స్టార్టప్ కంపెనీల అద్దె సమస్యలను తీరుస్తున్న సంస్థలు

స్టార్టప్ కంపెనీల అద్దె సమస్యలను తీరుస్తున్న సంస్థలు

Friday April 22, 2016,

4 min Read


ఏదైనా సంస్థను ప్రారంభించాలంటే ఎన్నో బాలారిష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనది ఆఫీస్‌ను ఏర్పాటు చేయడం. జనాభా పెరిగిపోతున్న ఈ తరుణంలో పెద్ద పెద్ద నగరాల్లో భవనాలు అద్దెకు తీసుకోవడమంటే మాటలకు కాదు.. వేలకు వేలు కాదు కాదు లక్షలు చెల్లించాల్సి వస్తోంది. అందునా, నగరంలోని కీలక ప్రాంతాల్లో అద్దెలంటే ఇక అంతే సంగతులు. ప్రారంభించకముందే సంస్థలను మూసుకోవాల్సి వస్తుంది. అయితే పెద్ద మొత్తంలో అద్దెలను చెల్లించలేని వారి కోసం ఇప్పుడు కో వర్కింగ్ స్పేస్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. సంస్థ ఏర్పాటు గురించి చర్చించేందుకు కావొచ్చు, లేదంటే ఇద్దరు ముగ్గురు ఉద్యోగులతో సంస్థ అభివృద్ధి గురించి చర్చించేందుకు కావొచ్చు.. ప్లగ్ అండ్ ప్లే విధానంలో అత్యంత లేటెస్ట్ టెక్నాలజీని కో వర్కింగ్ స్సేస్‌లు అందిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో, మంచి కో వర్కింగ్ స్పేస్‌ను, టాలెంట్‌ను పొందే అవకాశాలిప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. దేశంలో అందుబాటులో ఉన్న కో వర్కింగ్ స్పేస్‌లు కొత్తతరం అంకుర సంస్థ వ్యవస్థాపకుల కోసం..

image


ఇతరులతో పోలిస్తే కో వర్కింగ్ స్పేస్‌లో పనిచేస్తున్న స్టార్టప్స్ నాలుగు రెట్లు ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయని పరిశోధకులు అంటున్నారు. కో వర్కింగ్స్ స్పేస్‌లలో ఒకేరకమైన ఆలోచన కలిగిన వారు చాలామంది ఉంటారు. ఇలాంటి వారితో కలిసి పనిచేయడం సంస్థ అభివృద్ధికి ఎంతో ఉపయోగకరం.

దేశంలో స్టార్టప్స్‌కు కో వర్కింగ్ ప్లేసెస్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయో యువర్‌స్టోరీ జాబితా అందిస్తోంది. సమయాన్ని, డబ్బును ఆదా చేసుకునేందుకు, ఉద్యోగుల కొరతను తీర్చుకునేందుకు, స్పేస్ ప్రాబ్లమ్స్‌కు ఈ కో వర్కింగ్ ప్లేసెస్ మంచి పరిష్కారం.

ఔఫిస్ స్పేస్ సొల్యూషన్స్..

ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో కో వర్కింగ్ స్పేస్‌ను అందిస్తోంది ఔఫిస్ స్పేస్ సొల్యూషన్స్. అమిత్ రమణి ప్రారంభించిన ఈ సంస్థ, స్టార్టప్స్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ప్లగ్ అండ్ ప్లే ఆఫీస్ సౌకర్యాన్ని అందిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని రకాల లేటెస్ట్ టెక్నాలజీలు కూడా ఈ ఔఫీస్ స్పేస్ సొల్యూషన్స్‌లో అందుబాటులో ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సెగ్మెంట్‌లో ఉబర్ మాదిరిగా టైమ్ బేసిస్‌ కోసం సేవలు అందించాలన్నదే అమిత్ లక్ష్యం. ఇందుకోసం ఓ మొబైల్ అప్లికేషన్‌ను కూడా రూపొందించారు. అందులోకి ఎంటర్ అయి స్పేస్‌ను బుక్ చేసుకుంటే సరిపోతోంది. అలాగే రియల్ టైం ప్రతిపాదికన హోటల్స్‌లో రూమ్స్ బుక్ చేసుకునే సౌకర్యాన్ని కూడా ఔఫిస్ స్పేస్ సొల్యూషన్స్ అందిస్తోంది.

స్ట్రింగ్ మైండ్స్..

ఢిల్లీ (ఎన్‌సీఆర్) ప్రాంతంలో 2013లో ప్రణవ్ భాటియా స్ట్రింగ్ మైండ్స్ పేరుతో కో వర్కింగ్ స్పేస్ కం ఇంక్యూబేటర్‌ను ప్రారంభించారు. ఇంక్యూబేషన్/ఫండింగ్ మోడల్‌ను ప్రస్తుతానికైతే లాంచ్ చేయకపోయినప్పటికీ, కేస్ బై కేస్ ఆధారంగా ఈక్వీటీ మార్పిడి సర్వీసులను అందిస్తోంది. భారతీయ కంపెనీలకు అంతర్జాతీయంగా కూడా మద్దతు ఇచ్చేందుకు కాలిఫోర్నియాలోని బే ఏరియాలో కూడా స్ట్రింగ్ మైండ్స్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది.

