వందేళ్ల విద్యానవనం ఉస్మానియా సెంటినరీ సెలబ్రేషన్స్ హైలైట్స్ ఇవే..

వందేళ్ల విద్యానవనం ఉస్మానియా సెంటినరీ సెలబ్రేషన్స్ హైలైట్స్ ఇవే..

Friday April 21, 2017,

3 min Read

ఉస్మానియా సెంటినరీ సెలబ్రేషన్స్ కనీవినీ ఎరుగని రీతిలో జరగబోతున్నాయి. అందుకు తగ్గట్టే ఏర్పాట్లు కూడా ఘనంగానే జరుగుతున్నాయి. ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు అలరిస్తాయి. మొదటిరోజు ప్రారంభ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరవుతారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ కేకే, మేయర్ బొంతురామ్మోహన్ ముఖ్య అతిథులుగా హాజరవుతారు.

పూర్వ విద్యార్ధులు, విశిష్ట స్థానాల్లో ఉన్న వ్యక్తులందరికీ ఇప్పటికే ఆహ్వానాలు పంపారు. దాదాపు18 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం రెండు వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. కల్చరల్ వేదికగా ఆర్ట్స్ కాలేజీ దగ్గర ముస్తాబవుతోంది. అకాడమిక్ స్జేజీ ఏ2 మైదానంలో రెడీ అవుతోంది. మొదటిరోజు మార్నింగ్ సెషన్ పదిన్నర నుంచి 12.30 వరకు వుంటుంది. ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ మధ్యాహ్నం 12.30కి క్యాంపస్‌కి చేరుకుంటారు. ఆలోపు కల్చరల్ ప్రోగ్రామ్స్ రన్ అవుతాయి. మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు ఈవినింగ్ సెషన్ ఉంటుంది. 

అకాడమిక్ సెలబ్రేషన్స్ లో భాగంగా 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు రోల్ ఆఫ్ ఓయూ ఇన్ తెలంగాణ అండ్ నేషన్ అనే అంశంపై సెమినార్ నిర్వహిస్తారు. ఈ అంశంపై పలువురు వక్తలు మాట్లాడతారు. దీనికి మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరువుతారు. ఎంపీ కేకే చైర్ పర్సన్ గా వ్యవహరిస్తారు. మాజీ వైస్ ఛాన్స్ లర్ మహ్మద్ సులేమాన్ సిద్ధిఖీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ వివిధ అంశాలపై మాట్లాడుతారు.

image


రెండో రోజు, అంటే 27న సెకండ్ సెషన్ లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు పూర్వ విద్యార్ధుల సమ్మేళనం జరుగుతుంది. దీనికి మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరవుతారు. మరో అతిథి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ వస్తారు. ఇదే సమయంలో మరోవైపు ఆల్ ఇండియా వైస్ ఛాన్స్ లర్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. దీనికి కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ముఖ్యఅతిథిగా వస్తున్నారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి మరో గెస్టుగా రాబోతున్నారు.

మూడో రోజున అంటే, 28న ఉదయం ఆల్ ఇండియా వైస్ ఛాన్స్ లర్ ముగింపు సదస్సు ఉంటుంది. దీనికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చీఫ్ గెస్ట్ గా వస్తారు. అనంతరం, మరో వందేళ్ల తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ ఎలా వుండాలి? అనే అంశంపై ప్యానెల్ డిస్కషన్ జరుగుతుంది. విజన్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా ఎంపీ కేకే వస్తున్నారు.

అకాడమిక్ సెలబ్రేషన్ వేదికగా ఉండే ఏ2 మైదానంలో సుమారు 16వేల మంది కూర్చునేలా సీట్లు అరెంజ్ చేశారు. సెగ్మెంట్ల వారీగా, ప్రోటోకాల్ ని బట్టి కుర్చీలు కేటాయిస్తారు. పూర్వ విద్యార్ధుల కోసం 2వేల సీట్లు వేశారు. ప్రతీ 80 అడుగులకో ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేస్తారు. రాష్ట్రపతి వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి కాబట్టి, నగర ట్రాఫిక్ విభాగంతో కలిసి కో ఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఇంకా కన్ ఫ్యూజన్ లేకుడా ఇన్విటేషన్ మీదనే రూట్ మ్యాప్ ప్రింట్ చేశారు. ఎవరు ఏ వైపు నుంచి రావాలన్నది కార్డుపై స్పష్టంగా ఉంటుంది. కార్డుల్ని ఆరు కేటగిరీలుగా పంపిణి చేశారు. కారు పాసులు ఇన్విటేషన్ కార్డులోనే ఉండేలా చూస్తున్నారు. మెడికల్ క్యాంపులు, ఫైర్ ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి. ఎంట్రీ పాసుల్ని ఆన్ లైన్లో కూడా తీసుకునే వెసులుబాటు కల్పించారు.

ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలను వీలైనంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో వివిధ శాఖల అధిపతులతో చర్చించి కల్చరల్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారు. ప్రధాన వేదిక మీద అకడమిక్ కార్యక్రమాలు జరిగితే, ఆర్ట్స్ కాలేజీ దగ్గర కల్చరల్ ఈవెంట్స్ జరుగుతాయి. మొదటిరోజు అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి, కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఉస్మానియా యూనివర్శిటీ కోసమే ప్రత్యేకంగా రూపొందించిన పాటలను 50మంది కళాకారులు పాడతారు. వందేళ్లను పురస్కరించుకుని వందేళ్లు -వందగళాలు అనే కాన్సెప్టుతో సారే జహాసే అచ్చా పాటను వందమంది ఆలపిస్తారు.

 ప్రతీ రోజు కల్చరల్ ఈవెంట్స్ ఉస్మానియా విద్యార్ధులతోనే మొదలుపెడతారు. వారితో పాటు అంతర్జాతీయ విద్యార్ధులు తమ నేటివ్ ఆర్ట్ ఫామ్స్ ప్రదర్శిస్తారు. విశ్వమానవ భావాన్ని ప్రతిబించించే విధంగా ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారు. చారిత్రక పరిణామాలను ప్రతిబింబించేలా నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే పాటను ఆటరూపంలో ప్రదర్శిస్తారు. వందేళ్లు- వంద నర్తనాలు అనే కాన్సెప్టుతో పేరిణి శివతాండవం ఉంటుంది. యాభై మంది మగవారు, యాభై మంది ఆడవారు పేరిణి నృత్యాన్ని ప్రదర్శిస్తారు. శివారెడ్డి మిమిక్రీ, ఖవ్వాలీ మొదలైన కార్యక్రమాలు కూడా ఉంటాయి.

27వ తేదీన వందేళ్లు-వంద జానపదులు అనే కాన్సెప్టుతో వివిధ రకాల కళారూపాల ప్రదర్శన డిజైన్ చేశారు. దాంతోపాటు మాడ్రన్ ఫ్యూజన్ డాన్స్, మైమ్ ప్రదర్శన, భోళే- కందికొండ నేతృత్వంలో పాటలు ఉంటాయి. ఇక 28 సాయంత్రం విభిన్న సంస్కృతుల నిలయంగా నాలుగు కళారూపాలతో నృత్యరూపకం డిజైన్ చేశారు.

చివరగా వందేళ్లు-వంద డోళ్లు పేరుతో ఒగ్గుడోళ్ల ప్రదర్శన ఉంటుంది. ముగింపు వేడుకలు ధూంధాంగా ప్లాన్ చేశారు. కళ్లు చెదిరిపోయే ఫైర్ వర్క్స్ ఉంటాయి. కల్చరల్ ఈవెంట్లలో మరో హైలైట్- సెంటినరీ కల్చరల్ కార్నివాల్. ఎన్సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు ఒక ఊరేగింపులా వచ్చేలా ప్లాన్ చేశారు. ఇందులో ప్రొఫెసర్లు, విద్యార్ధులు, ప్రముఖులు అందరూ హంగామా చేస్తారు. ఈ మూడు రోజులు ప్రారంభ ఉత్సవాలు మాత్రమే. సెంటినరీ సెలబ్రేషన్స్ ఏడాది పొడవునా ఉంటాయి. అంటే 2018 ఏప్రిల్ 25 వరకు శతాబ్ది వేడుకలు జరుగుతాయన్నమాట.