కార్డుబోర్డుతో అద్భుతమైన ఫర్నిచర్..! వుడ్ కంటే అద్భుతం.. ప్లాస్టిక్ కంటే సూపర్..!!

0

ఊయల నుంచి శవపేటిక వరకు మనిషి అవసరాల కోసం కలపను ఎంతగా వాడుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫర్నిచర్, మంచాలు, కుర్చీలు, టేబుల్స్ ఇవన్నీ సమకూర్చడం కోసం చెట్లను విరివిగా నరుకుతున్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా చెట్లు మాత్రం పెరగడం లేదు. అడవుల కొట్టివేత మూలంగా పర్యావరణ పరంగా ఇప్పటికే తగిన మూల్యాన్ని చెల్లించుకుంటున్నాం. ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ వాడకం కూడా మరో ముప్పుగా పరిణమించింది. అందుకే ఈ రెండింటికి ఆల్టర్నేట్ గా అతను ఫర్నిచర్ తయారుచేస్తూ వ్యాపారాన్ని అనుకున్న లాభాలతో నడిపిస్తున్నాడు.

ముడతలు ముడతలుగా ఉండే కార్డ్ బోర్డ్. ఇదే హరీష్ మెహతా ముడిసరుకు. ముంబైకి చెందిన ఇతను వుడెన్ ఫర్నిచర్ కు అద్భుతమైన ప్రత్యామ్నాయం కనుగొన్నాడు. కార్డ్ బోర్డు ఫర్నిచర్ వంగిపోదు. కుంగిపోదు. తేలిగ్గా అసెంబుల్ చేసుకోవచ్చు. అవసరమైతే రీ సైకిల్ కూడా చేయొచ్చు. పెద్దగా ఖర్చు కూడా లేదు.

గుజరాతీ కుటుంబానికి చెందిన హరీష్ కాలేజీ డ్రాపవుట్. తల్లిదండ్రులు ప్యాకేజీ బిజినెస్ చేసేవారు. కానీ వాళ్లు సంపాదిస్తుంటే మూలకు కూర్చుని తినాలని అనుకోలేదు. చదువు ఎలాగూ వంటబట్టలేదు. కాబట్టి తాను కూడా ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుందని అనుకున్నాడు. అప్పుడే పేపర్ షేపర్ ఆలోచన వచ్చింది.

హరీష్ తయారుచేసే ఫర్నిచర్ అర్బన్ లైఫ్ కి సరిగ్గా సూటవుతుంది. డ్యూరబుల్, లైట్ వెయిట్, పోర్టబుల్ దాంతోపాటు ట్రెండీ కూడా. ఒకవేళ వస్తువు పనికిరాదు అనుకుంటే నిమిషాల్లో దాన్ని డిస్మాటిల్ చేయొచ్చు. చిన్న పీస్ కూడా వేస్ట్ కాదు. ఈవెన్ శవపేటిక కూడా. శవంతో పాటు ఖననం చేసిన కొద్ది రోజుల్లోనే అది భూమిలో కలిసిపోతుంది.

బిజినెస్ ఐడియా బానే వుంది. కానీ అట్టపెట్టెలతో ఫర్నిచర్ చేస్తే దాని క్వాలిటీని ఎవరు విశ్వసిస్తారు? వెరైటీ ఫర్నిచర్ వెల్లువలో పడి కొట్టుకుపోతున్న జనాన్ని ఎలా మెప్పించాలి? అదే పెద్ద సమస్య అయిందంటారు హరీష్. ఒకటి కాదు రెండు కాదు. గత పాతికేళ్లుగా జనంలో నమ్మకాన్ని ఎలా పాదుగొల్పానే ఆరాటపడుతున్నాడు. వస్తువు మన్నిక మీద, ధృడత్వం మీద అంతగా ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోయాడు. అందుకే గత మే నెలలో బ్రాండ్ పేపర్ షేపర్ ని ఆన్ లైన్లో లాంఛ్ చేశాడు.

పేపర్ షేపర్ ప్రస్తుతం బూట్ స్ట్రాప్డ్ కంపెనీ. ప్రాడక్ట్ ధర మూడు వేల నుంచి మొదలవుతుంది. డెలివరీ ఎక్కడైనా ఇస్తారు. వచ్చే ఐదేళ్లలో రూ. 30-40 కోట్ల టర్నోవర్ ఆశిస్తున్నారు. కార్డ్ బోర్డ్ ఫర్నిచర్ అనే ఐడియాను మరింత మార్కెట్ చేయడానికి ఆన్ లైన్ చిల్డ్రన్ ఫర్నిచర్ శ్రేణిని కూడా ప్రారంభించాడు. పిల్లలకు దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే.. మార్కెట్లో దొరికే రెగ్యులర్ వుడెన్ ఫర్నిచర్ అంచులు చాలా పదునుగా వుంటాయి. దాంతో వాళ్లు గాయపడే ప్రమాదం ఉంది. పైగా బరువు కూడా ఎక్కువే. అదే కార్డ్ బోర్డ్ ఫర్నిచర్ అయితే బరువుండదు. అంచులు కూడా మెత్తగా వుంటాయి. పిల్లలకు అవే సురక్షితం. వాటితో ఫన్ యాక్టివిటీస్ కూడా చేయొచ్చంటాడు హరీష్. పైగా ఎక్కడికంటే అక్కడికి తేలిగ్గా షిఫ్ట్ చేసుకునే అవకాశం కూడా వుంది.

ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే..

మన దేశంలో మరుగుదొడ్లు పెద్ద సమస్య. సుదూర ప్రయాణాల్లో ఇంకా నరకం. సరైన సదుపాయం ఉండదు. ఒకవేళ ఉన్నా అవంత శుభ్రంగా ఉండవు. రోడ్ సైడ్ టాయిలెట్స్ విషయంలో అంతకంటే ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేయలేం. అందుకే వాటికో ఉపాయం కనిపెట్టాడు. దానిపేరే పోర్టబుల్ టాయిలెట్. ముడతల కార్డ్ బోర్డు నుంచే దాన్ని తయారుచేశాడు. ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ. ఎక్కడికంటే అక్కడికి సులువుగా క్యారీ చేయొచ్చు. మడతపెట్టొచ్చు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన ఈ కార్డ్ బోర్డ్ టాయిలెట్.. వృద్ధులు, వికలాంగులు లాంగ్ జర్నీలో ఉన్నప్పుడు ఇది బ్రహ్మాండంగా ఉపయోగ పడుతుందని హరీష్ అంటున్నారు.

హరీష్ చేస్తున్న ఈ వినూత్న ప్రయోగం ఇప్పుడిప్పుడే జనంలోకి వెళ్తోంది. కామ్లిన్, ఫిలిప్స్, బజాజ్, రేమండ్, గిని అండ్ జానీ లాంటి బడా కంపెనీలు హరీష్ క్లయింట్స్ గా మారారు. ప్రస్తుతానికి ముంబైలో మాత్రమే పాపులర్ అయిన తన కంపెనీని దేశమంతా విస్తరించాలని చూస్తున్నాడు. ప్రజల ఆదరణ ఇలాగే వుంటే పర్యావరణానికి మేలుచేసే ప్రత్యామ్నాయ ఫర్నిచర్ వెరైటీలు తయారుచేస్తానని నమ్మకంతో చెప్తున్నాడు హరీష్  

Related Stories