డిజిటిల్ బిజినెస్ కార్డ్‌ను ఎప్పుడైనా చూశారా ?

కంప్యూటర్ ఆధారిత సమాచార సాంకేతిక వ్యవస్థ ఎంతగా అభివృద్ధి చెందినా అవసరమైన సమాచారాన్ని పొందేందుకు కొంత సమయం వృథా అవుతూనే ఉంది. అలా కాకుండా సమాచారాన్నంతా తేలికగా పొందే.. తేలికగా నిల్వచేసుకొనే మార్గమేదీ లేదా ? అనే ప్రశ్నే అతని మెదడును తొలిచేసేది. మథనంలోంచి పుట్టుకొచ్చిందే నియర్‌ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ) లింక్సప్.

డిజిటిల్ బిజినెస్ కార్డ్‌ను ఎప్పుడైనా చూశారా ?

Monday May 18, 2015,

5 min Read

ఒకానొకనాడు మనిషి నడిచీ నడిచీ విసిగెత్తి... కష్టపడకుండా ప్రయాణిస్తే బాగుండు అనుకొన్నాడు. ఆ ఆలోచన ఎడ్లబండిని కనుగొనేందుకు దారితీసింది. ఇంకా వేగంగా వెళ్లాలని ప్రయత్నించాడు. ఆ మేధోమథనం నుంచి యంత్రం పుట్టుకొచ్చింది. పక్షుల్లా ఆకాశంలో ఎగరగలిగితే ఇంకా వేగంగా వెళ్లవచ్చుకదా అని ఆలోచించాడు. ఆ ఆలోచనలోంచి విమానం రూపుదాల్చింది. ఈ భూమిపై ఏ ఆవిష్కరణ అయినా అవసరంలోంచే పుట్టుకొచ్చింది. ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నాయి. రాఘవేంద్ర సబూకు కూడా ఓ ఆలోచనే వచ్చింది. అలా వాటి నుంచే పురుడుపోసుకుంది నియర్‌ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ) లింక్సప్.

లింక్సప్ రూపొందించిన డిజిటల్ బిజినెస్ కార్డ్స్

లింక్సప్ రూపొందించిన డిజిటల్ బిజినెస్ కార్డ్స్


సాధారణ ప్రశ్నలకు సాధారణ సమాధానాలు..

స్మార్ట్‌ఫోన్, ట్యాబ్‌ల విప్లవంతో ప్రపంచవ్యాప్తంగా రోజూ వందలకొద్దీ కొత్త యాప్స్ పుట్టుకొస్తున్న కాలమిది. వందలు, వేల యాప్స్ ప్రస్తుతం లభిస్తున్నా అందులో చాలావరకు ఒకే రకమైన పనిని కొంత భిన్నంగా చేసేవే ఎక్కువ. అయితే, వ్యక్తి వ్యక్తిగత సమాచారాన్నంతా ఒకే చోట స్టోర్ చేసి పరిమిత ప్రదేశంలో ఎలాంటి అనుసంధానం లేకుండా తేలికగా ఆ సమాచారాన్ని మార్పిడి చేసేలా ఒక వేదికను సృష్టించాలన్న సబూ ఆలోచన ఒక సరికొత్త ఆవిష్కరణకు దారితీసింది. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లలో సమాచారాన్ని తేలికగా స్టోర్‌చేసి ఆ డాటాను అవసరమైనప్పుడు ఇతరులకు తేలికగా చేరవేసేందుకు ఎన్‌ఎఫ్‌సీ యాప్‌ను సబూ సృష్టించారు. ఈ ఆవిష్కరణకు ప్రేరణ ఆయన వ్యక్తిగత అవసరాలే. ఎలాంటి అనుసంధానం లేకుండా వైర్‌లెస్ టెక్నాలజీతో సమాచారాన్ని మార్చుకొనేందుకు వైఫై, బ్లూటూత్ వంటి సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటన్నింటికంటే ఎన్‌ఎఫ్‌సీ చాలా తేలికైన టెక్నాలజీ. ఎవరైనా తేలికగా వాడుకోవటానికి వీలున్న టెక్నాలజీ. ఎన్‌ఎఫ్‌సీ అన్నిరకాల స్మార్ట్‌ఫోన్లు, ఐఫోన్లలో పనిచేస్తుంది. సాధారణ సమస్యలకు సాధారణ పరిష్కారాలే చూపాలన్న సూత్రంపై రూపొందించబడిందే ఈ ఎన్‌ఎఫ్‌సీ. ఎన్‌ఎఫ్‌సీని ఆవిష్కరించిన తర్వాత రాఘవేంద్రసబూ దానిని ఎలా మార్కెట్‌ చేయాలా? అని ఆలోచించారు. అందుకోసం ఒక సంస్థ ఉండాలని నిర్ణయానికి వచ్చి తన కాలేజీ స్నేహితుడితో కలిసి లింక్స్ పేరుతో సంస్థను స్థాపించాడు. కానీ కొద్దిరోజులకే ఆ మిత్రుడు వదిలేసి వెళ్లిపోయాడు. అయినప్పటికీ తన స్టార్టప్‌ను నిలబెట్టేందుకు సబూ మొక్కవోని ధైర్యంతో ఒంటరి ప్రయాణం చేస్తున్నారు.

