మిలియన్ డాలర్ల మార్కెట్‌కు కేరాఫ్ ధూల్‌పేట్

భాగ్యనగరంలో వేల కుటుంబాలకు ఉపాధివినాయకచవితికి మూడు నెలల ముందు నుంచే ధూల్‌పేట్ కళకళఇతర రాష్ట్రాల నుంచి వలస వస్తున్న కళాకార కుటుంబాలుచవితి అనంతరం దుర్గాపూజకు సిద్ధం

0

వందల సంఖ్యలో కళాకార కుటుంబాలు, వేల సంఖ్యలో గణేష్ మండపాలు, లక్షల సంఖ్యలో విగ్రహాలు మొత్తం కలసి కోట్ల రూపాయిల వ్యాపారం. వినాయక చవితికి ముంబై తర్వాత ఆ స్థాయి హంగామా మన హైదరాబాద్‌లోనే కనిపిస్తుంది. భారీ గణేష్ మండపాలతో ఓల్డ్ సిటీ నుంచి హైటెక్ సిటీ దాక ఎక్కడ చూసిన ఉత్సవ శోభ కళకళలాడుతోంది. తరాలుగా గణేష్ విగ్రహాల తయారీకి కొన్ని వేల కుటుంబాలు అంకితమయ్యాయి. ఏడాదిలో ఒకసారి వచ్చే వినాయక చవితి రోజు జరిగే వ్యాపారమే ఆ ఏడాది మొత్తం వాళ్ల కుటుంబ పోషణకు ఉపయోగపడుతుందంటే .. గణేష్ ఉత్సవం చేసే వ్యాపారం ఎంతో అంచనా వేయొచ్చు.

అమ్మకానికి సిద్ధమైన గణనాధులు - Photo credit - Venu G
అమ్మకానికి సిద్ధమైన గణనాధులు - Photo credit - Venu G
"నాలుగు నెలల నుంచి మా కుటుంబం ఇక్కడే ఉంది. ఏడాదిలో ప్రతి ఐడు నెలలు మేం దూల్ పేటకు వస్తాం. నాతో పాటు మా కుటుంబ సభ్యులంతా విగ్రహతయారీలో పాల్గొంటాం. నాలుగు రాళ్లు వెనకేసుకొని తిరిగి మా సొంతూరుకు బయలదేరుతాం." జుదిష్టి చక్రబర్తి.

చక్రబర్తి కోల్కతా నుంచి ధూల్‌పేట్‌కు వచ్చిన కళాకారుడు. ఆయనతో పాటు కుటుంబమంతా ఏడాదిలో కొన్ని రోజులు హైదరాబాద్ వలస వస్తుంది. ఇలా బెంగాళ్, ఒడిషా, రాజస్తాన్‌తోపాటు దేశంలో ఇతర ప్రాంతాల నుంచి వందలాది కళాకార కుటుంబాలు ఇక్కడికి రెక్కలు కట్టుకుని వాలిపోతాయి. ధూల్‌పేట్‌లో తయారయ్యే బొమ్మలు అటు కర్నాటకతోపాటు మధ్యప్రదేశ్, ఇటు ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతానికి సప్లై అవుతాయి. ధూల్‌పేట్‌ సహా హైదరాబద్‌లోని మరికొన్ని ప్రాంతాలు వినాయక విగ్రహాల తయారీకి అడ్డాలుగా ఉన్నాయి. గణేష్ చతుర్ధితోపాటు దసరా ఉత్సవాలకు దుర్గామాత, సరస్వతి పూజల కోసం విగ్రహాలను తయారు చేస్తారు. ఏడాదిలో ఐదు నెలల పాటు నిరంతరాయంగా ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. హైదరాబాద్ కేంద్రంగా విగ్రహతయారీ పరిశ్రమ మిలియర్ డాలర్లను కురిపిస్తుందంటే ఏమాత్ర అతిశయోక్తి కాదేమో.

