ఉత్తమ CEO అంటే ఎవరు ?

ఎవరికీ రిపోర్ట్ చేయకపోయినా అన్నీ తానై నడిపించాలి..కస్టమర్లు, షేర్ హోల్డర్లను బ్యాలెన్స్ చేయాలి..సమర్థులైన ఉద్యోగులను వెన్నుతట్టి ప్రోత్సాహించాలి..రాజకీయ చతురత కూడా ముఖ్యమే..తాడుపై నడుస్తూ నాలుగు బంతులను గాల్లో ఆడించేవాడే సిఈఓ..గెస్ట్ రైటర్ - జోయల్ పీటర్సన్ వ్యాసం..

ఉత్తమ CEO అంటే ఎవరు ?

Friday July 24, 2015,

2 min Read

'నేను పెద్దయ్యాక సిఈవోని అవుతా నాన్న' అనేసరికి నేను ఉలిక్కిపడ్డా. 'ఎందుకురా?' అని అడిగితే, 'నేను ఎవరికి రిపోర్టు చేయనక్కరలేదు కదా!' అన్నాడు మా చిన్నబ్బాయి.

మా తండ్రికొడుకుల సంభాషణని ఏ సిఈవో చదివినా పగలబడి నవ్వుతారు. మా అబ్బాయికి తెలిసినంతవరకు సిఈవోకి మించినవాళ్లెవరూ లేరు. ఆయన ఎవరికీ రిపోర్టు చేయనక్కరలేదు. అయితే, ఇక్కడ వాడికి అర్థం కానిదేమిటంటే.. ఎవరికీ రిపోర్టు చేయాల్సిన పని లేకుండానే పరిస్థితులను చక్కదిద్దే బాధ్యతను మోస్తుంటారు.

షేర్‌ హోల్డర్లు, కస్టమర్లు, ఉద్యోగులు, సప్లయిర్లు, కమ్యూనిటీలు, ఋణదాతలు... ఇలా చాలామందికి సిఈవోలు బాధ్యులై ఉంటారు. పట్టు విడుపు ధోరణులతో పడవ ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. కంపెనీ భాగస్వాముల భిన్న ప్రయోజనాలను పట్టించుకోవాలి. సరైన లావాదేవీలు సాగించాలి. ఇవన్నీ సమర్థుడైన సిఈవో చేయాల్సిన పనులు. 'కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం' అన్నది మరవకుండా ఉభయతారకమైన మార్గాన్ని ఎంచుకుని కంపెనీని లాభాల బాట పట్టించాలి.


image


ఉదాహరణకు... ఉచిత బహుమతులు, సేవలు అందిస్తే కస్టమర్లు సంతోషపడతారు. కానీ, ఋణదాతలు, షేర్‌ హోల్డర్లు భారంగా భావిస్తారు. అలాగే, సప్లయిర్లను కష్టపెట్టి లాభాల మార్జిన్‌ను పెంచుకోవచ్చు. ఇది కొంతకాలమే సాగుతుంది. దీర్ఘకాలంలో పడకేస్తుంది.

కాబట్టి, సిఈవో అనేవాడిది తాడుపై నడక. ఏకకాలంలో మూడు నాలుగు బంతులను గాలిలో ఆడించగల నేర్పరితనం సిఈవోకి ఉండాలి. వాళ్లు ఏం చేసినా సరైనదేననే నమ్మకాన్ని కలిగించగలగాలి. సమర్థులైన సిబ్బందిని ఎంచుకోవాలి. అసమర్థులను వదిలించుకోవాలి. మంచి టీమ్‌ని ఏర్పరచుకోవాలి. అడ్డంకులను తొలగించుకోవాలి. సంస్థకు స్వల్పకాల, మధ్యంతర, దీర్ఘకాలాల్లో విజయాన్ని తెచ్చిపెట్టగలవారిని గుర్తించి ప్రోత్సాహకాలు అందించాలి. మంచయినా, చెడయినా నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుండాలి. వాళ్లదే తుది మాట. వాళ్ల మాటకు, చేతకు కట్టుబడి ఉండేలా విశ్వాసాన్ని పాదుగొల్పాలి.

సిఈవోలు రాజకీయ నాయకులు కారుగానీ, రాజకీయ చతురులై ఉంటారు. ఎందుకంటే, వ్యాపారాన్ని నడపడమనేది ప్రజాస్వామ్యం కాదు. నిర్ణయాలు తీసుకోవడంలో అందరి ప్రమేయం ఉంటుందిగానీ; ఒకసారి సిఈవో నిర్ణయమంటూ తీసేసుకున్నాక, దానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి అనుకున్నది సాధించి తీరాల్సిందే.

నాతో సహా ఎంతోమంది సిఈవోలు ఇంతకాలంగా వస్తున్నారు, పోతున్నారు. విజయ సాధన అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకే, ఒక సిఈవోని నియమించుకునేటప్పుడు అతను/ఆమెకు సంస్థకు సంబంధించిన సరైన ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చి, తీర్చిదిద్దుకోవాలి. ఇది బోర్డు డైరెక్టర్ల ప్రాథమిక బాధ్యత. ఒకవేళ బ్రాండ్‌-న్యూ సిఈవోని తీసుకున్నా ఇదే సూత్రాన్ని పాటించాలి. తమ సక్సెషన్‌ ప్లాన్‌ని వివరించాలి.

ఇక, అన్నింటికి మించి, సిఈవోలకు పుస్తక పరిజ్ఞానం ఎంత ఉన్నా మార్కెట్‌ అనేదే నిజమైన గురువు. కస్టమర్ల అభిరుచులు, స్థోమత రెండింటినీ తూకం వేయగలగాలి. వాళ్లు ఏం కొంటున్నారు, ఎందుకు కొంటున్నారు ? కస్టమర్లకు సరైన న్యాయం చేస్తున్నామా అనేది గ్రహించాలి. అలాగే, మార్కెట్ తీరుతెన్నులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తుండాలి.

రచయిత గురించి జోయల్‌ పీటర్‌సన్‌ జెట్‌బ్లూ ఎయిర్‌వేస్‌ చైర్మన్‌. ఈయన ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థయిన పీటర్‌సన్‌ పార్ట్‌నర్స్‌ సంస్థాపక భాగస్వామి. పలు పరిశ్రమలకు మూల పెట్టుబడులను అందించిన సుదీర్థ చరిత్ర ఉంది. స్టాన్‌ఫోర్డ్‌ గ్రాడ్యుయేట్‌ బిజినెస్‌ స్కూల్‌లో ఆంట్రప్రెన్యూరల్ మేనేజ్‌మెంట్‌ బోధిస్తున్నారు. అదే స్కూల్‌కి చెందిన లీడర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ సెంటర్‌కి డైరెక్టరుగా ఉన్నారు. ఫ్రాంక్లిన్‌ కావీ అండ్‌ లాడర్‌ క్యాపిటల్‌ సంస్థకు కూడా డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు ఆయన దేశంలోని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లలో ఒకటైన ట్రామెల్‌ క్రో కంపెనీకి మేనేజింగ్‌ పార్ట్‌నర్‌గా పనిచేశారు.