చదివింది ఇంజనీరింగ్.. సక్సెస్ అయింది మాత్రం వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో

బిటెక్ చదివి ఫోటోగ్రఫీవైపుఇంట్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైనా వెనక్కి తగ్గలేదుఇంజనీరింగ్ చేస్తున్నా తన హాబీని మాత్రం వదల్లేదుచెన్నైలో సక్సెస్‌ఫుల్ ఫోటోగ్రాఫర్‌గా పేరుఒకే చోటికి ఫోటోగ్రఫీ,వీడియోగ్రఫీ సేవలు

చదివింది ఇంజనీరింగ్.. సక్సెస్ అయింది మాత్రం వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో

Monday July 06, 2015,

3 min Read

పెళ్లి ఓ అద్భుతమైన వేడుక. జీవితంలో అదో మరపురాని రోజు. ఎన్ని సార్లు ఆ ముచ్చట్లు గుర్తుచేసుకున్నా చాలామందికి తనివి తీరదు. పెళ్లై పది, ఇరవై ఏళ్లైనా మళ్లీ ఓ సారి పాత ఆల్బమ్స్, వీడియోలు చూసుకుంటే ఆ ఆనందమే వేరు. అప్పుడు అలా ఉండేవారు, ఇలా ఉండేవారు.. అంటూ తెగ మురిసిపోతారు. అలాంటి వేడుకను కలకాలం గుర్తుండేలా చేసేవి కేవలం ఫోటోలే. దేశంలో ఎంత సెల్ఫీల పిచ్చి ఉన్నా ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీకి ఉండే కళే వేరు. అందుకే ఇప్పుడా వెడ్డింగ్ ఇండస్ట్రీ లక్ష కోట్ల రూపాయల మార్కును దాటింది. ఏటా 25-30 శాతం వృద్ధిని కూడా కనబరుస్తోంది. ఇప్పటికే ఈ ఫోటోగ్రఫీ బిజినెస్‌లో జోడీక్లికర్స్, నాట్ ఇన్ ఫోకస్‌ వంటి కంపెనీలు జోరుమీదున్నాయి. ఇప్పుడు ఈ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చెన్నైకి చెందిన ప్రణేష్ ఫోటోగ్రఫీ కూడా సిద్ధమైంది. ఇంతకీ ఏంటీ కంపెనీ ప్రత్యేకత ? ఏంటీ వాళ్ల ప్రణాళికలు ? ఇతరులకంటే వీళ్లు ఎందుకు భిన్నం ?

ప్రణేష్ పద్మనాభన్

ప్రణేష్ పద్మనాభన్


ప్రణేష్ పద్మనాభన్, బిటెక్ గ్రాడ్యుయేట్, మార్కెటింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసినా ఫోటోగ్రఫీ, వెడ్డింగ్‌ బిజినెస్‌లో కాలుమోపారు. కుటుంబ సభ్యులు వద్దని వారించినా, స్నేహితులంతా నిరుత్సాహపరిచినా తన మనసుకు నచ్చిన పనేచేసి ఇప్పుడో స్థాయికి వచ్చారు ప్రణేష్.

''నాకు విజుయల్ కమ్యూనికేషన్ చేయాలని ఉన్నా మా కుటుంబ సభ్యుల బలవంతం మీద బిటెక్ జాయిన్ కావాల్సి వచ్చింది. అయినా నేను మాత్రం నా ఫోటోగ్రఫీపై ఆసక్తి పెంచుకుంటూనే ఉన్నాను. మా అంకుల్‌ని ఎస్ఎల్ఆర్ కెమెరా అడిగి ప్రతీ వారం ఎవరికీ తెలియకుండా ప్రాక్టీస్ కంటిన్యూ చేసేవాడిని '' అంటారు 27 ఏళ్ల ప్రణేష్. ఈ కష్టాలకు తోడు బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చేందుకు నిరాకరించాయి. కుటుంబ సభ్యుల సహకారం, బ్యాంకుల ప్రోత్సాహం లేకున్నా తన మనసుకు నచ్చిన పనినే పూర్తిగా నమ్ముకున్నారు ప్రణేష్.

సర్‌ప్రైజ్ మంత్ర

ఈ రోజుకు దాదాపు 200 పెళ్లిళ్లు చేసిన తర్వాత తన ఫోటోగ్రఫీ ప్రస్థానాన్ని తర్వాతి స్థాయికి తీసుకెళ్లాలనేది అతడి ఆలోచన. వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ఒన్ స్టాప్ సొల్యూషన్‌లా తన సంస్థను మార్చాలని చూస్తున్నారు. ఫోటోరియలిస్టిక్ ఫోటోగ్రఫీ, క్రియేటివ్ వెడ్డింగ్ సినిమాటోగ్రఫీ, ట్రెడిషనల్ వీడియోగ్రఫీ, ట్రెడిషనల్ ఫోటోగ్రఫీ, కస్టమ్ మేడ్ ఫోటోబుక్స్, ప్రి/పోస్ట్ వెడ్డింగ్ షూట్స్, బ్రైడల్ షూట్స్, అటైర్ సజెషన్స్, మేకోవర్ సజెషన్స్ వంటి వాటిని అందిస్తున్నారు.

