ఇండియాలోనే తొలి హైపర్ లోకల్ మొబైల్ ప్లాట్ ఫాం

అన్ని వ్యాపారాలకు ఒకటే పరిష్కారం

ఇండియాలోనే తొలి హైపర్ లోకల్ మొబైల్ ప్లాట్ ఫాం

Sunday November 27, 2016,

4 min Read

సరిగ్గా యేడాది క్రితం.. అమీర్ పేట మైత్రీ వనం దగ్గర ముగ్గురు మిత్రులు టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో ఒక కుర్రాడు చేతిలో పాంప్లెట్‌తో వచ్చి ఈ అడ్రస్ ఎక్కడో కాస్త చెప్తారా అని అడిగాడు. రెండు నిమిషాల వ్యవధిలో ఇంకో యువకుడు సేమ్ పాంప్లెట్ పట్టుకుని అదే అడ్రస్ ఇంక్వైరీ చేశాడు. మరో ఐదు నిమిషాల గ్యాప్‌లో మరో వ్యక్తి సేమ్ పాంప్లెట్, సేమ్ అడ్రస్ కనుక్కున్నాడు. ఈ ముగ్గురూ ఆశ్చర్యపోయారు. ఒకే అడ్రస్‌ని ముగ్గురు వ్యక్తులు వెంటవెంటనే అడిగారంటే.. అక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నారు. ఇంతలో ఒకరి బుర్రలో మెరుపులాంటి ఐడియా వచ్చింది. ఇంకో మూడు టీలు చెప్పి వాడివేడిగా చర్చించుకున్నారు. ఆ వేడివేడి ఐడియా టీ హబ్‌కి చేరింది. అక్కడ ఆవిష్కరణగా మారి బయటకొచ్చింది. ఆ ఇన్నోవోషన్ పేరే ఫైండ్ మి ఎట్ స్మార్ట్ సైట్స్.

మీరు గమనించారో లేదో.. ఆదివారం పొద్దున్నే గడప ముందు పడివున్న పేపర్ తీయగానే.. అందులోంచి రకరకాల సైజులో, రకరకాల కలర్లలో పాంప్లెట్స్ కిందపడతాయి. అయితే వాటిని ఎంతమంది చదువుతారు? అందులో ఎన్ని పాంప్లెట్స్ జనాన్ని ఆకర్శిస్తాయి? దీనికి సమాధానం చెప్పడం కష్టం. అంటే, వ్యాపార సంస్థలు అనుకున్న కస్టమర్లను చేరుకోలేదనే చెప్పాలి. అమీర్ పేట్ మైత్రీ వనం నుంచి సత్యం థియేటర్ దాకా రోడ్డుకు ఇరు పక్కల బోలెడన్ని బేనర్లు కనిపిస్తాయి. వాటిని ఎంతమంది ఆగి చదువుతారు? ఇక్కడా అనుకున్న స్థాయిలో రీచ్ కావడం లేదు. పోనీ ఆటో వెనకాల యాడ్- ఏమైనా వర్కవుట్ అవుతుందా? ఫిఫ్టీ ఫిఫ్టీ కూడా ఛాన్స్ లేదు.

దేశంలో సూక్ష్మ, మధ్య, చిన్న తరహా వ్యాపార సంస్థలు అన్నీ కలిపి సుమారు ఐదు కోట్ల దాకా వుంటాయని అంచనా. అవన్నీ ప్రచార పరంగా చూసుకుంటే అసంఘటితంగానే ఉన్నాయి. వాటన్నిటినీ ఒకే తాటిమీదికి తేవాలన్న లక్ష్యంతో ఊపిరి పోసుకున్నదే ఫైండ్ మి ఎట్ స్మార్ట్ సైట్స్. మీరు దిల్ సుఖ్ నగర్ లో ఫలానా కోచింగ్ సెంటర్‌కి వెళ్లాలనుకోండి. అదెక్కడుందో వాళ్లను వీళ్లను అడగాల్సిన అవసరం లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ఫైండ్ మి ఎట్ స్మార్ట్ సైట్స్ యాప్ ద్వారా కావల్సిన డెస్టినేషన్ టైప్ చేసి దాన్ని నావిగేట్ చేసుకుంటూ వెళ్లడమే. దారి చూపడంతో యాప్ ఆగిపోలేదు. ఇంకో క్లిక్ ద్వారా అవతలి వాళ్లకు కాల్ కూడా వెళ్తుంది. ఇంకో బటన్ ప్రెస్ చేస్తే ఇన్ఫమేషన్ ను వేరేవాళ్లకు షేర్ అవుతుంది. 

image


ఆ పేరే ఎందుకు పెట్టారంటే..

