75 దేశాల్లో, 2 కోట్ల మందికి చేరువైన 'టీ బాక్స్'

ఆన్ లైన్ లో టీ విక్రయాలు65కి పైగా దేశాలకు ఎగుమతికాదేదీ కవితకనర్హం... ఇది నిన్నటి మాట.కాదేదీ ఆన్ లైన్ లో విక్రయాలకు అనర్హం... ఇది నేటి నిజం

75 దేశాల్లో, 2 కోట్ల మందికి చేరువైన 'టీ బాక్స్'

Saturday July 25, 2015,

3 min Read

image


ఆన్ లైన్ విక్రయాలు దూసుకుపోతున్న రోజులివి.. ఇలాంటి తరుణంలో నాణ్యమైన తేయాకు సేకరించి మాంచి రుచికరమైన టీపొడి ఆన్ లైన్లో విక్రయించగలిగితే... వినేందుకు ఒకింత విస్మయం కలిగించినా ఇందులో చక్కటి వ్యాపార అవకాశం ఉందని కౌశల్ దుగార్ నమ్మాడు. తన నమ్మకం నూటికి నూరుపాళ్లు నిజమని నిరూపించాడు. అతడు స్థాపించిన ‘‘టీ బాక్స్’’ సంస్థ 75కి పైగా దేశాలకు టీ ఎగుమతి చేస్తోందంటే అర్ధం చేసుకోవచ్చు అతడి ఆలోచన ఎంతగా క్లిక్ అయిందో! కానీ ఇదంతా అలవోకగా ఏమీ అయిపోలేదు. దీని వెనుక ఎంతో తపన ఉంది. ఒక మామూలు యువకుడు 2013 ఈ-స్పార్క్స్ అవార్డ్ దక్కించుకునే వారు సాగిన ఓ స్ఫూర్తిదాయకమైన ప్రయాణముంది.

image


కౌశల్ ప్రయాణం ఈశాన్య భారతంలోని సిలిగురి అనే చిన్న పట్టణం నుంచి ప్రారంభమైంది. వెస్ట్ బెంగాల్ సరిహద్దుల్లో ఉన్న ఈ పట్టణం తేయాకు పంటకు ప్రసిద్ధిగాంచింది. ఆన్ లైన్ బిజినెస్ చేసేవారంతా ముంబై లాంటి మెట్రో నగరాలనే కేంద్రంగా చేసుకుంటారు. కౌశల్ మాత్రం సిలిగురి నుంచే ‘‘టీ బాక్స్’’ వ్యాపారం చేయాలనుకున్నారు. మారుమూల ప్రాంతంలో ఉన్న సిలిగురి నుంచి ఆన్ లైన్ బిజినెస్ అనేసరికి అంతా పెదవి విరిచిన వారే. పెట్టుబడి పెట్టడానికి వెనకడుగు వేసినవారే. ‘‘టీ బాక్స్’’ ఆలోచన గురించి ఫోన్‌లో ఎంత విడమరిచి చెప్పినా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసిన వారే ఎక్కువ. తన ఆలోచన, ప్రణాళికల వివరాలతో పంపిన ఈ-మెయిళ్లకు స్పందన కోసం వేచిచూసి కౌశల్ విసిగిపోయిన రోజులెన్నో.

కొన్నాళ్లకు కౌశల్ కు తన ప్రయత్నంలో లోపం అర్ధమైంది. ఫోన్‌లో మాటలతోనే... ఈ-మెయిల్‌లో రాతలతోనే పెద్దగా ఉపయోగం ఉండదని తెలిసింది. ఢిల్లీ, ముంబయి, బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు పలుసార్లు వెళ్లి పెట్టుబడిదారులను స్వయంగా కలిశాడు. ‘‘టీ బాక్స్’’ ఆలోచన, అది క్లిక్ అవడానికి ఉన్న అవకాశాలు.. భవిష్యత్తులో ఎంతవరకు పైకెదగవచ్చు.. వంటి అన్ని అంశాలు వివరించి చెప్పాడు. అతడి మాటలు, అందులోని ఆత్మవిశ్వాసంపై కొందరికి గురి కుదిరింది. దీంతో సిలిగురిలో ‘‘టీ బాక్స్’’ స్థాపన సుసాధ్యమైంది.

image


నిజానికి ఆన్ లైన్ లో టీ విక్రయించడం అంత సులభం కాదనే మాట కౌశల్ సైతం అంగీకరిస్తాడు. ఎందుకంటే ఆన్‌లైన్ ద్వారా ఓ సెల్ ఫోన్ కొనాలనుకున్న వినియోగదారుడికి తనకు ఏం కావాలో స్పష్టంగా తెలుసు. కానీ టీ అలా కాదు. టీ పొడి చూడాలి. రంగు, రుచి, వాసన బాగుండాలి. అప్పుడే కొనేందుకు ముందుకొస్తాడు. అందుకే ఈ విషయంలో కౌశల్ తగిన జాగ్రత్తలే తీసుకున్నాడు. వినియోగదారులను మెప్పించేందుకు స్పష్టమైన అవగాహనతో పని ప్రారంభించాడు.

