సర్కారు నౌకరీ వదిలేసి కలబంద సాగుచేశాడు..! కోటీశ్వరుడయ్యాడు..!!

సర్కారు నౌకరీ వదిలేసి కలబంద సాగుచేశాడు..! కోటీశ్వరుడయ్యాడు..!!

Tuesday November 01, 2016,

2 min Read

టైటిల్ చూసి ఆశ్చర్యపోయారా..? నిజంగా అలోవిరా సాగుచేస్తే అంత డబ్బు వస్తుందా అని ఆలోచనలో పడ్డారా..? హరీష్ ధాన్ దేవ్ కథ చదివాక నిజమే అని మీరే నమ్ముతారు.

హరీష్ ఒక గవర్నమెంట్ ఉద్యోగి. కడుపులో చల్ల కదలని నౌకరి. అయినా జీవితం హ్యాపీగా లేదు. 100కు పైగా ఎకరాలున్న రైతు కుటుంబ నేపథ్యం. మనసంతా మట్టిమీదికి లాగుతోంది. ఎద్దుల వెనక నడవాలని, పొలం దున్నాలని, మొక్కలు ఏపుగా పెరిగితే వాటిని ప్రేమగా నిమరాలని.. ఏవేవో ఆలోచలను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఆ క్రమంలో ఒకసారి ఢిల్లీలో అగ్రి ఎక్స్ పో జరుగుతుంటే అక్కడికి వెళ్లాడు. సరిగ్గా ఆ టైంలో తనకున్న ఐడియాలజీకి సంకల్పం తోడైంది. చెప్పాలంటే లైఫ్ టర్న్ కూడా తీసుకుంది. సెకండ్ థాట్ లేకుండా ఉద్యోగానికి గుడ్ బై కొట్టాడు. అలోవిరా సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. దాంతోపాటు తనకున్న 120 ఎకరాల్లో ఇతర పంటలు వేయాలని డిసైడ్ అయ్యాడు.

కలబంద ఒక ఔషధ మొక్క. ఎడారిలో ఎక్కువగా పెరుగుతుంది. పెద్దగా నీళ్లు అవసరం లేదు. ఎండతాకితే చాలు. అదే ఎదుగుతుంది. ఆయుర్వేదంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. ఫేస్ ప్యాక్ నుంచి హెయిర్ ఫాలింగ్ వరకు కలబంద తిరుగులేని ఔషధం. ఇంటర్నల్ ఎంతగా వాడతారో, ఎక్స్ టర్నల్ కూడా అంతే విరివిగా ఉపయోగిస్తారు. పతంజలి ప్రాడక్ట్స్ లో దీని పర్సంటేజీ ఎక్కువగా ఉంటుంది.

image


ముఖ్యంగా ఎడారి ప్రాంతంలో పెరిగే కలబందకు జాతీయంగా, అంతర్జాతీయంగా బీభత్సమైన డిమాండ్ ఉంది. నాణ్యమైన కలబంద ఎక్కడ దొరికినా పతంజలి అస్సలు వదిలిపెట్టదు. ఎంత ధరైనా సరే ఆర్డర్ ఇస్తుంది. అలాంటి కలబందను సాగు చేయడంలో హరీష్ సఫలమయ్యాడు. అలోవిరాతో పాటు ఆమ్లా, గుండ అనే మొక్కలు కూడా సాగుచేశాడు.

రాజస్థాన్ జైసల్మేర్. అక్కడ సజ్జలు, గోధుమ, కందులు ఎక్కువగా పండుతాయి. కానీ అగ్రో ఎక్స్ పోని సందర్శించాక హరీష్ మనసు కలబంద మీదకే లాగింది. బేబీ డెన్సిస్ అనే ప్రత్యేక జాతి మొక్కలను పెంచాడు. దానికి బ్రెజిల్, హాంగ్ కాంగ్, అమెరికా లాంటి దేశాల నుంచి విపరీతమైన గిరాకీ ఉంటుంది. మొదటగా 80వేల మొక్కలు నాటాడు. ఇప్పుడవి 7 లక్షలు దాటాయి. గత నాలుగు నెలల్లో 125 నుంచి 150 టన్నుల కలబందను పతంజలి ఫ్యాక్టరీకి అమ్మాడు. దీన్నిబట్టి వాటికి ఎంత డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పుడు హరీష్ ఏడాది టర్నోవర్ ఎంతో తెలుసా? ఎంత లేదన్నా కోటిన్నర నుంచి 2 కోట్ల దాకా ఉంటుంది. నాచుర్లో అగ్రో పేరుతో సొంత కంపెనీ కూడా స్థాపించాడు. జైసల్ముర్ కు 45 కిలోమీటర్ల దూరంలో ధైసర్ అనే ప్రాంతంలో దాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడర్ధమైందా.. హరీష్ జూనియర్ ఇంజినీర్ ఉద్యోగం ఎందుకు వదిలేశాడో.. అద్గదీ సంకల్ప బలమంటే..