ఇకపై పేటీఎం బ్యాంక్ సేవలు  

0

పేటీఎం. పెద్ద నోట్లు రద్దయిన దగ్గర్నుంచి దేశంలో ఈ పేరు తెలియని వారు లేరు. ఈ వాలెట్ గా ఒక రేంజిలో దూసుకుపోయిన ఈ సంస్థ బ్యాంకు రూపంలో ప్రజల ముందుకొచ్చింది. తొలిశాఖను ఢిల్లీలో ప్రారంభించిన పేటీఎం..జీరో బ్యాలెన్స్, డిపాజిట్లపై క్యాష్ బ్యాక్ తదితర ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం నుంచి బ్యాంకు సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. గత వారమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ఇండియా అనుమతులు రావడంతో తొలి శాఖను ఢిల్లీలో ప్రారంభించింది. ఈ సందర్భంగా పేటీఎం బ్యాంకు వడ్డీరేట్లు, తదితర నిబంధనలను సంస్థ వెల్లడించింది. సేవింగ్ ఖాతాల వారికి వార్షిక వడ్డీరేటు 4 శాతంగా ప్రకటించింది. అంతేగాక, సేవింగ్ ఖాతాలో కనీస నగదు ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది. జీరో బ్యాలెన్స్ తో ఖాతాను ఓపెన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతోపాటు.. ఆన్ లైన్ నగదు బదిలీలు ఉచితంగా చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు పేటీఎం తెలిపింది. డిపాజిట్లపైనా క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. ఖాతాదారు పేమెంట్స్ బ్యాంక్ ఖాతాను తెరిచి.. అందులో రూ. 25వేలు డిపాజిట్ చేస్తే రూ. 250 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది.

మార్కెట్లో ఉన్న ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకుల విషయానికొస్తే.. 25వేలకు పైబడిన డిపాజిట్ల మీద ఎయిర్ టెల్ 7.25 శాతం.. 5.5 శాతం, ఇండియా పోస్ట్ 4.5 శాతం వడ్డీ ఇస్తోంది.

ఇక లావాదేవీల పరంగా చూస్తే.. సాధారణ బ్యాంకులు నాన్ మెట్రో సిటీల్లో 5 ఫ్రీ ట్రాన్సాక్షన్లు, మెట్రో నగరాల్లో మూడు ట్రాన్సాక్షన్లు ఉచితంగా ఇస్తున్నాయి. లిమిట్ క్రాస్ అయితే ప్రతీ లావాదేవీపై 20 చార్జ్ చేస్తున్నాయి. నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు అంటే మినీ స్టేట్ మెంట్ల లాంటివి తీసుకుంటే 5 రూపాయలు చార్జ్ చేస్తున్నాయి.

ఇండియా పోస్ట్ కూడా ఇలాంటి బెనిఫిట్సే ఇస్తోంది. మెట్రో నగరాల్లో మూడు లావాదేవీలు ఉచితంగా, నాన్ మెట్రో నగరాల్లో ఐదు ట్రాన్సాక్షన్లు ఫ్రీగా ఇస్తోంది. అవి దాటితే 20 చార్జ్ చేస్తున్నాయి. క్యాష్ విత్ డ్రాయల్ మీద 0.65 శాతం చార్జ్ విధిస్తున్నాయి. అదే పేటీఎం విషయానికొస్తే అన్ని ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు ఫ్రీ అంటోంది. కానీ అదే సమయంలో ఇండియా పోస్ట్ నెఫ్ట్ లేదా ఐఎంపీఎస్ సేవలు వినియోగించుకుంటే ప్రతీ లావాదేవీపై 2.50 చార్జ్ చేస్తోంది. ఈ విషయంలో ఎయిర్ టెల్ 0.5 శాతం అదనంగా వసూలు చేస్తోంది.

మొత్తమ్మీద చైనాకు చెందిన అలీబాబా, జపాన్ కి చెందిన సాఫ్ట్ బ్యాంక్ సహకారంతోరూ. 400 కోట్ల పెట్టుబడులతో పేటీఎం బ్యాంకు కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రపంచంలోనే సరికొత్త బ్యాంకింగ్ సేవలకు ఆర్బీఐ అనుమతివ్వడం ఆనందంగాఉందని పేటీఎం ఛైర్మన్ శేఖర్ శర్మ అన్నారు. కస్టమర్లల బ్యాంక్ డిపాజిట్లు సురక్షితంగా ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. తొలి ఏడాదిలో 31 బ్రాంచీలను స్థాపించాలని పేటీఎం లక్ష్యంగా పెట్టుకుంది. 2020 నాటికి 500 మిలియన్ల కస్టమర్లను చేర్చుకోవాలనేది తమ టార్గెట్ అన్నారు ఛైర్మన్ శేఖర్ శర్మ.

Related Stories

Stories by team ys telugu