డిజిటల్ మార్కెటింగ్ లో వదిలించుకోవాల్సిన "ఐదు గుదిబండలు"

మారుతున్న కాలంతో మార్చుకోవాల్సిన మార్కెటింగ్ ట్రెండ్స్ పై విశ్లేషణ

డిజిటల్ మార్కెటింగ్ లో వదిలించుకోవాల్సిన "ఐదు గుదిబండలు"

Friday May 13, 2016,

3 min Read


కాలం వేగంగా మారుతోంది. ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ గా లేకపోతే వెనుకబడిపోతాం. వ్యాపార భాషలో చెప్పాలంటే నష్టపోతాం. పాతకాలానికి చెందిన అవే పాతపద్దతులు పట్టుకుని వేలాడబడితే మొదటికే మోసం వస్తుంది. మార్కెటింగ్ విషయంలో ఈ మార్పు రోజురోజుకి కొత్తకొత్తగా మారిపోతోంది. టెక్నాలజీ ప్రపంచంలో డిజిటల్ మార్కెటింగ్ విశ్వరూపం చూపించడం ప్రారంభించిన తర్వాత ఎన్నో కొత్త మార్కెటింగ్ ఆవిష్కణలు వచ్చాయి. రోజుకొక కొత్త కాన్సెప్ట్ పుట్టుస్తోంది. దీన్ని అడాప్ట్ చేసుకోగలిగితేనే ప్రయోజనం. మూస పద్దతుల్లోనే వెళ్తుంటే అర్జంట్ గా మిమ్మల్ని మార్చుకునే ప్రయత్నం చేయాల్సిందే.

మీరు ప్రొడక్ట్ ని మార్కెట్ చేసుకోవడానికి ఇంకా బల్క్ మెయిల్స్ మీదే ఆధారపడుతున్నారా..?

మీ సెర్చింజిన్ ఆప్టిమైజేషన్ సరైన ఫలితాలను ఇవ్వడం లేదా..?

మీరింకా పుస్తకాల్లో చెప్పిన పురాతన మార్కెటింగ్ పద్దతుల్నే పాటిస్తున్నారా..?

అయితే మీ మార్కెటింగ్ వ్యూహాలను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమయింది. ప్రస్తుత ట్రెండ్ ను చెక్ చేసుకుని.. కొత్త, రివైజ్డ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ తో మార్కెట్ లో పోటీ పడాల్సిన సమయం వచ్చేసింది. పురాతన మార్కెటింగ్ వ్యూహాలనే మీరు అమలు చేస్తున్నట్లయితే.. అది మీ బిజినెస్ కు చేసే మంచి సంగతి ఏమో కానీ.. కచ్చితంగా హానీ మాత్రం చేస్తుంది. సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్స్, ఆదాయాలు కొంచెం కొంచెం తగ్గిపోతున్నట్లు తేలితే మీ మార్కెటింగ్ వ్యూహాలను సమీక్షించుకోవాల్సిన అవసరం వచ్చి పడిందన్నమాట. మారుతున్న ట్రెండ్స్ కు అనుగుణంగా మీరు మారాల్సిన సమయం దగ్గర పడిందనడానికి అదే సూచన. కొత్త వ్యూహాలను అడాప్ట్ చేసుకునే ముందు ఇప్పటికిప్పుడు వదిలేయాల్సిన ఐదు పురాతన మార్కెటింగ్ పద్దతులను ఇప్పుడు తెలుసుకుందాం.

image


కంటెంట్ లో కీవార్డ్స్ కూర్చడం తగ్గించండి..!

మీ ప్రొడక్ట్ కు సంబంధించిన కంటెంట్ వివరణలో భారీతనం తగ్గించండి. సెర్చింజన్లు పెద్దగా ఉపయోగం లేని వాటి నుంచి ఉపయోగమైనవాటిని వేరు చేసేందుకు చాలా శ్రమపడుతూంటాయి. మీ కంటెంట్ లో అసలు విషయం కన్నా కొసరు ఎక్కువైతే ఈ సెర్చింజన్ కి అందకుండా పోతుంది. ఈ విషయంపై మరోసారి ఆలోచించండి. కీవార్డ్స్ విషయంలో స్పెసిఫిక్ గా, సెలక్టివ్ గా కేర్ ఫుల్ గా ఉంటే ఎలా ఉంటుందో ఓ సారి ఆలోచించండి. క్వాలిటీ కీవార్డ్స్ తో గుడ్ కంటెంట్ ఉంటే ఎక్కువ షేర్స్ సాధిస్తుంది. అలాగే సెర్చ్ ఇంజిన్లలో మీ కంటెంట్ టాప్ స్లాట్స్ లో ఉంటుంది.

పాప్ అప్ బ్యానర్ యాడ్స్ కి సెలవు ఇవ్వండి..!

ఇంటర్నెట్ లో ఏదైనా మంచి ఆసక్తికరమైన విషయం చదువుతున్నప్పుడో.. చూస్తున్నప్పుడో మధ్యలో పానకంలో పుడకలా పాప్ అప్ బ్యానర్ యాడ్స్ వస్తే మీకెలా ఉంటుంది..?. పరామ చిరాకేయదూ..? . అందుకే మీ వ్యాపారాభివృద్ధికి మీరు ఇలాంటి పాప్ అప్ యాడ్స్ పంపిస్తున్నట్లయితే తక్షణం ఆపేయండి. అలాంటి యాడ్స్ చూసేవారికి ఆసక్తి కలిగించవు కదా..కోపాన్ని సృష్టిస్తాయి. పైగా ఇప్పుడు వినియోగదారులంతా స్మార్ట్ గా మారిపోయారు. దాదాపు అందరూ పాప్ అప్ ను బ్లాక్ చేసేస్తున్నారు. వీటి స్థానంలో ఇన్ఫర్మేటివ్ గా ఉండే న్యూస్ లెటర్స్ ను ఇన్ మెయిల్స్ ద్వారా పంపడం మంచింది. ఇన్ మెయిన్ బ్యానర్ యాడ్స్.. మల్టీమీడియా గ్రాఫిక్స్ తో ఆకర్షణీయంగాఉంటాయి. ఒక్కసారి దాన్నిచూసినవారికి లోపల ఏముందో చూడాలనే కుతూహలం కూడా పెరుగుతుంది.

