమే నిత్యం ఆమెను వెంటాడేది. జీవిత చక్రంలో భాగంగా ఆమె సంజయ్ ఘోష్ ను వివాహమాడారు. అదృష్టమేంటంటే... ఇద్దరి భావాలు, ఆశయాలు ఒక్కటే. నలుగురికీ మేలు చేయాలని ఆలోచిస్తున్న సమయమది. అప్పటికే సహకార సంఘాల హవా నడుస్తోంది. అమూల్ లాంటి సంస్థలు నిలదొక్కుకుని నలుగురికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా కనిపిస్తున్నాయి. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని సామాజిక సేవలో భాగంగా 1980 నుంచి 1990 మధ్య ఇద్దరూ రాజస్థాన్ లోని ఉత్తరీ రాజస్తాన్ మిల్క్ యూనియన్ ట్రస్ట్ తో కలిసి పనిచేశారు. కానీ దురదృష్టం వీరిని వెంటాడింది. తీవ్ర కరువుతో పాడి పరిశ్రమ పడకేసింది. 1987లో వచ్చిన తీవ్ర కరువుతో వ్యాపారం మూతబడింది. ఆర్థికంగా నష్టపోయారే కానీ.. ఆలోచనల్లో మాత్రం వీళ్లిద్దరికీ కొదవలేదు. స్థానికులకు చేతిపనులు నేర్పిస్తూ, వారికి జీవనోపాధి కల్పించాలని నిర్ణయించుకున్నారు. అనేక కారణాల వల్ల ఇద్దరూ అస్సాం రావాల్సి వచ్చింది. అదే టైంలో మజౌలీ పరీవాహక ప్రాంతాల్లో ఏదో సమస్య వచ్చింది. దీన్ని పరిష్కరించడానికి పోయిన సంజయ్ ను ఉల్ఫా తీవ్రవాదులు 1997లో అపహరించారు. జీవితంలో ఆమెకు ఇది కోలుకోలేని ఎదురుదెబ్బ.

సమాజాన్ని ఉద్ధరిస్తామని వచ్చి చివరకు భర్త సమాచారం కూడా తెలుసుకోలేని స్థితి ఎదురైంది. ఎందుకు తీసుకెళ్లారో తెలీదు, ఎప్పుడు వదిలేస్తారో తేలీదు.. ఇంతకూ బతికి ఉన్నాడో లేదో తెలియని భర్త గురించి ఆమెపడిన ఆరాటాన్ని వర్ణించలేం. బాధాకరమైన విషయం ఏంటంటే.. ఇంతవరకూ ఆయనే జాడే తెలియరాలేదు.

సుమితా ఘోష్, రంగసూత్ర రూపకర్త

సుమితా ఘోష్, రంగసూత్ర రూపకర్త


సుమితా ఘోష్ అక్కడితో ఆగిపోతే ఇప్పుడు మనందరికీ ఆదర్శంగా నిలిచేవారే కాదు. అదే ఆమె జీవితంలో టర్నింగ్ పాయింట్. ఆమె తీసుకున్న కఠినమైన, సాహసోపేతమైన నిర్ణయం ఇప్పుడు వేలాది మంది కుటుంబాలకు ఆసరా అయింది. ఖాళీ కడుపుతో పడుకోకుండా కాలర్ ఎగిరేస్తున్నారంటే, దానివెనుక ఆమె చేసిన కృషి అంత పకడ్బందీగా ఉందని అర్థం.

ఆలోచనే ఆస్తి !

2005లో ఆమె రంగసూత్ర అనే సంస్థకు ప్రాణం పోశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అట్టడుగు వర్గాల వారి జీవన ప్రమాణాలు పెంచడమే ఈ సంస్థ ఉద్దేశం. కొనుగోలుదార్లకు, వ్యాపారులకు, వృత్తి నిపుణులందరికీ కలిపి రూపొందిన ఒక వేదికే ఈ రంగసూత్ర. అయితే ఏదైనా ఒక సంస్థ నడవాలంటే గ్రాంట్ల రూపంలో నిధులైనా రావాలి, లేకపోతే సొంత డబ్బులైనా ఖర్చు చేయాలి. ఉదారంగా వచ్చే సొమ్ముతో ఎంత కష్టపడి పనిచేసినా పూర్తిస్థాయి సంతృప్తి ఉండదనేది ఆమె భావన. అందుకే ఒక కొత్త తరహా బిజినెస్ మోడల్ కు రెండు దశాబ్దాల క్రితమే తెరతీశారు. సహకార సంఘాల స్థాయిని కార్పొరేట్ పబ్లిక్ ఇష్యూ స్థాయికి తీసుకెళ్లారు.