ప్రణేష్ ఫోటోగ్రఫీ ఈ మధ్యే 'సర్‌ప్రైజ్ మంత్ర' పేరుతో ఒక యాడ్ ఆన్ సర్వీసును ఆఫర్ చేస్తోంది. వరుడు లేదా వధువుకు సంబంధించిన ఫ్రెండ్స్, బంధువులు ఎవరైనా వాళ్లను ఆశ్చర్యపరిచేలా ఓ షూట్ ప్లాన్ చేయొచ్చు. వీటితో పాటు ఎవరి బడ్జెట్‌కు తగ్గట్టు దాదాపు ఐదు వేల రకాలైన సేవలు తమ దగ్గర అందుబాటులో ఉంటాయి.

image


ప్రస్తుతం ప్రణేష్‌కు చెన్నైలో ఓ డిజైన్ స్టూడియో ఉంది. ఫోటోల డిజైనింగ్, ఎడిటింగ్‌ కోసం క్లైంట్లు అక్కడికి వచ్చి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఐదుమంది ఫుల్ టైం, పదిమంది పార్ట్‌టైమ్‌, ఐదుగురు ఫ్రీలాన్సర్ల సేవలను వినియోగించుకుంటున్నారు. ప్యాకేజ్ రేట్లు తక్కువగా ఉండడం వల్ల తన దగ్గరకు వచ్చే కస్టమర్లు వివిధ సేవలను ఒకేసారి ఉపయోగించుకుంటారని ప్రణేష్ చెబ్తున్నారు.

కెరీర్‌లో ఇప్పుడీ స్థాయికి వచ్చిన తను ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. అయితే ఫేస్‌బుక్‌లో తన ఫ్యాన్స్ సంఖ్యను చూసుకుంటే ఆ కష్టమంతా తీరిపోతుందంటారు. ఇప్పుడు తన ఫేస్‌బుక్‌ పేజ్‌కు 75 వేలకుపైగా లైక్స్ ఉన్నాయి. తన స్టార్టప్ జర్నీలో కొత్త క్లైంట్స్ యాడ్ అయ్యే కొద్దీ వ్యాపారం వృద్ధి చెందుతూనే ఉంది. ''ఒక్కోసారి క్లైంట్లు తన దగ్గర ఆరు నెలల ముందు డేట్స్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితులూ ఉంటాయి. ఒక్కో చెన్నై, బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్లు రిజెక్ట్ చేసిన తర్వాత ఆ ఆర్డర్లు నా దగ్గరికి వస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది'' అంటూ మురిసిపోతారు.

ప్రస్తుతానికి తన ప్రచారమంతా ఫేస్‌బుక్, మౌత్ పబ్లిసిటీ ద్వారానే సాగుతోంది. తర్వాతి స్థాయికి వెళ్లేందుకు నిధుల సమీకరణ వేటలో పడ్డాడు ప్రణేష్. ఒక్కోసారి పీక్ సీజన్‌లో ఆర్డర్లు ఎక్కువగా వచ్చినప్పుడు నిధుల సమస్య ఏర్పడుతూ ఉంటుంది. అది తన పనికి ఆటంకం కలిగిస్తుందని అందుకే చేతిలో నిధులు ఉంటే ధైర్యం ఉంటుందనేది అతని మాట. భవిష్యత్తులో ఒక కమర్షియల్ స్టూడియో, హైటెక్ బ్రైడల్ స్టూడియో, ఫోటోగ్రఫీ స్కూల్ ఏర్పాటు చేసి ఓ బెస్ట్ ఫోటోగ్రాఫర్‌గా స్థిరపడిపోవాలనే లక్ష్యంతో సాగుతున్నారు.

image


తన మనసు మాట విని ఇంతదూరం ప్రయాణించినందుకు ప్రణేష్ చాలా సంతోషంగా ఉన్నారు. అయితే భారత దేశంలో టాప్ టెన్ ఫోటోగ్రాఫర్లలో ఒకడిగా ఎదిగేందుకు ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఉందనేది తనకు బాగా తెలుసు. అందుకు అవసరమైన గ్రౌండ్ వర్క్‌ను చేసుకునే పనిలో పడ్డారు.

మీకూ ఇలాంటి సక్సెస్ స్టోరీలు ఏవైనా తెలిసుంటే మాకు తెలియజేయండి. మరింత మంది వారిని చూసి స్ఫూర్తి పొందొచ్చు.