సరకు రవాణాలో సక్సెస్ సాధించిన ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్లు

చిన్ననగరాలకు ఇండోర్ సంస్థ సరికొత్త చిట్కాసరుకు రవాణాలో ఓలా లాంటి పరిష్కారంమాల్‌గాడీ సేవలకు జనం నుంచి మంచి స్పందనదేశ వ్యాప్తంగా విస్తరించడానికే ప్రణాళికలు

సరకు రవాణాలో సక్సెస్ సాధించిన ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్లు

Wednesday May 20, 2015,

4 min Read

రవాణా రంగం మార్కెట్లో సీదాసాదాగా ఉండటాన్ని మించిన సున్నితాంశం మరొకటి ఉండదు. దానికి తోడు వినియోగదారుడి అనుభూతి, సామాజిక ప్రభావం కూదా బాగా పనిచేస్తాయి. అప్పుడే నిలదొక్కుకోగల స్టార్టప్ మోడల్ తయారవుతుంది. కచ్చితమైన ప్రణాళికతో ఇండోర్‌లో ఐదుగురు కలిసి ప్రారంభించిన ఒక స్టార్టప్ కేవలం ఐదు నెలల్లోనే ఎదిగింది.

సరకుల లోడ్ తీసుకెళ్ళే వాహనాలను అందించే వెబ్ సైట్ మాల్‌గాడీ డాట్ నెట్(maalgaadi.net ) చూడండి. సాధారణంగా రవాణా వాహనమనగానే చాలా సేపు ఎదురుచూడాలి, డ్రైవర్లు ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారు, రవాణాలో సరకులు పోతాయి. కానీ ఇలాంటి సహజమైన సమస్యలేవీ లేకుండా మీరు కోరుకున్న చోటుకు సరకు రవాణా చేయటానికి వాహనం మీ గడప దగ్గరికే వస్తుంది. ఇతర స్టార్టప్ మాటల్లో చెప్పాలంటే లోడింగ్, అన్ లోడింగ్, రవాణాలకు ఇది ఓలా లాంటిది.

మాల్గాడి వ్యవస్థాపకులు, సిబ్బందితో డ్రైవర్ల బృందం

మాల్గాడి వ్యవస్థాపకులు, సిబ్బందితో డ్రైవర్ల బృందం


ఇప్పటిదాకా మాల్‌గాడీ సంస్థ తన 18 వాహనాలతో ఇండోర్‌లో వెయ్యికి పైగా ట్రిప్పులు విజయవంతంగా పూర్తిచేసింది. ఈ ఆగస్టులోగా వాహనాల సంఖ్య 100 దాటాలన్న భారీ లక్ష్యాన్ని సంస్థ తన ముందుంచుకుంది. దాదాపు 20 వేల రవాణా వాహనాలున్న నగరంలో మార్కెట్ రేటు కంటే వీళ్ళు 20 శాతం తక్కువ వసూలు చేస్తారు. అందుకే 95 శాతం కస్టమర్లు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. భారతదేశంలో సరకు రవణా వ్యవస్థ విలువ 200 కోట్ల డాలర్లు ఉండటాన్ని బట్టి చూస్తే వాళ్ళ ఆశ ఎంతమాత్రమూ అత్యాశ కాదని అర్థమవుతుంది.

ఉద్యోగంలో విసుగు ఫలితమే స్టార్టప్ ఆలోచన

మాల్‌గాడీ వ్యవస్థాపకులు అనిరుధ్ గార్గ్, సౌరభ్ రాజ్ ఇద్దరూ చార్టర్డ్ అకౌంటెంట్లు. కాలేజీ రోజులనుంచీ స్నేహితులు. ఏడాదిలోనే వాళ్ళ ఉద్యోగాలు బోర్ అనిపించాయి. సౌరభ్ ఐబిఎం లో శాప్ కన్సల్టెంట్ గా పనిచేశాక కుటుంబ వ్యాపారంలో అడుగుపెట్టాడు. అనిరుధ్ ఐసిఐసిఐ బ్యాంకులో క్రెడిట్ మేనేజర్ గా పనిచేశాడు.

సౌరభ రాజ్ ( ఎడమ ), అనిరుధ్ గార్గ్

సౌరభ రాజ్ ( ఎడమ ), అనిరుధ్ గార్గ్


“మా నాన్న నడిపే వైద్య పరికరాల సరఫరా వ్యాపారంలో చేరి కాస్త వ్యాపార అనుభవం సంపాదించాలనుకున్నా. తరచూ ట్రక్కు డ్రైవర్లతో మా నాన్న చికాకు పడటం చూశా. అది ఏ మాత్రమూ వ్యవస్థీకృతమైన మార్కెట్ కాదని నాకర్థమైపోయింది. ధరల్లో చాలా తేడా ఉండేది. డ్రైవర్ల ఇష్టారాజ్యానికి జనం తలొగ్గాల్సిన పరిస్థితి ఉండేది. అంతా మన అదృష్టం కొద్దీ ఉంటుంది” అంటాడు చండీగఢ్ కి చెందిన సౌరభ్. 