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థల కస్టమర్లు మూడు నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలోనే ఉంటారు. అలాంటి వాళ్లను రప్పించాలంటే- ముందు అలాంటి బిజినెస్ ఒకటుందని జనానికి తెలియాలి. వాళ్ల ప్రాడక్టులు, సర్వీసులు కస్టమర్లకు రీచ్ కావాలి. ఇలాంటి వాటికి ప్రత్యేకమైన ఏర్పాట్లేమీ లేవు. ఉన్నదల్లా పాంప్లెట్స్. లేదంటే బేనర్స్. ఇంకాస్త ముందుకు పోతే ఆటోల వెనకాల యాడ్స్. ఇవి తప్పితే ప్రత్యామ్నాయం లేదు. ఇలాంటి ప్రాబ్లంను సాల్వ్ చేస్తుంది ఫైండ్ మి ఎట్ స్మార్ట్ సైట్స్. ఇది టెక్నాలజీకి సంబంధించినప్పటికీ, దానికోసం వేరే ఎవరినో సంప్రదించాల్సిన అవసరం లేదు. కంప్లీట్ యూజర్ ఫ్రెండ్లీగా తయారు చేశారు. దీన్నే హైపర్ లోకల్ మొబైల్ ప్లాట్‌ఫాం అంటారు. 

ఇంకో విషయం ఏంటంటే బేసిగ్గా చిన్నచిన్న వ్యాపార సంస్థల బిజినెస్ మార్జిన్స్ తక్కువగా వుంటాయి. కాబట్టి వాళ్లకు అందుబాటులో ఉండే టెక్నాలజీనే ప్రొవైడ్ చేశారు. ఒక పాంప్లెట్‌ని డిజిటలైజ్ చేసి పోస్టర్‌లా పెట్టుకునేలా రూపకల్పన చేశారు. స్మార్ట్ ఫోన్ వాడటం తెలిస్తే చాలు. కావల్సినన్ని పోస్టర్లు కావాల్సిన సైజులో పెట్టుకోవచ్చు. నెలకి వంద రూపాయల సబ్ స్క్రిప్షన్. పెద్దపెద్ద వ్యాపార సంస్థలకు కూడా ఇందులో ఎన్నో సదుపాయాలున్నాయి. ఉదాహరణకు లాయల్టీ ప్రోగ్రామ్స్, హోం డెలివరీ అయితే వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్, లేదంటే డీలర్లతో సంప్రదించి ఆఫర్లు అవీ చెప్పడానికి బిజినెస్ టు బిజినెస్, సిచ్యువేషన్ వేకెంట్ అంటే సేల్స్ బోయ్ గానీ సేల్స్ గర్ల్ గానీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గానీ రిక్వయిర్ మెంట్ ఉంటే అలాంటి వాటికోసం క్లాసిఫైడ్.. ఇలా ఎలా అవసరం ఉంటే అలా వాడుకోవచ్చు.

ఇది ఒక తరహా, ఒక టైప్ బిజినెస్ కాదు. అన్ని రకాల వ్యాపారాలకు ఉపయోగకరంగా ఉంటుంది. హోం ట్యూషన్ మొదలుకొని మొబైల్ రిపేర్, యోగా సెంటర్లు, కొరియర్ సర్వీసులు చివరికి ప్లంబర్ దాకా అందరికీ ఈ యాప్ మంచి బిజినెస్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇంటిముందు బోర్డు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకెక్కడో వాణిజ్య ప్రకటన ఇవ్వాల్సిన హైరానా అంతకన్నా లేదు.

దేశంలో ఐదు కోట్ల మందికి రీచ్ కావడమే ఈ స్టార్టప్ టార్గెట్. ఈ రెండు మూడు నెలల్లోనే ఐదు వేల కమర్షియల్ యూజర్లను ఎన్‌రోల్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదట ఖమ్మంలో పైలట్ లాంఛ్ చేశారు. అది బిజినెస్ దాకా వచ్చింది. ఇప్పుడు హైదరాబాదుపై ఫోకస్ చేశారు. ఇక్కడ లక్ష యూజర్లను ఎంగేజ్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. రెగ్యులర్ యూజర్లకు మాత్రం ఉచితం. బిజినెస్ యూజర్లు నెలకు వంద సబ్ స్క్రిప్షన్ ఇవ్వాల్సి వుంటుంది. ఆ తర్వాత వేర్వేరు ఆర్గనైజేషన్లతో, ప్రైవేటు, గవర్నమెంటు సంస్థలతో టై ఆప్ అవుతూ, ఇండియా మొత్తం విస్తరించే యోచనలో ఉన్నారు.

image


ఫైండ్ మి టీమ్

యాప్ స్పేస్ ఎండీ రాజీవ్ రావులపాటి దీనికి ఫౌండర్. అజయ్‌, శంకర్ కోఫౌండర్లు. ఖమ్మం జిల్లాకు చెందిన రాజీవ్.. 23 ఏళ్లుగా ఐటీ ఇండస్ట్రీలో ఉన్నారు. కొంతకాలం ఐబీఎంలో(అమెరికా) పనిచేశారు. తర్వాత వేర్వేరు కంపెనీల్లో కమాండ్ సెంటర్‌ని లీడ్ చేశారు. మారుమూల గ్రామాలు కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నదే రాజీవ్ డ్రీమ్. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్ యువ ఆంట్రప్రెన్యూర్లకు వరం లాంటిది అంటారాయన. వేరే దేశాలతో పోల్చి చూస్తే ఎక్కడా లోటు లేదని చెప్తున్నారు. టీ హబ్ నుంచి సరికొత్త ఆవిష్కరణలతో బయటకొచ్చిన స్టార్టప్ కంపెనీల్లో తమదీ ఒకటైనందుకు గర్వంగా ఉందని చెప్పి ముగించారు రాజీవ్.