ఇండియన్ ఐడల్ వేదిక మీద మెరిసిన మరో తెలుగు తేజం  

0

ఇండియన్ ఐడల్ వేదిక మీద మరో తెలుగు తేజం మెరిసింది. హోరాహోరీగా సాగిన టైటిల్ పోరులో యువ సంగీత కెరటం రేవంత్ సగర్వంగా టైటిల్ చేతబూనాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ చేతుల మీదుగా ట్రోఫీని అందుకున్నాడు. పంబాజ్ కి చెందిన ఖుదా బక్ష్‌ రన్నర్ గా నిలవగా, మరో తెలుగు కుర్రాడు మూడో స్థానంలో నిలిచాడు. ఇండియన్ ఐడల్ టైటిల్ను గెలుచుకున్న రెండో తెలుగువాడిగా రేవంత్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

గతంలోశ్రీరామ చంద్ర విజేతగా నిలవగా.. అంతకుముందు కారుణ్య రన్నరప్‌గా నిలిచాడు. ఈ పోటీలో టైటిల్ గెలుచుకున్నందుకు రేవంతకు రూ. 25 లక్షల నగదు, మహీంద్ర KUV100 వాహనంతో పాటు, సోనీ మ్యూజిక్ తో ఒప్పందం కూడా కుదిరింది.

హిందీ భాష మీద అంతగా పట్టు లేకపోయినా ఉత్తరాది గాయకుల నుంచి గట్టి పోటీని ఎదుర్కొని సీజన్ 9 విజేతగా నిలిచాడు రేవంత్. వేదిక మీద పాటతో పాటు స్టెప్పులు వేస్తూ దుమ్మురేపాడు. తన ఆటాపాటతో ప్రేక్షకులను, జడ్జిలను ఏకకాలంలో మెస్మరైజ్ చేశాడు.

తెలుగు సినీ పరిశ్రమలో వర్ధమాన గాయకుడిగా పేరుతెచ్చుకున్న రేవంత్.. ఇండియన్ ఐడల్ లో పాల్గొనడానికి ఒకే ఒక కారణం అతని మామయ్య. గెలుపు సంగతి తర్వాత.. ముందు పార్టిసిపేట్ చేయమని ప్రోత్సహించాడు. అలా రేవంత్ ఇండియన్ ఐడల్ వేదిక మీద మైక్ పట్టుకున్నాడు. మామయ్య అనుకున్నట్టే టైటిల్ గెలిచాడు.

తెలుగులో 200 వరకు పాటలు పాడిన రేవంత్.. ఇండియన్ ఐడల్ అనగానే మొదట సందేహించాడు. పైగా హిందీ పెద్దగా తెలియదు. అయినా సరే తన పెర్ఫామెన్స్ మీద నమ్మకముంది కాబట్టే ఆ డెసిషన్ తీసుకున్నాడు. తోటి గాయకులు కూడా ఎంకరేజ్ చేశారు. ఉత్తరాది వాళ్లూ రిసీవ్ చేసుకున్నారు. హిందీ డిక్షన్, పదాలకు అర్ధాలు, హావభావాలు అన్నీ నేర్పించారు.

ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో దక్షిణాది వాళ్లు చివరి రౌండ్ దాకా రావడం అనేది చాలా రేర్. అయితే ఈసారి విచిత్రంగా టాప్ 14లో నలుగురు సౌత్ వాళ్లు వచ్చారు. టాప్ 8లో కూడా నలుగురు దక్షిణాది వాళ్లే నిలిచారు. టాప్ ఫైవ్ లో రేవంత్ నిలిచి ఫైనల్ గా టైటిల్ ఎగరేసుకొచ్చాడు.

"ఓటేసిన ప్రతీ ఒక్కరికీ, వెన్ను తట్టి ప్రోత్సహించిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపిన రేవంత్ బాలీవుడ్‌ లోనూ తనకంటూ స్థానం సంపాదించాలనే లక్ష్యంతో ఉన్నాడు. 

Related Stories

Stories by team ys telugu