వీళ్ళిద్దరూ దాచుకున్న సొంత డబ్బుతో మాల్గాడి పని మొదలు పెట్టటానికి ముందు నెలరోజులపాటు గుర్గావ్ లో గడిపారు. సన్వేర్ రోడ్ ప్రాంతంలోని ఎఫ్ సెక్టార్ లో ఒక్కో డ్రైవర్‌నూ కలుసుకోవటం లాంటి పనులన్నీ వాళ్ళ ఏర్పాట్లలో భాగమయ్యాయి.ఆ తరువాత కరపత్రాలతో ఇంటింటికీ వెళ్ళే పని మొదలయింది. ఫ్యాక్టరీ యజమానుల దగ్గరికెళ్ళి వాళ్ళకు ఇదెలా ఉపయోగంగా ఉంటుందో వివరించారు. మొత్తానికి 2015 జనవరి 19 న వాళ్ళ మొదటి సరకు రవాణా వాహనం కదిలింది.

“ మొదలైన రెండు రోజులకే తొలి వైఫల్యం చవిచూడటం ఎలా ఉంటుందో ఊహించండి ! డ్రైవర్ల సంఘాలనుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. కొంతమంది స్థానిక గూండాలు, రాజకీయ నాయకులు కూడా వాళ్లకు అండగా నిలబడ్డారు. మా కార్యకలాపాలు రెండు రోజులపాటు ఆపేయాల్సి వచ్చింది.” అని చెప్పారు అనిరుధ్. కానీ, ఈ వైఫల్యం కూడా వాళ్లకో గుణపాఠం అయింది. అప్పటినుంచి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది. డ్రైవర్లకు హామీలు ఇస్తూ వాళ్ళ నాయకులకు నచ్చజెబుతూ, తెలిసినవాళ్లతో చెప్పిస్తూ రాజకీయ శక్తులతోనూ వ్యవహారం నడపాల్సి వచ్చింది.

ఉబర్‌కు చట్టాన్ని ఉల్లంఘించిన చరిత్ర ఎలా ఉండేదో వార్తా కథనాలు అనేకం చదివాం. దానికి పూర్తి భిన్నమైన ఉదాహరణగా నిలవాలనుకున్నాం. అందుకే, మేం మాతో కలిసి పనిచేయాలనుకున్న డ్రైవర్లందరూ తమ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పాం. మా దగ్గరకు రావటానికి పది రోజులముందే పోలీస్ తనిఖీ కూడా పూర్తి చేసుకోవాలని స్పష్టంగా చెప్పాం “ అన్నారు సౌరభ్. ఆ తరువాత దశ లోడింగ్ మొదలుకొని రవాణా వరకూ మొత్తం ప్రక్రియను డాక్యుమెంట్ చేయటం. మొదట్లో అన్ని వివరాలనూ ఎక్సెల్ షీట్ లో నమోదు చేసేవారు. ఆ తరువాత ఒక హిందీ మొబైల్ యాప్ సిద్ధం చేసుకున్నారు. అది నింపటం డ్రైవర్లకు కూడా చాలా సులువుగా ఉండేది. దాని ఫలితంగా ఎడతెరపి లేని వ్యాపార నమూనా తయారైంది.

వినియోగదారుడు వెబ్ సైట్ లో ఆర్డర్ పెట్టిన మరుక్షణమే దగ్గర్లో ఉన్న డ్రైవర్‌కు సమాచారం అందుతుంది. డ్రైవర్ కేటాయింపు విషయం వినియోగదారుడి ఫోన్‌కి మెసేజ్ వెళుతుంది. రానూ పోనూ దూరాన్నీ, ధరనూ వెబ్ సైట్ లెక్కగడుతుంది. డ్రైవర్‌కు చెల్లించటం పికప్ దగ్గరా, లేదా డెలివరీ దగ్గరా అనేది కస్టమర్ ఎంచుకోవచ్చు. డ్రైవర్ ప్రవర్తననూ, డెలివరీ ఇవ్వటానికి పట్టిన సమయాన్నీ, ఎంచుకున్న మార్గాన్నీ, దారి మళ్ళింపులూ, ఆలస్యాలూ, చివరికి బాటరీ సామర్థ్యం తగ్గితే ఆ విషయాన్ని సైతం మాల్‌గాడీ బృందం నమోదుచేస్తుంది .