91 స్ప్రింగ్ బోర్డ్..

వర్కింగ్ స్పేస్ ఎక్కడ అవసరముందో అక్కడ స్పేస్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది 91 స్ప్రింగ్‌బోర్డ్. ప్రస్తుతానికైతే ఢిల్లీ, బెంగళూరు, ముంబై, గుర్గావ్, హైదరాబాద్, నోయిడా, నవీ ముంబైలలో స్టార్టప్స్‌కు సేవలందిస్తోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా సేవలందించాలనుకుంటోంది. ఆరంభ స్టేజీలో ఉన్న అంకుర పరిశ్రమలకు ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలను కల్పిస్తున్న ఈ సంస్థను వరుణ్ చావ్లా, ప్రణయ్ గుప్తా, ఆనంద్ వేమూరి ప్రారంభించారు. అప్పుడప్పుడే ప్రారంభమవుతున్న సంస్థలకు మాత్రమే ఈ సంస్థ స్పేస్‌ను అద్దెకిస్తోంది. సంస్థ పురుడుపోసుకుంటున్న సమయంలో ఆ స్టార్టప్‌లో ముగ్గురు లేదా ఐదుగురు మాత్రమే ఉంటారు. అలాగే ఫ్రీలాన్సర్లు, డిజైన్, పీఆర్, డిజిటల్ మార్కెటింగ్, డెవలప్‌మెంట్, అకౌంటింగ్, హెచ్‌ఆర్, లీగల్, అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ అందజేసే సంస్థలకు కూడా స్పేస్‌ను అద్దెకిస్తోంది. ఈ సంస్థ పూర్తిగా రెంటల్ బేసిస్‌పైనే నడుస్తోంది. ఎలాంటి ఈక్విటీని సంస్థల నుంచి స్వీకరించడంలేదు.

image


ఆల్ట్ ఎఫ్ కో వర్కింగ్..

ఢిల్లీ, గుర్గావ్ నగరాల్లో రెండు కాస్ట్ ఎఫెక్టివ్ స్పేసెస్, రెండు ప్రీమియం స్పేసెస్‌ను నిర్వహిస్తోంది ఈ సంస్థ. సార్థక్ ఛబ్రా, యోగేశ్ అరోరా స్టార్టప్స్, ఫ్రీలాన్సర్లకు తక్కువ ధరకే స్పేస్‌ను అందిస్తున్నారు. డెయిలీ, వీక్లీ, మంత్లీ వారీగా చెల్లింపులు చేసేవిధంగా స్పేస్‌ను అద్దెకిస్తోంది. వర్క్ స్పేస్‌ను షేర్ చేసుకునేలా ప్రజలను ఈ సంస్థ మోటివేట్ చేస్తోంది. అలాగే అన్ని వనరులను ఉపయోగించుకుని సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని సూచిస్తోంది.

ది మెష్..

దీప్తి కస్బేకర్ 2014లో ది మెష్ సంస్థను ప్రారంభించారు. పుణెలో తమదే తొలి కో వర్కింగ్ స్పేస్ సెంటర్ అని ది మెష్ చెబుతోంది. పేపర్ డెస్క్ మోడల్‌లో స్పేస్‌ను షేర్ చేస్తోంది. డెస్క్‌లను ఉపయోగించుకున్నదాన్ని బట్టి సంస్థలు నిర్ణీత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రాత్రిళ్లు పనిచేసే టెక్ ఆంట్రప్రెన్యూర్ల కోసం మూన్‌లైట్ ప్యాకేజీని కూడా ఆఫర్ చేస్తోంది.

కో.ల్యాబ్. ఒరేట్

వినడానికి విచిత్రంగా ఉన్నఈ సంస్థను అనురాగ్ పారేపల్లీ, వినయ్ పెద్దింటి, రఘువీర్ కొవ్వూరు ప్రారంభించారు. కొ.ల్యాబ్.ఒరేట్ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా స్పేస్‌ సొల్యూషన్స్‌ను అందిస్తోంది. వివిధ రంగాలకు చెందిన వ్యక్తులతో మాట్లాడటం, వారితో కలసి పనిచేయడం సంస్థ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని ఈ సంస్థ అంటోంది. ఈ ముగ్గురూ కలిసి ఆరంభంలో ఓ స్టార్టప్‌ను రూపొందించాలనుకున్నారు. ఆ సమయంలో వీరికి స్పేస్‌ను షేర్ చేసే సంస్థలేవీ దొరకలేదు. అయితే పెద్ద పెద్ద కార్యాలయాలు కానీ, ఎగ్జిక్యూటివ్ స్పేస్‌లు మాత్రమే లభ్యమయ్యేవి. దీంతో కో వర్కింగ్ స్పేస్‌లను అందిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలతో కో.ల్యాబ్. ఒరేట్‌ను ప్రారంభించారు.

image


స్నీడ్..

