రైతుకు రొక్కం కనెక్ట్ ఫార్మర్‌తో సాధ్యం

ఆహారధాన్యాల ఉత్పత్తి, వినియోగం మన దేశంలో చాలా ఎక్కువరైతాంగానికి దక్కేది చాలా తక్కువరైతులు, వినియోగదారులకు నేరుగా సంబంధాలు లేకపోవడమే సమస్యవ్యవసాయ అనుబంధ రంగాలపై రైతులకు అవగాహనా లేమిఅంతర పంటల గురించి ఆలోచించే ముందు...పండించిన పంటకే అదనపు లాభం లభించే అవకాశముందా ?ఈ ప్రశ్నకు సమాధానమే కనెక్ట్ ఫార్మర్

రైతుకు రొక్కం కనెక్ట్ ఫార్మర్‌తో సాధ్యం

Sunday April 19, 2015,

3 min Read

ప్రపంచంలో అత్యధిక ఆహార ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటి. అలాగే ఆహారోత్పత్తుల వినియోగం ఎక్కువగా ఉండే జాబితాలోనూ మన దేశం ముందే ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానిది కీలకపాత్ర. అయితే ఈ రంగంలో ఉన్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నామన్నది నిర్వివాదాంశం. ఉదాహరణకు కోకుం పండు(వాగుకాయ) సహజసిద్ధంగా పెరుగుతుంది. ఇది పశ్చిమ ప్రాంతం, కొంకణ్ తీరాల్లో ఎక్కువగా ఉంటుంది. దీని సాగు రైతులకు ఎంతో లాభదాయకత చేకూర్చుతుంది. ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు.

image


ఈ వాగుకాయ సాగు ఉపయోగాలను రైతాంగానికి తెలియచేసేందుకు ఓ వ్యక్తి ముందుకొచ్చాడు. అతనే శ్రీకృష్ణ. దీని ఉపయోగాలను తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాడాయన. శీతల పానీయాల తయారీలో దీన్ని ఉపయోగించచ్చు. సాంప్రదాయ ఆహార పదార్ధాల తయారీలోనూ వినియోగిస్తారు ప్రజలు. అలాగే ఎసిడిటీ, స్థూలకాయం వంటి సమస్యలనుంచి బయటపడేందుకు ఇది మందులా పని చేస్తుంది. విత్తనాల నుంచి తీసిన గుజ్జును ఘన పదార్ధంగా మార్చి... చర్మవ్యాధుల చికిత్సలోనూ ఉపయోగిస్తున్నారు. అలాగే ఈ గుజ్జు కొవ్వొత్తుల తయారీకి కూడా పనికొస్తుంది. ఇలాంటి అనేక మొక్కలు, పంటలు రైతులకు మేలు చేసేవి ఉన్నాయి. ఇవి రైతు కుటుంబానికి అదనపు ఆదాయాన్ని సమకూర్చి పెడతాయి. ఈ సంగతి అనేకమంది రైతులకు తెలియడం లేదు. దీనిపై వారికి అవగాహన కలిగించాల్సి ఉంది.

కనెక్ట్ ఫార్మర్ వ్యవస్థాపకుడు శ్రీకృష్ణ హెగ్డే ఉల్లాన్.. తన కాలేజ్ రోజుల్లోనే రైతాంగం ఎదుర్కుంటున్న ఆర్థిక సమస్యలపై అవగాహన పెంచుకున్నారు. కన్నడ మీడియంలో విద్యాభ్యాసం చేసిన ఈయన.. అహ్మదాబాద్‌లోని ఆంట్రప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి సామాజిక పారిశ్రామిక రంగంలో డిప్లొమా విద్యనభ్యసించారు. బిద్రాకన్ గ్రామం నుంచి వచ్చిన ఈయన... ఉద్యోగావకాశాలకోసం తన స్నేహితులతో సహా అందరూ పట్టణాలకు వలస పోయేందుకు సిద్ధమవడాన్ని గమనించారు. గ్రామీణ వికాసం మార్గాలు అన్వేషించడం ప్రారంభించగా.. అప్పుడు ఆయనకు తట్టిన ఆలోచనే ఈ కనెక్ట్ ఫార్మర్.