అందువలన చాలావేగంగా ఇందులో పెట్టుబడి పెట్టేవాళ్ళు దొరకటంలో ఆశ్చర్యమేమీలేదు. ఇండోర్ కి చెందిన సుప్రసిద్ధ సంస్థ మోయిరా గ్రూప్ అది. అంతకు ముందు కొంతకాలం అనిరుధ్ అక్కడ పనిచేశాడు. ఆ స్టార్టప్ మొదలైన రోజునుంచీ ముగ్గురు ఇన్వెస్టర్లు వొమల్ తోడి, పవన్ సింఘానియా, అవినాశ్ తోడి దీనిమీద ఆసక్తి కనబరుస్తూనే వచ్చారు.

మరి వీళ్ళపోటీదారులెవరు ?

“ చాలా కొద్దిమందే ఉన్నారు. ముంబయ్ లో పోర్టర్, బెంగళూరులో బ్లోహార్న్ అండ్ షిప్పర్, హాంకాంగ్ లో గోగోవాన్స్ ఉన్నాయి. కానీ ఆ మార్కెట్లనీ అలాంటి సర్వీసుకు సిద్ధంగా ఉన్నవే. కానీ మా లక్ష్యమంతా ఇందుకు సిద్ధంగాలేని చిన్న నగరాలూ, పట్టణాలలో వ్యవస్థీకృతం కాని మార్కెట్లను వాడుకోవటమే. అయితే, కచ్చితంగా ఇది మాకొక సవాలు లాంటిదే. కానీ మా కార్యకలాపాల మీద మాకు నమ్మకముంది. మా ప్రక్రియ మొత్తాన్ని చట్టబద్ధం చేయటం, మా డ్రైవర్ల ఆత్మవిశ్వాసం దానికి తోడయ్యాయి” అని చెబుతారు సౌరభ్

డ్రైవర్ల యాప్ – సామాజిక ప్రభావం

ప్రతి మాల్‌గాడీ డ్రైవర్‌కూ కంపెనీ యూనిఫామ్ ఉంటుంది... కంపెనీ లోగోతో ఉండే టీ షర్ట్. హిందీలో డ్రైవర్ల యాప్ వేసి ఉన్న ఒక స్మార్ట్ ఫోన్ కూడా ఇచ్చారు. ప్రవర్తనా పరంగా క్లయింట్‌ను గౌరవంగా సంబోధించటం లాంటివి చేయాల్సిన పనుల జాబితాలో ఉంటాయి. అదే సమయంలో ఆల్కహాల్ సేవించటం, పొగాలు నమలటం, తిట్లు లాంటివి పూర్తిగా నిషిద్ధం. వ్యాపారం మందగించిందనో సీజన్ సరిగా లేదనో ఆదాయం తగ్గుతుందన్న భయం లేకుండా డ్రైవర్లకు క్రమం తప్పకుండా నెలవారీ జీతం ఏడాది పొడవునా అందుతుంది.

డ్రైవర్ పేమెంట్ లోడ్ చేసే విధానం

డ్రైవర్ పేమెంట్ లోడ్ చేసే విధానం


''డ్రైవర్ల సమావేశాలు చాలా బాగా సాగుతాయి. దుష్ప్రవర్తన, డెలివరీలో ఆలస్యం లాంటి తప్పిదాలకు గాని కొంతమంది మీద జరిమానా విధించినా, ఆ మొత్తాన్ని సంస్థ తీసుకోకుండా ఆ నెలలో ఉత్తమ ప్రతిభ కనబరచినవారికి ప్రోత్సాహక బహుమతిగా ఇవ్వటం కంపెనీ ఆనవాయితీగా తయారైంది. టెక్నాలజీ ఒక రక్షకుడిగా తయారైంది. ఇప్పుడు డ్రైవర్లు ట్రాఫిక్ పోలీసులకు ఎలాంటి మామూళ్ళూ ఇవ్వాల్సిన పనిలేదు. ఎందుకంటే అన్ని పత్రాలూ సక్రమంగా ఉంటాయి కాబట్టి'' అంటారు అనిరుధ్.

మాల్‌గాడీ కేవలం ఇద్దరు వ్యవస్థాపకులు, ముగ్గురు సిబ్బంది, 18 మంది డ్రైవర్లతోనే సాధ్యమైంది. “మీరెందుకు సాధించలేకపోయారో మీకు మీరే పదే పదే చెప్పుకునే చెత్తకథ ఒక్కటే మీకూ, మీ లక్ష్యానికి మధ్య అడ్డుగోడలా ఉంటుంది “ అన్న జోర్డాన్ బెల్ఫోర్ట్ మాటలు వీళ్లకి ఆదర్శం.

వెబ్ సైట్ : www.maalgaadi.net