స్నీడ్ అంటే అవసరానికి ఉపయోగపడే ప్రదేశం అని అర్థం. బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న ఈ సంస్థ దేశవ్యాప్తంగా వంద ప్రాంతాల్లో కో వర్కింగ్ స్పేస్‌లను అందిస్తోంది. అమిత్ ప్రభు, అంకిత్ ఈ సంస్థను ప్రారంభించారు. డెస్క్, ప్రైవేట్ ఆఫీసెస్, మీటింగ్ రూమ్స్, ట్రైనింగ్ రూమ్స్ వంటి సౌకర్యాలను పొందొచ్చు. ప్రాంతం, టైం పారామీటర్లుగా కూడా స్పేస్‌ను ముందే బుక్ చేసుకోవచ్చు. గంటల ప్రాతిపాదికన, ఎంత తక్కువైతే అంత తక్కువ సమయానికి కూడా స్పేస్‌ను అద్దెకు తీసుకోవచ్చు.

బ్రీతింగ్ రూమ్..

జాకీ చో, కుషాల్ సంఘ్వీ 2014 నవంబర్‌లో బ్రీతింగ్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఐఓఎస్, యాండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్ల ద్వారా వివిధ నగరాల్లో స్పేస్‌ను అవర్లీ బేసిస్‌లో పొందొచ్చు. అద్దెలను ముందే చూసుకోవడం, స్పేస్‌లకు చెందిన ఫొటోలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఎక్స్‌క్లూజివ్ ఆఫర్స్ వంటివాటిని యాప్‌లలో అందుబాటులో ఉంచారు. దేశంలో ఎక్కడైనా మూడు నుంచి 30 రోజుల ముందుగా స్పేస్‌ను బుక్ చేసుకోవచ్చు. ఆంట్రప్రెన్యూర్లు నిత్యం ఎదుర్కొంటున్న అవర్లీ వర్క్ స్పేస్ సమస్యలకు కూడా ఈ సంస్థ పరిష్కారం అందిస్తోంది. ఆతిథ్యం ఎవరిస్తున్నారో సప్లయర్స్ తెలుసుకునేందుకు ఈ యాప్‌లో కేవలం ఫేస్‌బుక్ లేదా లింక్డిన్ ఐడీల ద్వారా మాత్రమే లాగిన్ కావాల్సి ఉంటుంది.

మై క్యూట్ ఆఫీస్..

అభిషేక్ బరారి, రాహుల్ షెల్కే, నీలే జైన్ 2015 జనవరిలో మై క్యూట్ ఆఫీస్‌ను ప్రారంభించారు. ముంబై కేంద్రంగా 17 నగరాల్లో వర్క్ డెస్క్స్, ఆఫీసెస్, స్టూడియోస్, మీటింగ్ ఫెసిలిటీస్‌ను అందజేస్తోందీ సంస్థ. చిన్న చిన్న వ్యాపార సంస్థలకు ఆఫీస్ సెటప్, రెంటల్ కాస్ట్‌లను తగ్గిస్తోంది. గంటలు, రోజులు, నెలలవారీగా కూడా స్పేస్‌లను రెంట్‌కిస్తోంది. గత మే నెలలో ఈ సంస్థ ఓ ప్రముఖ ఏంజెల్ ఇన్వెస్టర్ నుంచి పెట్టుబడులు స్వీకరించింది.

యువర్‌స్టోరీ రీసెర్చ్ ప్రకారం దేశంలో 20 వేల స్టార్టప్ కంపెనీలు స్పేస్ రెంట్‌ రంగంలో ఉన్నాయి. ఇంకా వస్తున్నాయి కూడా. బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, చెన్నై, హైదరాబాద్‌ వంటి ఐదు నగరాల్లోనే 16,480 స్పేస్ రెంట్ స్టార్టప్స్ ఉన్నాయి. వర్కింగ్ స్పేస్ కోసం పెద్ద ఎత్తున్న డిమాండ్ నేపథ్యంలో, మార్కెట్‌ను అందిపుచ్చుకోవాలన్న ఆలోచనతో ఈ సంస్థలు షేర్డ్ ఎకానమీ ఐడియాను అందిస్తున్నాయి. అప్పుడప్పుడే ఆరంభమవుతున్న స్టార్టప్ సంస్థలకు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకునేందుకు తక్కువ మొత్తానికి అద్దె సౌకర్యాలను కల్పించడం ఇరు వర్గాలకు విన్ విన్ సొల్యూషనే. ఇలాంటి సంస్థలు మరిన్ని ఏర్పాటైతేనే అంకుర పరిశ్రమ మరింత రాణిస్తుంది.