image


రెండు వేరియంట్లలో..

లింక్స్‌లో రెండురకాల ఉత్పత్తులున్నాయి. ఒకటి బీ2సీ (బిజినెస్ టు కస్టమర్స్), రెండోది బీ2బీ (బిజినెస్ టు బిజినెస్). బీ2సీలో ఒన్‌కార్డ్, క్లౌడ్‌బుక్, ఏఎంఎల్‌లాస్ట్ ట్యాగ్ అనే మూడురకాల ఉత్పత్తులున్నాయి. అయితే లింక్స్‌కు అతి ప్రధాన ఉత్పత్తి బీ2బీ లింకప్ ట్యాగ్ మాత్రమే. లింక్స్ ఉత్పత్తులన్నీ ఎన్‌ఎఫ్‌సీ ఆధారంగా క్విక్ రెస్పాన్స్ కోడ్‌తో పనిచేసేవే. ఇందులో ఒన్‌కార్డ్ అనేది డిజిటల్ బిజినెస్ కార్డ్. గతంలో వ్యాపార విస్తరణకు పేపర్ ఆధారిత బిజినెస్ కార్డులు వాడేవారు. ఇప్పుడు వాటి స్థానాన్ని డిజిటల్ బిజినెస్ కార్డులు ఆక్రమించాయి. స్మార్ట్‌ఫోన్లలో బిజినెస్ కార్డును తయారుచేసి అవసరమైప్పుడల్లా ఎవరికైనా పంపేందుకు ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అలాంటి బిజినెస్ కార్డులను ఎలాంటి అవాంతరాలు లేకుండా బిజినెస్‌కార్డ్స్ ప్రింటింగ్, సరఫరా చేయటం ఒన్‌కార్డ్ ప్రత్యేకత. ఈ ఒన్‌కార్డులోని సమాచారం లింక్స్‌లోని పర్సనల్ ఫ్రొఫైల్ సర్వర్‌లో స్టోర్ అవుతుంది. అవసరమైనప్పుడు దాన్ని తేలికగా వాడుకోవచ్చు. అంతేకాదు, అందులో వినియోగదారుడి నివాసం, ఆఫీస్ ప్రాంతాలకు చెందిన మ్యాపులు కూడా పొందవచ్చు. అవసరమైతే సమాచారాన్ని మార్చుకోవటానికి కూడా వీలుండటం విశేషం. లింక్స్‌లోని మరో ప్రత్యేక ఉత్పాదన క్లౌడ్‌బుక్. ఇదో డిజిటల్ నోట్‌బుక్ లాంటిది. మార్కెట్లో డిజిటల్ నోట్‌బుక్ యాప్‌లు కోకొల్లలుగా ఉన్నప్పటికీ వాటితో పోల్చితే క్లౌడ్‌బుక్‌కు అనేక ప్రత్యేకతలున్నాయి. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లలో యూజర్లు తమ సమాచారాన్ని రాయటంతోపాటు దానిని ప్రత్యేకంగా స్టోర్ చేసుకోవటానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అక్కడే క్లౌడ్‌బుక్ తన ప్రత్యేకతను చాటింది. 3డీ స్టికర్ అయిన క్లౌడ్‌బుక్‌లో సమాచారాన్ని అత్యంత వేగంగా స్టోర్ చేసుకోవటమేకాకుండా తేలికగా వాడుకోవచ్చు. అందుకే ఇది అత్యంత అనుకూలమైన ఇంటరాక్షన్ అని అంటారు సబూ. లింక్స్‌లో మరో విశిష్ట ఉత్పాదన ఏఎంఎల్‌లాస్ట్ ట్యాగ్. ట్యాగ్స్‌పై యూజర్ల పేర్లు, ఇతర సమాచారాన్ని ఎందుకు ఉంచకూడదన్న సబూ ఆలోచనలోంచి ఇది పుట్టుకొచ్చింది.