అతిగా సోషల్ మీడియాను ఉపయోగించవద్దు..!

మీ బ్లాగ్ మీ గొప్పతనాన్ని వేనోళ్ల పొగుడుతుందా..? మీ సంస్థ, మీ గురించి పుంఖానుపుంఖాలుగా సోషల్ మీడియాలో సొంతడబ్బా కొట్టుకుంటారా..? . మీ శత్రువులు కూడా మీకు తలపెట్టిని కీడుని మీకు మీరు చేసుకుంటున్నట్లే. ఎందుకంటే బ్లాగుల్లో, సోషల్ మీడియాలో సెల్ప్ డబ్బా పోస్టుల్ని ఎవరూ సీరియస్ గా తీసుకోరు. కనీస మాత్రమైన ఆసక్తిగా చూడరు. పైగా అలాంటి పోస్టులు నెగెటివ్ ఫీలింగ్ తీసుకువస్తాయి. ఎవరూ పాజిటివ్ గా చెప్పేవారు లేక సొంతంగా పోస్టులు పెట్టుకుంటున్నారనే ఫీలింగ్ వస్తుంది. ఇది మొత్తానికే మోసం తెస్తుంది. అదే సమయంలో మీ వ్యాపారానికి, ఉత్పత్తికి సంబంధించిన క్వాలిటీ కంటెంట్ పోస్టులు, మీ ప్రొడక్ట్,సర్వీస్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ స్టోరీస్, కార్టూన్లు, ఆడియో విజువల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అత్యుత్తమం. ఇలాంటి వాటి వల్ల వినియోగదారులు ఏముందో తెలుసుకోవాలే ఉత్సాహం చూపిస్తారు. ఆసక్తికరంగా ఉండటం వల్ల ఆసాంతం చూస్తారు. చదువుతారు. దాంతో ఆటోమోటిక్ గా ప్రొడక్ట్, సర్వీస్ పై నమ్మకం పెరుగుతుంది.

షేరింగ్ లింక్స్

వెబ్ లింకులు ఇష్టం వచ్చినట్లు షేర్ చేయడమనేది ఇప్పుడు చాలా పాత విషయం. వెబ్ మాస్టర్స్ కు ఇవి కామన్ బెనిఫిట్స్ కల్పిస్తాయి. కానీ రెండు రిలేటెడ్ వెబ్ సైట్లకు ఈ లింక్ షేరింగ్ అనేది పూర్తిగా అవుటాప్ ఫ్యాషన్ కాదు. కానీ ఓవర్ డోసింగే పెద్ద సమస్య. గూగుల్ కొత్త అల్గారిథమ్ వల్ల అవి ఫేక్ గా గుర్తిస్తే మొదటికే మోసం వస్తుంది. సోషల్ మీడియాలో కంటెంట్ షేరింగ్ చాలా తెలివిగా, సమన్వయంతో సాగాలి. ఇది అర్ధవంతంగా, సౌకర్యవంతమైన భాగస్వామ్యాలు నెలకొల్పేలా ఉండాలి. మరింత మెరుగైన కస్టమర్ డేటాబేస్ ను సంపాదించేలా ఉండాలి. అంతే కానీ గుడ్డిగా షేరింగ్ చేస్తే భారీగా నష్టపోకే తప్పదు.

నకిలీ రివ్యూల జోలికెళ్లకండి..!

నకిలీ అనేది ఎప్పటికైనా ప్రమాదకరమే. మీకు ఏదైనా సర్వీస్, ఉత్పత్తి నచ్చితే సిన్సియర్ గా లైక్ చేయండి. మీరు దాన్ని పొగడాలి అనుకుంటే అంతే సిన్సియర్ గా ఆ పని చేయవచ్చు. అయితే పెయిడ్ రివ్యూస్ తో వినియోగదారుల నుంచి ఫేక్ సర్టిఫికెట్ పొందితే మొత్తం కస్టమర్ రివ్యూ సిస్టమ్ పైనే నమ్మకం పోతుంది. కస్టమర్లు మీ ప్రొడక్ట్, సర్వీస్ పట్ల సంతోషంగా ఉంటే..అలాంటి వారి వీడియోలు కస్టమర్లలో మీపై నమ్మకాన్ని మరింత పెంచుతాయి. ఇలా ఫీడ్ బ్యాక్ పంపాలని మీరు కస్టమర్ ని అడగవచ్చు కూడా. సృష్టించిన రివ్యూల కన్నా.. ఒరిజినల్ రివ్యూలే అతి వేగంగా సర్క్యూలేట్ అవుతాయి.

మారుతున్న ప్రపంచాన్ని చూసి మీరు మారండి. అప్పుడే మార్కెటింగ్ లో ఛాంపియన్లుగా నిలిస్తారు. మీ సంస్థ ఆదాయార్జనలో విజేతగా నిలుస్తుంది.