లడ్డూకి ఫేమస్ అయిన బాలాపూర్ గణేషుడు
లడ్డూకి ఫేమస్ అయిన బాలాపూర్ గణేషుడు

వ్యాపారులకు పండగ

వినాయక చవితి సీజన్ అనేది వ్యాపారానికి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. చిన్నా చితకా వ్యాపారాల దగ్గర నుంచి భారీ మాల్‌ల దాకా ఈ సీజన్‌లో భారీ లాభాలు వస్తాయి. అర అడుగు నుంచి యాబై అడుగులు దాటిన భారీ విగ్రహాలు ధూల్‌పేట్‌లో లభ్యమవుతాయి. ఇక్కడ వందల సంఖ్యలో విగ్రహాలను కొనుక్కొని వాటిని తిరిగి అమ్మకానికి పెడతారు వ్యపారులు. భారీ విగ్రహ ఆర్డర్లు అన్ని మధ్యస్థంగా ఉండే వ్యాపారులతోనే సాధ్యమని తయారీదారులు చెబుతున్నారు. ఈ రకంగా చూస్తే అటు తయారీదారులతో పాటు ఇటు వ్యాపారులకు లాభాన్ని తెచ్చిపెట్టే ఫెస్టివల్ సీజన్‌కి జిందాబాద్ కొడుతున్నారు. వ్యాపారం సరిగ్గా జరిగితే అదే స్థాయిలో వినాయక ఉత్సవాన్ని కూడా చేస్తారు స్థానిక వ్యాపారులు. ఏటా వచ్చే లాభాల్లో కొంత భాగాన్ని గణేష్ ఉత్సవాలకు ఖర్చు పెట్టడం సెంటిమెంట్‌గా మారింది. ఈ రకంగా వ్యాపారులు జీవితాలను ప్రభావితం చేస్తోంది ఈ పండగ.

విగ్రహాలమ్ముతున్న ముస్లిం వ్యాపారి
విగ్రహాలమ్ముతున్న ముస్లిం వ్యాపారి

ఓల్డ్ సిటీ స్పెషల్

ధూల్‌పేట్ గురించి చెప్పాలంటే ముందుగా చెప్పాల్సింది ఓల్డ్ సిటీ గురించే. ఎందుకంటే ధూల్‌పేట్ ఓల్డ్ సిటీలో భాగం. ఇక్కడ తయారీ దారులతో పాటు కార్మికులు ఎక్కవ మంది పాత బస్తీకి చెందిన ముస్లింలు ఉంటారు. గణేష్ ఉత్సవాలు సైతం ఓల్డ్ సిటీలో భారీగా జరుగుతాయి. హిందూ ముస్లిం తేడాలేకుండా జరిగే అతి అరుదైన పండగల్లో గణేష్ చతుర్థి ఒకటి. కొన్ని దశాబ్దాలుగా ఈ కల్చర్ కొనసాగుతోంది. వినాయక చవితికి ఓల్డ్ సిటీలో జరిగే వ్యాపారం కూడా భారీగానే ఉంటుంది. మండపాలకు కావాల్సిన డెకరేషన్ సామగ్రితోపాటు ఇతర వస్తువులన్నీ చార్మినార్ , ఓల్డ్ సిటీ ప్రాంతాల్లోనే చవకగా దొరుకుతాయి. దీంతో జనం కూడా కోటి, గౌలిగూడా తోపాటు చార్మినార్ మార్కెట్లకు వెళ్లి సరుకులు కొనుక్కుంటారు.

Photo credit - Ananth E
Photo credit - Ananth E

ఏడాదిలో ఒక సారి వచ్చే వినాయక చవితి కోసం హైదారబాద్‌లో వేల వ్యాపార కుటుంబాలతో పాటు కళాకారులు వేచి చూస్తారు. మిలియర్ డాలర్ల బిజినెస్ ఈ ఫెస్టివల్ సీజన్‌లోనే జరుగుతుంది. స్థానికంగా ఉన్న నాలుగు వేల మందితో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వెయ్యి మంది వరకూ ఈ పండుగ ఉపాధి కల్పిస్తుంది. ధూల్‌పేట్ కేంద్రంగా విగ్రహాల తయారీ , విక్రయంతో ప్రారంభమైన వ్యాపారం నగరం మొత్తం ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవ మండపాలతో ముగుస్తుంది. వినాయక చవితికి మూడు నెలల ముందునుంచే ప్రారంభమైన ఈ వ్యాపారం దసరా ఉత్సవాలతో అంటే దాదాపు నాలుగున్నర నెలపాటు సాగుతుంది. ఎంతో మంది కళాకారులకు ఉపాధి కల్పిస్తునే, మరెంతో మంది వ్యాపార జేబులను నింపుతున్న వినాయక ఉత్సవాల కోసం ఏడాది మొత్తం వేచిచూస్తారు.

హంగులూ, ఆర్భాటాలు అంతకుమించి ఆరంబడాలు కలిస్తే శతకోటి ఉత్సవాల్లో అనంతకోటి ఆనందాలు కనిపిస్తాయి.
ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik