ఏం బాబూ ఫండింగ్ కావాలా ? ఫస్ట్ ఈ పాయింట్లు తెలుసుకో !

సక్సెస్‌ఫుల్ ఆంట్రప్రెన్యూర్ అలోక్ గోయెల్ సలహాలు

0


గత వారం ఓ సాలిడ్ ఆంట్రప్రెన్యూర్ నుంచి నాకు ఓ మెయిల్ వచ్చింది. తాను నిధుల సమీకరణ కోసం చూస్తున్నాడని, కనీసం మిలియన్ డాలర్లు రైజ్ చేసినా అంతకు మించిన భాగ్యం లేదనేది మెయిల్ సారాంశం. సరిగ్గా మూడు మాసాల క్రితం అదే ఆంట్రప్రెన్యూర్ తన ఫండ్ రైజ్ ప్రాసెస్‌లో భాగంగా 12 మిలియన్ డాలర్లు అడిగారు.

గత కొన్ని నెలలుగా నేను ఇలాంటి ట్రెండ్ గమనిస్తున్నాను. చాలా స్టార్టప్స్ మొదట్లో భారీ ఎత్తున నిధుల సమీకరణ ప్రయత్నాలు చేసి ఆ తర్వాత నీరసపడిపోతున్నాయి. మొదట్లో 10 నుంచి 15 మిలియన్ డాలర్ల ఫండ్ రైజ్ చేయాలని చూసి.. ఆఖరికి పదికో.. పరకకో కూడా సిద్ధపడిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే ఇలాంటి వాళ్లకు ఇన్వెస్టర్ల నుంచి పైసా కూడా రావడం లేదు.

ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకు వస్తోంది ? మంచి మంచి ఆంట్రప్రెన్యూర్లు కూడా ఇలాంటి గడ్డుస్థితిని ఎదుర్కోవడానికి కారణమేంటో అన్వేషించే ప్రయత్నం చేశాను. నేను అర్థం చేసుకున్నవి, నా బుర్రకు తట్టిన కొన్ని అంశాలను మీతోనూ పంచుకుంటున్నాను.

మీడియాలో ఈ మధ్య 10 నుంచి 15 మిలియన్ డాలర్ల ఫండ్ రైజ్ అనే నెంబర్లు చాలా సాధారణమైపోతున్నాయి. అయితే వాస్తవానికి మార్కెట్లో జరుగుతోంది మాత్రం వేరు. కొన్ని కొన్ని డీల్స్.. మీడియా పబ్లిసిటీకే పరిమితమవుతున్నాయి. ఇలాంటి ప్రకటనలు ఒక్కోసారి చేటు చేస్తున్నాయి. ఇలాంటి న్యూస్ ప్రలోభంలో పడ్తున్న స్టార్టప్స్.. అవసరం లేకున్నా భారీ డీల్స్ కోసం వెంపర్లాడుతున్నాయి. ఇంకో ముఖ్యవిషయం ఏంటంటే.. మార్కెట్లో ఫండింగ్ ముగియక ముందే భారీ బ్యాక్ అప్ కోసం కూడా కొన్ని స్టార్టప్స్ ఆలోచిస్తున్నాయి.

ఈ రోజుల్లో 10-15 మిలియన్ డాలర్ల ఫండింగ్ అనే పదం ఫ్యాషన్ అయిపోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు కూడా అంత పెద్ద రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఇంకొంత మంది స్టార్టప్స్ .. (కాస్త అతితెలివితో) వచ్చిన ఆఫర్లకు 'నో ' చెప్పకుండా కాలం వెళ్లదీస్తున్నారు. భవిష్యత్తులో ఇంతకన్నా పెద్ద డీల్ కుదరకపోతుందా అనే ఆశే వాళ్లతో ఇలాంటి పనిచేయిస్తోంది.

ఇలా ఫండింగ్ గోలలో పడి సమయం మర్చిపోతారు. అదే కొంప ముంచుతుంది. ఈ లోగా నిధుల కటకట రానే వస్తుంది. ఈ విషయాన్ని ఇన్వెస్టర్లు ఓ కంటకనిపెడ్తూనే ఉంటారు. పరిస్థితి చేజారిపోతోందని గమనిస్తే.. వాళ్లూ ఒక అడుగు పైకి వేస్తారు. ఈ లోగా ఏం చేయాలో దిక్కుతోచని ఆంట్రప్రెన్యూర్ బేరానికి దిగిపోతాడు. ' రౌండ్ సైజ్ తగ్గిస్తున్నాం, ఎంత అమౌంట్ సమీకరించడానికైనా మేం సిద్ధం అని ప్రకటించేస్తారు'.

