ఐటీలో హైదరాబాద్ అదరహో..! 

ఐకాన్ సదస్సులో కేంద్రమంత్రి ప్రశంసలు  

0ఐటీ కంపెనీలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. విదేశాలకు చెందిన దిగ్గజ సంస్థలు భాగ్యనగరంలో బ్రాంచ్ లు ఏర్పాటు చేసుకున్నాయని తెలిపారు. తెలంగాణలో ఇంటింటికి ఇంటర్నెట్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో నవంబర్ 9 వరకు జరుగనున్న ఐకాన్ సదస్సులో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

హైదరాబాద్ స్టార్టప్ హబ్ గా మారిందన్నారు మంత్రి కేటీఆర్. దేశవిదేశీ కంపెనీలు భాగ్యనగరాన్ని వెతుక్కుంటూ వస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఐకాన్ సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సదస్సులో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి కేటీఆర్.. ఐటీ రంగంలో హైదరాబాద్ నంబవర్ వన్ గా నిలిచిందని చెప్పారు. ప్రపంచంలోనే 5 మేటి కంపెనీలు భాగ్యనగరంలో కొలువయ్యాయని తెలిపారు. ఇంటింటికి మంచినీరు ఎంత ముఖ్యమో, ఇంటర్నెట్ కూడా అంతే అవసరమని కేటీఆర్ అన్నారు. డిజిటల్ ఇండియా మాదిరిగానే డిజిటల్ తెలంగాణను తీసుకొస్తున్నామని చెప్పారు.

హైదరాబాద్ అద్భుతమైన నగరమని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కొనియాడారు. ఐటీ రంగంలో హైదరాబాద్ సాధిస్తున్న అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్, సైబరాబాద్ లో ఐటీ విస్తరించిన తీరు అద్భుతమన్నారు. ప్రపంచవ్యాప్తంగా విరివిగా ఉపయోగిస్తున్న ఇంటర్నెట్ కు భద్రత ముఖ్యమని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. సైబర్ సెక్యూరిటీ కోసం కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇప్పటికే 40 కోట్ల మంది ఇంటర్నెట్ కు అనుసంధానం అయ్యారన్న కేంద్ర మంత్రి.. వచ్చే ఏడాది నాటికి ఈ సంఖ్య 60 కోట్లకు చేరనుందని తెలిపారు. 2018 నాటికి ప్రతి గ్రామపంచాయతీకి ఇంటర్నెట్ సేవలను అందిస్తామన్నారు. 

హైదరాబాద్ హెచ్ఐఐసీలో జరుగుతున్న ఐకాన్ సదస్సు ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగనుంది. దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.

Related Stories