సిలిగురి తేయాకు తోటల్లో శ్రేష్ఠమైన ఆకులనే ‘‘టీ బాక్స్’’ కోసం సేకరిస్తారు. వాటి తాజాదనం కోల్పోకుండా ప్రాసెస్ చేసి ప్యాకేజింగ్ పూర్తి చేస్తారు. వాటిని డీహెచ్ఎల్, ఫెడ్ ఎక్స్, ఎయిర్ మెయిల్, ఈఎంఎస్ (ఇండియా పోస్ట్) వంటి కొరియర్, సరకు రవాణ సంస్థల ద్వారా కొనుగోలుదారులకు పంపిస్తారు. సాధారణంగా అయితే ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి మూడు నుంచి ఆరు నెలల వరకు పడుతుంది. కానీ ‘‘టీ బాక్స్’’ కు వచ్చిన ఆర్డర్ ను వారం లేదా అంతకన్నా లోపే కొనుగోలుదారులకు అందిస్తారు. తాము టీ ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఏ దేశానికి ఏ కొరియర్ ద్వారా తొందరగా కొనుగోలుదారుకు సరకు అందుతుందో అధ్యయనం చేసి మరీ అదే సంస్థ ద్వారా పంపిస్తారు. తాజాదనం పోకుండా అందించే శ్రేష్ఠమైన, రుచికరమైన సిలిగురి తేయాకు కోసం కెనడా, రష్యాల నుంచి టీ ప్రేమికులు కేజీకి 100 డాలర్ల నుంచి 1500 డాలర్ల వరకు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. 2014 నాటికి ‘‘టీ బాక్స్’’ వాణిజ్యం 5 మిలియన్ కప్ లకు చేరింది. ఇందులో 99 శాతం విదేశాలకు ఎగుమతి చేసిందే కావడం విశేషం. తమ విజయానికి వేదిక అయిన సిలిగురిని కౌశల్ బృందం విస్మరించలేదు. ఈ ప్రాంతంలోని తేయాకు తోటల్లో పనిచేసే వారి పిల్లలు ఉన్నత చదువులు చదువుకునేందుకు ధన సహాయం అందిస్తున్నారు.

‘‘టీ బాక్స్’’ విజయంతో కౌశల్ ను 2013 ఈ-స్పార్క్స్ అవార్డ్ వరించింది. ఇది అతడి ఘనతను ప్రపంచానికి పరిచయం చేసింది. ‘‘టీ బాక్స్’’ లో పెట్టుబడులకు తొలి దశలో ఆసక్తి చూపినా ముందడుగు వేయని సింగపూర్‌కు చెందిన ఏసెల్ పార్ట్‌నర్స్ అండ్ హారిజన్ వెంచర్స్ సంస్థ ఒకేసారి ఏకంగా మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది.

image


‘‘ఈ-స్పార్క్స్ అవార్డ్ నన్ను వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది. రాబోయే కాలంలో మా వ్యాపారాన్ని ఐదింతలు చేయాలన్నది లక్ష్యం. సమర్ధ ఉద్యోగులు, పక్కా మార్కెటింగ్ ద్వారా ఈ లక్ష్యాన్ని చేరతామనే నమ్మకముంది. సిలిగురితోపాటు తేయాకు పండే గౌహతి, నీలగిరి, కోచి ప్రాంతాలకు కార్యకలాపాలు విస్తరిస్తాం.

టీ అనేది ప్రారంభం మాత్రమే. సుగంధ ద్రవ్యాలు, తృణ ధాన్యాలు.. ఇలా చాలా అంశాల్లో వ్యాపారం విస్తరించాలి. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. చేరాల్సిన గమ్యమూ చాలా దూరం ఉంది’’

‘‘యాసెల్ చేరికతో సిలిగురిలాంటి చిన్న పట్టణానికి చెందిన ‘‘టీ బాక్స్’’ ప్రపంచస్థాయి కంపెనీగా ఎదగడానికి అవకాశం లభించింది. ఇప్పుడు ముందున్న సవాలల్లా సంస్థ ఉద్యోగులను ఇందుకు సంసిద్ధులను చేయడమే. వినియోగదారుల సంతృప్తే మొట్టమొదటి ప్రాధాన్యం...’’ అని కౌశల్ అంటున్నారు.

‘‘ఓ కొత్త ఆలోచనతో ప్రయాణం ప్రారంభించి విజయం సాధించాలంటే... ఐఐటీల్లోనో.. ఐఐఎంలలోనో చదివి ఉండాలనేం లేదు. మహా నగరాల్లో పుట్టి పెరిగి ఉండాల్సిన అవసరం లేదు. మీమీద మీకు నమ్మకముండాలి. మీ ఆలోచనల మీద, మీ సహచరుల మీద, మీరు నమ్మిన మార్గం మీద నమ్మకముండాలి. మీ ఆలోచనపై మీకు తిరుగులేని నమ్మకం ఉన్నప్పుడే మీతో కలిసి పని చేయాలనుకునే వారికో... మిమ్మల్ని నమ్మి పెట్టుబడి పెట్టాలనుకునేవారికో నమ్మకం కలుగుతుంది. అందుకే మిమ్మల్ని మీరు నమ్మండి.. నమ్మండి’’

– కౌశల్ దుగార్