దీన్నిబట్టి చూస్తే.. ఆ కంపెనీకే ఇంతవరకూ ఎవరూ ఫండ్ ఇవ్వలేదనే సమచారం ఇన్వెస్టర్ అర్థం చేసుకోగలడు. అలాంటి కంపెనీలో ఎవరు మాత్రం పెట్టుబడి పెట్టేందుకు సిద్ధపడ్తారు చెప్పండి ? (ఆశ్చర్యం ఏంటంటే.. ఇన్వెస్ట్‌మెంట్ వరల్డ్‌ది గొర్రెల్లాంటి మనస్తత్వం. ఒకరు దూకితే.. అందరూ దూకేస్తారు. లేకపోతే లేదు) ఇది చివరికి కంపెనీ మనుగడను ప్రశ్నార్థకం చేసి.. నిధుల సమీకరణను దాదాపు అసాధ్యం చేస్తుంది.

మరి ఈ పరిస్థితి నుంచి బయటపడడం ఎలా ?

డిమాండ్‌ను సరిగ్గా అర్థం చేసుకుని.. దాన్ని సమర్థంగా నిర్వహించడం చాలా ముఖ్యం. ఒక ఫండ్ హౌజ్/ ఇన్వెస్టర్ 10 మిలియన్ డాలర్లు ఆశించడం కంటే.. 4 మిలియన్ డాలర్ల చొప్పున ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చే మూడు కంపెనీలను నమ్ముకోవడం మేలు. డిమాండ్‌ను క్రియేట్ చేసేందుకు అప్పుడు రౌండ్ సైజ్‌ను కూడా పెంచొచ్చు. ఇన్వెస్టర్ల మధ్య పోటీ కూడా మంచిదే. మీ సంస్థపై ఆసక్తి, నమ్మకం ఉన్న ఇన్వెస్టర్లకు ఇది బూస్టింగ్ ఇచ్చే పాయింట్. అవకాశాన్ని చూసి అప్పుడు రౌండ్ సైజ్‌ కూడా పెంచవచ్చు.

ఈ ప్లాన్‌ను పరిశీలించండి

1. ఊహలు పక్కనబెట్టి మీ ప్రోడక్ట్ శక్తిసామర్ధ్యాలేంటో వాస్తవంగా, నిజాయితీగా లెక్కగట్టండి. మీడియా ప్రభావానికి లోనుకాకుండా నమ్మకమైన ప్రాసెస్‌ ఆధారంగా బిజినెస్‌ను అంచనా వేయండి. అత్యాశకు పోయి ఎక్కువగా బేరమాడడం వల్ల మీకే చిక్కులు తప్పవు.

2. మీ ఇన్వెస్టర్లతో మాట్లాడండి. వాళ్లు సత్తా ఉన్న వాళ్లైతే సరైన ఫండింగ్ వేల్యూను లెక్కగట్టడంతో మీకు సహాయపడతారు. అప్పుడు మీరు మార్కెట్లోకి వెళ్లి, అక్కడ వచ్చిన స్పందన ఆధారంగా మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు.

3. ఇప్పటికే నిధులు సమీకరించిన ఆంట్రప్రెన్యూర్లతో మాట్లాడండి. వాళ్ల అనుభవాలేంటో తెలుసుకోండి. సలహాలు,సూచనలు అడగండి.

విజయమనే ఆటలో నిలబడాలంటే ఎక్కువ సేపు గేమ్‌లో నిలబడాలి. అలా నిలదొక్కుకోవాలంటే డబ్బు కావాలి. అనాలోచిత కారణాలతో నిధుల సమీకరణ విషయంలో రాజీ పడొద్దు.

రచయిత - అలోక్ గోయెల్ 

అనువాదం - చాణుక్య

రచయిత గురించి

అలోక్ 2015లో బెంగళూరుకు చెందిన SAIF అనే సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్‌గా చేరారు. మొబైల్, SaaS బిజినెస్‌పై ఎక్కువగా దృష్టి సారిస్తారు. అలోక్ ఫ్రీ ఛార్జ్ (స్నాప్ డీల్ కొనేసింది) మాజీ సిఈఓ, రెడ్ బస్ (గో ఐబిబో) మాజీ సిఓఓ. తన స్టార్టప్ కలలు నెరవేర్చుకునే ముందు అలోక్ గూగుల్‌లో ఐదేళ్లు పనిచేశారు. 2014లో ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన 40 అండర్ 40 లిస్ట్‌లో స్థానం సంపాదించారు.

Related Stories

Stories by Chanukya