నిశిత పరిశోధన తర్వాత వ్యవసాయ రంగంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నా.. రైతులు ఆచరించదగిన స్థాయిలోనే ఉన్నా.. అవగాహన లేక అనేక అవకాశాలను వాళ్లు గుర్తించడంలేదనే సత్యం బోధపడింది. మరోవైపు పెద్దగా మార్కెట్, డిమాండ్ లేని పంటల కోసం శ్రమకోర్చడాన్ని గమనించారు శ్రీకృష్ణ. కేంద్ర ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీలు అతికొద్ది సాగు ఉత్పత్తులనే ప్రోత్సహిస్తున్న విషయం కూడా అర్ధమైంది. డిమాండ్ అధికంగా సరైన స్థాయిలో ఉత్పత్తిలేక అనేక వస్తువుల కోసం వినియోగదారులు అధిక ధరలు చెల్లిస్తున్న అంశం కూడా పూర్తిగా అవగతమైంది. ఉదాహరణకు వక్కకు కేంద్రం నుంచి మద్దతు లభిస్తుంది. అదే సమయంలో వక్కతో తయారు చేసిన ఏ ఇతర ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్ కమిటీలు ప్రోత్సహించవు. దీంతో ఈ తరహా పంటల తయారీపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలి.

"ఇది వాగుకాయ, దాని ఇతర ఉత్పత్తులే కాదు.. ఇంకా ఇలాంటివి వేలాది పంటలున్నాయి. ఉదాహరణకు వేరుశనగకు సంబంధించిన ఇతర అనుబంధాలు. వక్క ఆకులతో తయారయ్యే ప్లేట్లు, కప్పులు వంటి"వాటికి ప్రోత్సాహం కరవైందంటున్నరు శ్రీకృష్ణ.

ఈ సమస్యను అధిగమించేందుకు రైతులకోసం ఓ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చిందీయనకు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల వారందరూ తమ ఉత్పత్తుల వివరాలను ఫోటోలతో సహా ఈ పోర్టల్‌లో ప్రదర్శనకు ఉంచొచ్చు. వీటి అవసరం ఉన్న కస్టమర్లకు ఈ సైట్ ద్వారా వివరాలు అందుతాయి. అంటే కస్టమర్లకు, రైతాంగానికి మధ్య వారధిగా ఉపయోగపడ్డం కనెక్ట్ ఫార్మర్ ప్రారంభంలో ప్రధానోద్దేశ్యం. ఈ తరహా ఫ్లాట్‌ఫాం లభించడంతో... రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. పంటలు పండించాక.. వాటిని అనుబంధ రంగాలకు తరలించి సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం లభిస్తోంది. మరోవైపు వినియోగదారులకు కూడా తక్కువ ఖర్చులో అవసరాలు తీరడమే కాకుండా.. సులభంగా ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం చిక్కుతోంది.

వ్యవసాయ మార్కెటింగ్‌లో ప్రస్తుతం కనెక్ట్ ఫార్మర్ రెండు రకాల సమస్యలకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తోంది.

  • 1. రైతులు, సూక్ష్మ పరిశ్రమల యజమానులను ప్రపంచానికి పరిచయం చేయడం, వ్యవసాయంలో విలువ ఆధారిత ఉత్పత్తులను రైతుల నుంచి వినియోగదారులు నేరుగా కొనుగోలు చేయడం
  • 2. తమకు అవసరమైన వస్తువుల కోసం ఆయా ఉత్పత్తిదారులను నేరుగా కలిసే అవకాశం కస్టమర్లకు లభించడం

ఈ ఆన్‌లైన్ వేదికను భారత్ మొత్తం విస్తరించాలన్నది శ్రీకృష్ణ హెగ్డే కోరిక. "వ్యవయాయం లాభసాటిదేనని, ఇందులోనూ అధికస్థాయిలో ఆదాయం గడించొచ్చని రైతాంగానికి తెలియచేయాలి, ఈ తరహా చర్యలతో గ్రామీణ ప్రాంతాల్లో మరింతగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నది" కనెక్ట్ ఫార్మర్ వ్యవస్థాపకుడు శ్రీకృష్ణ ప్రగాఢ నమ్మకం.

శ్రీకృష్ణను మీరు ఈ మెయిల్‌లో [email protected] కాంటాక్ట్ చేయొచ్చు