image


‘ఈ ఐటమ్స్‌పై యూజర్లు తమ పేర్లను ఎందుకు ఉంచకూడదు. వ్యక్తిగత రహస్యాలు బహిర్గతమవుతాయన్న కారణంతో మొదట స్టికర్స్‌పై పేర్లు, కాంటాక్ట్ సమాచారం ఉంచేందుకు యూజర్లు ఇబ్బందిగా భావించారు. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు సమాచారాన్ని మాయంచేసేలా.. మళ్లీ అవసరమైనప్పుడు తీసుకొనేలా తేలికైన టెక్నాలజీతో దీనిని అభివృద్ధి చేశాం’ అని చెప్తారు రాఘవేద్రసబూ.

షాపింగ్‌కు కొత్త నిర్వచనం లింకప్ ట్యాగ్..

లింక్స్ సంస్థ అత్యంత ముఖ్యమైన మరో ఉత్పాదన లింకప్. బిజినెస్ టు బిజినెస్ కమ్యూనిటీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ యాప్ యూజర్స్‌కు షాపింగ్‌లో విశేషంగా ఉపయోగపతుంది. ఆన్‌లైన్ షాపింగ్ క్రమంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత సమయంలో స్టోర్‌లో షాపింగ్ తగ్గుతోంది. ఈ పరిణామం దృష్ట్యా స్టోర్‌లో షాపింగ్‌ను ఈ యాప్ సులభతరం చేస్తుంది. యూజర్ ఏదైనా వస్తువును కొనడానికి స్టోర్‌కు వెళితే ఆ వస్తువు గురించి తెల్సుకొనేందుకు సేల్స్ పర్సన్‌పై ఆధారపడాల్సిన అవసరంలేకుండా ఈ యాప్ ఉపయోగపడుతుంది. వస్తువు ప్రత్యేకతలు, ధర, దానిపై రివ్యూలను కూడా లింకప్ అందిస్తుంది.

‘స్టోర్‌లో కస్టమర్ ఏం చేసినా సరే. ఆడా.. మగా.. ఎవరైనా. వారి ఏజ్‌గ్రూప్ ఏదైనా.. వారు కొనబోయే వస్తువులకు సంబంధించిన డాటా మొత్తం వారిముందుంటుంది. అందుకే వినియోగదారుడు ముందు ముందు ఏం కొనబోతున్నాడన్నదానిపై కాకుండా అతడి లేదా ఆమె కొనుగోలు ప్రక్రియ మొత్తాన్ని ట్రాక్ చేస్తాం’ అని సబూ చెప్తారు. ‘బీ2సీలోని మూడు ఉత్పాదనలు అందుబాటులో ఉన్న మా వెబ్‌సైట్‌లోనే జూన్‌లో ఓ షాప్ ప్రారంభించాం. క్రమంగా ఆర్డర్లు పెరుగుతున్నాయి. ప్రత్యేకించి ఒన్‌కార్డుకు డిమాండ్ ఎక్కువగా ఉంది. లింకప్ ట్యాగ్స్ కోసం ప్రొప్రైటర్స్ నుంచి లెక్కకుమిక్కిలి విజ్ఞప్తులు వస్తున్నాయి. అయితే, క్లౌడ్‌బుక్ మాత్రం డిజాస్టర్‌లా మారింది’ అని సబూ తెలిపారు. 

image


‘‘మొత్తానికి ఇది చాలా ప్రోత్సాహకరంగా ఉందని చెప్పగలను. అయితే, నేను ఊహించినంతగా లేదు. ఇప్పుడిప్పుడే యూజర్లు లింక్స్ ఉత్పత్తులను వాడుతున్నారు. కొన్నిసార్లు మా సర్వీస్‌కు తక్కువ హిట్స్ రావటంతో అవమానంగా ఉంటుంది’ అని సబూ తన భావాలను స్పష్టంగా వెల్లడిస్తారు.