నాణ్యమైన వస్తువులు, బట్టలు, బొమ్మలకు రంగసూత్రను కేరాఫ్ అడ్రస్ చేయాలనేది ఆమె సంకల్పం. పనిరాని వాళ్లకు పనినేర్పించాలి, వచ్చిన వాళ్లకు నైపుణ్యం పెంచి వాటికి మంచి విలువను జోడించాలి. అందుకోసం గ్రామగ్రామాలకు తిరిగి విశేషమైన పరిశోధన చేశారు. ఆ యా ప్రాంతాల్లో ఎప్పటి నుంచో చేస్తున్న వృత్తిపని వారితో ఒప్పించారు. మంచి నాణ్యమైన సరుకును సరైన సమయంలో తయారు చేసి ఇవ్వాలని మాట్లాడుకుని వచ్చారు. అయితే ఇందులో ఏం గొప్పదనం ఉంది, అన్ని వ్యాపారాల్లానే ఇదీ అంతే అనుకుంటాం. కానీ ఇది పూర్తిగా విభిన్నం.

మోడల్ బిజినెస్

రంగసూత్ర పేరుతో సంస్థను మొదలుపెట్టిన సుమితా ఘోష్ రూ.10 లక్షల సొంత పెట్టుబడి పెట్టారు. గతంలో ఆమెకు ఉన్న అనుభవం, కొత్త వ్యాపార ఆలోచనకు కొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి. ఇది వ్యాపారం కాబట్టి ఆ కోణంలోనే ఆలోచించి ఇన్వెస్ట్ చేశాయి. అప్పట్లోనే ఆవిష్కార్ సంస్థ రూ.23 లక్షలు, ఫ్యాబ్ ఇండియాకు చెందిన ఆర్టిసన్స్ ఫండ్ నుంచి రూ.30 లక్షలు అందాయి. రెండు కంపెనీలకు యాభై శాతం వాటా వచ్చింది. స్థానికులు, చేతివృత్తుల వాళ్లను కూడా ఒప్పించి పెట్టుబడి పెట్టేలా చేశారు. ఇక్కడే ఘోష్ అద్భుత విజయం సాధించారని చెప్పాలి. 1200 మంది సభ్యుల్లో ఒకొక్కరి నుంచి రూ.1000 సమీకరించారు. ఇదో పన్నెండు లక్షల వరకూ పోగైంది. ఇప్పుడు సభ్యులంతా కంపెనీకి ఓనర్లైపోయారు. సుమితా ఘోష్ సహా ఇతర ఆర్టిసన్ సభ్యులందరి వాటా కలిపి మరో యాభై శాతం ఉంది.

డబ్బులు సమీకరించగానే సరిపోదు. దాన్ని నుంచి పూర్తిస్థాయి ఉత్పాదకత రాబట్టినప్పుడే అందరికీ ప్రయోజనం. అందుకే వివిధ రాష్ట్రాల్లోని స్వచ్ఛంద సంస్థలు, చేతివృత్తి నిపుణులతో చర్చలు జరిగాయి. నాణ్యతలో ఏ మాత్రం రాజీపడకుండా సరుకును తయారు చేయడం అర్టిసన్స్ వంతు. దాన్ని మార్కెటింగ్ చేసి అమ్మడం ఫ్యాబ్ ఇండియా బాధ్యత. కాలానికి తగ్గట్టు ఫ్యాషన్లను మార్చుకుంటా జనాలకు అభిరుచులకు నప్పేట్లు వస్తువులను రూపొందిస్తూ వచ్చారు చేతివృత్తుల వాళ్లు. ఈ యజ్ఞంలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ నుంచి ఇద్దరు వచ్చిన ఇద్దరు డిజైనర్ల రితు సూరి, రుచి త్రిపాఠి కూడా మెళకువలు నేర్పుతూ వచ్చారు. పేరుకు స్వచ్చంద సంస్థ, సొసైటీ మోడలే అయినా ఇక్కడ భాగస్వామ్యులంతా ఒక రకంగా పెట్టుబడిదార్లే. నాలుగు డబ్బులు పెట్టారంటే ఎవరైనా లాభాలనే ఆశిస్తారు. రంగసూత్ర కూడా ఎవరి ఆశలనూ వమ్ము చేయలేదు. సంస్థ ఏర్పాటు చేసిన రెండు, మూడేళ్లలోనే లాభ-నష్టరహిత స్థాయికి(బ్రేక్ ఈవెన్)కు వచ్చేసింది. అప్పటి నుంచి ఎంతో కొంత లాభాలు కంపెనీకి వస్తూనే ఉన్నాయి. 2010లోనే రంగసూత్ర దాదాపు రూ.10 కోట్ల టర్నోవర్ స్థాయికి ఎగబాకి అందరినీ ఆశ్చర్యపరిచింది.