ఎన్నో కష్టాలకోర్చి..

తేలికపాటి టెక్నాలజీతో సబూ అద్భుత ఆవిష్కరణలైతే చేశారుకానీ వాటిని ప్రమోట్ చేయటానికి ఆయన పడిన శ్రమ అంతా ఇంతాకాదు. అందుకే స్టార్టప్‌ను సమర్ధంగా ముందుకు తీసుకుపోవటం పెద్ద సవాలు అని చెప్తారు సబూ. 2013లో లింకప్స్‌ను ఏర్పాటుచేసిన తర్వాత ఎదురైన మొదటి సమస్య బీ2బీకి ప్రాధాన్యం ఇవ్వాలా ? బీ2సీని ఎంపికచేసుకోవాలా ? అని. దీనిపై చాలాకాలం డైలమా తర్వాత చివరకు బీ2బీవైపే సబూ మొగ్గుచూపారు. ఆ విభాగంలో విజయాల శాతం అధికంగా ఉండటమే సబూ అటువైపు నడిచేలా చేసింది. ‘సింగిల్ వ్యవస్థాపకుడిగా స్టార్టప్‌ను ముందుకు తీసుకెళ్లటం కష్టమే. మేం ఎంచుకొన్న మార్గాన్ని ప్రజలు ఇప్పటికీ నమ్మటంలేదు. అయితే మరో ఏడాదిన్నరలో యాప్‌లతో యూజర్లు అలసిపోవటం ఖాయం. అప్పుడు మాదే విజయం’.. సబూ ఆత్మవిశ్వాసానికి ఈ మాటలే మచ్చుతునకలు. చూడబోతే ఆయన అంచనాలు నిజమే అనిపిస్తున్నది. ప్రస్తుతం మార్కెట్లో వేలకొద్దీ యాప్‌లున్నాయి. అందులో ఒకేరకం పనిచేసేవే ఎక్కువ. అన్ని వేలల్లో అతికొద్ది యాప్స్‌ను మాత్రమే ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు. 

image


ప్రపంచాన్ని ప్రభావితం చేసిన, చేస్తున్న టెక్నాలజీలన్నీ మొదట్లో ఆదరణకు నోచుకోని విషయాన్ని సబూ ఉదహరిస్తారు. ఆయన మాట నిజమే. అడాప్టర్ల టెక్నాలజీ వచ్చిన కొత్తలో దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. భారీ సంస్థలు రంగప్రవేశం చేసిన తర్వాతే దానికి మార్కెట్ ఏర్పడింది. అలాగే యాపిల్ ఐపాడ్ కూడా. ప్రస్తుతం విరివిగా వాడుతున్న టాబ్లెట్లు నిజానికి 90వ దశకంలోనే ప్రోటోటైప్‌లో మార్కెట్లోకి వచ్చాయి. మైక్రోసాఫ్ట సంస్థ 2001లోనే టాబ్లెట్ పీసీని ఆవిష్కరించింది. మరికొన్ని కంపెనీలు కూడా టాబ్లెట్లను మార్కెట్లోకి తెచ్చాయి. కానీ, 2010లో యాపిల్ సంస్థ రంగంలోకి దిగిన తర్వాతే టాబ్లెట్ల విప్లవం మొదలైంది. ఎంతమంచి ఆవిష్కరణకైనా కొన్నిసార్లు విలువ ఉండదు. 

‘ఈ భయం ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ భయం పోటీదారుల గురించికాదు. మార్కెట్ ఇంకా పరిణతి చెందుతున్న సమయంలో స్టార్టప్‌ను నడిపించటం గురించే భయం. పోటీదారులు లేకుండా ఉత్పత్తులను కొనేందుకు పరుగెత్తేవాళ్లెవరూ ఉండరు. వచ్చే ఆదాయమూ ఉండదు. అలా ఎదుగూబొదుగూ లేనప్పుడు వెంచర్ క్యాపిటల్స్‌ను ఆకర్షించటం కష్టతరంగా మారుతుంది.’ ఇది సబూ నిశ్చితాభిప్రాయం.