రంగసూత్ర సభ్యులు

రంగసూత్ర సభ్యులు


మహిళలే మహరాణులు !

రంగసూత్ర ఆలోచన ఒక్కటే. గ్రామీణ ప్రాంత మహిళల అభ్యున్నతి. అందుకే చేతి వృత్తి నిపుణుల ఆడా-మగా అనే బేధం ఇక్కడ లేదు. ఎవరికైనా పీస్ రేట్ ఒక్కటే. ఎంతఎక్కువ కష్టపడితే అంత ప్రతిఫలం దక్కుతుంది. ఆశ్చర్యం ఏంటంటే సంఘంలో దాదాపు 70 శాతం మంది మహిళలే పనిచేస్తున్నారు. ఒకప్పుడు బీడీలు చుట్టుకుంటూనో లేక మట్టిపనులకు వెళ్తూనో యాభై, వంద సంపాదించేవారు ఇప్పుడు హుందాగా జీవించడం మొదలుపెట్టారు. నెలకు రూ. 3-5వేలు సంపాదిస్తున్నారు. నిపుణత సాధించిన మగవాళ్లైతే నెలకు రూ.10 వేల వరకూ హ్యాపీగా కూటబెట్టుకుంటున్నారు. ఇప్పుడు రంగసూత్రకు ఐదు రాష్ట్రాల్లో దాదాపు 2000 మంది ప్రత్యక్ష సభ్యులు ఉన్నారు. మొదట ముగ్గురితో మొదలైన సంస్థ ఇప్పుడు ముప్ఫై గ్రూపుల స్థాయికి విస్తరించింది.

లాభాల పంట !

సామాజిక సేవ పేరుతో వ్యాపారం ప్రారంభినప్పటికీ... ఈ బిజినెస్ మోడల్ వేరు. ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ మార్కెట్లో ఎక్కువ రేట్లు పెట్టి కొనేందుకు ఎవరూ సిద్ధపడరు. అలా అని అతితక్కువ లాభాలతో పనిచేయడానికి పనివాళ్లు కూడా ఒప్పుకోరు. అందుకే ఉత్పత్తి పెరిగితే తక్కువ లాభాలైనా ఎక్కువ ఆదాయం వస్తుందని తమ సభ్యులకు అర్థమయ్యేలా ఘోష్ వివరించారు. దీన్ని అర్థం చేసుకున్న సభ్యులు.. రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. దీంతో లాభాలు కూడా అదే స్థాయిలో వచ్చిపడ్డాయి. 2008 వరకూ ఈ సంస్థ తమ షేర్ హోల్డర్లకు 10 శాతం డివిడెండ్ ఇస్తూ వచ్చింది. ఆ తర్వాత 2009లో డివిడెండ్ 25 శాతానికి పెరిగింది. కార్పొరేట్ యాంగిల్ లో చూస్తే ఇది నిజంగా అద్భుతమైన రాబడి. రంగసూత్రను నమ్మి పెట్టుబడి పెట్టిన వాళ్లందరికీ మెరుగైన లాభాలే వచ్చాయి. వంద రూపాయలు ఉన్న షేర్ విలువ ఏకంగా ఐదు రెట్లు పెరిగి రూ.500 చేరింది. రాబోయే పదేళ్లలో కంపెనీ టర్నోవర్ రూ.100 కోట్ల వరకూ సాధిస్తుందని వివిధ సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీన్ని బట్టే అర్థమవుతోంది రంగసూత్ర సాధించిన విజయమేంటో !

ఎగుమతులే లక్ష్యం !

ప్రస్తుతం రంగసూత్ర కేవలం ఫ్యాబ్ ఇండియాకు మాత్రమే తమ ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. తాము తయారు చేసే వాటిల్లో దాదాపు 95 శాతం ఫ్యాబ్ ద్వారానే విక్రయమవుతున్నాయి. అయితే రాబోయే రోజుల్లో ఒకరినే నమ్ముకుని వ్యాపారం చేస్తే ఇబ్బందులు తప్పకపోవచ్చని సుమితా ఘోష్ భావిస్తున్నారు. అందుకే సాధ్యమైనంత వరకూ రిస్కును డైవర్సిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు యూకె, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ కూ తమ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నా... అది తక్కువ శాతం మాత్రమే. రాబోయే రోజుల్లో ఎగుమతుల పెంచి భారతీయ వాసనను ఇతర దేశాల్లో కూడా గుభాళించాలనేదే ఇప్పుడు ఆమె ముందున్న భారీ లక్ష్యం. ఆమె టార్గెట్ త్వరగా చేరుకోవాలని, మరింత మందికి ఉపాధిని కల్పించాలని మనమూ కోరుకుందాం.

రంగసూత్ర ఉత్పత్తులు

రంగసూత్ర ఉత్పత్తులు