ఆయుర్వేద సంచలనం ఆయుశక్తి

MNC స్థాయికి ఆయుర్వేదండాక్టర్ స్మిత నరమ్ ప్రయత్నంఆయుశక్తి ఆయుర్వేద ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సేవలుయూకే,నెదర్లాండ్, ఇటలీ సహా పలుదేశాల్లో ఎన్నో విజయాలు

ఆయుర్వేద సంచలనం ఆయుశక్తి

Wednesday July 22, 2015,

5 min Read

స్మిత నరమ్‌కి పదేళ్ల వయసులో తీవ్ర కడుపు నొప్పి వచ్చింది. ఆ బాధ ఎంత తీవ్రంగా ఉందంటే ఆమె తల్లిదండ్రులు అపెండిసైటిస్ అని అనుమానించారు. శస్త్ర చికిత్సకోసం వెంటనే హాస్పిటల్‌కి తరలించాలని అనుకుంటున్నారు. అంతలో స్మిత తండ్రి వాళ్ల సొంతూరు ఉన్న చిన్నాన్నకి ఫోన్ చేశారు. ఆయన ఆ గ్రామంలో పెద్ద పేరున్న వైద్యుడు. అతను ఆ నొప్పినివారణకు సహజసిద్ధ మూలికా వైద్య పరిష్కారం సూచించారు. అతను చెప్పినట్టే మందు తయారుచేసి స్మితకు ఇచ్చారు. అంతే అద్భుతం జరిగినట్లు నొప్పి మాయమైపోయింది. ఒకపెద్ద ఆరోగ్యసమస్య అవుతుందోనని భయపడ్డ నొప్పి కాస్త సులభంగా గృహవైద్యంతో నయమైపోయింది.ఆ ఘటనతో ఆయుర్వైద వైద్యంపై డాక్టర్ నరమ్‌కి మరింత నమ్మకం కలిగింది. 

“మా నాన్న, తాతయ్య, మామయ్యలు అందరూ ఆయుర్వేద డాక్టర్లే. చిన్నప్పటి నుంచి నేను అల్లోపతి మందులు ఎప్పుడూ వాడలేదు. ఎప్పుడైనా ఒంట్లో బాగోలేదనని అనిపిస్తే నాకు సుదర్శన్ ఘన్వతి ఇచ్చేవారు. ఇక ప్రతీ ఆదివారం ఓ చెంచా నిండా ఆముదం తాగేదాన్ని’’ అని గుర్తుచేసుకున్నారు డా. నరమ్.
డాక్టర్ స్మిత నరమ్

డాక్టర్ స్మిత నరమ్


ఇటువంటి చాలా అనుభవాలతో పాటు పురాతన శాస్త్రం దగ్గరగా ఉండడంతో ఆయుర్వేద వైద్య విద్యనభ్యసించాలని ఎంపిక చేసుకున్నారు డాక్టర్ నరమ్. ఓ వైద్యురాలిగా సేవలందిస్తూ ఉండిపోవడంతో సంతృప్తిచెందని ఆమె ఆయుశక్తి ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్ ని స్థాపించారు. సైన్స్ పై ఆమెకున్న ప్రేమ సాంప్రదాయానికి భిన్నంగా ఏదైనా చేయాలన్న ఆలోచనకు నిదర్శనమే ఈ కంపెనీ.

ఆయుర్వేదంలో రక్షించే శక్తి

ఆయుర్వేద కోర్సు చదువుతున్నప్పుడే ఆమెకు నరమ్‌తో పరిచయం అయ్యింది. పట్టా పొందిన తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కలిసి సొంతంగా ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించుకున్నారు. సబ్జెక్టుపై మంచి పట్టు వాళ్లకు షేషెంట్ల కోసం వేచి చూసే అవసరం రాకుండా సాయపడింది. కానీ డా.నరమ్ స్థానికంగా ఉన్న రోగులకు చేరువకావడంతోపాటు ఇంకా ఏదో చేయాలని తపనపడేవారు. “ఆయుర్వేదానికి వ్యాధులు నయంచేసే అపారమైన శక్తి ఉంది, అందుకే దాంతో ఏదైనా చేయాలనుకున్నా తద్వారా ఎక్కువమంది డాక్టర్లు ఆయుర్వేదంలో ఉన్న మంచిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపచేయగలరు’’ అంటారు డాక్టర్.

సంతానలేమి సమస్యలున్నవారికి కల్పతరువు

కీళ్లనొప్పులు, సంతానలేమి, సోరియాసిస్, ఫైబ్రాయిడ్స్ వంటి వ్యాధులకు ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారాలున్నాయని మీకు తెలుసా? ఈ వాదనలు ధృవీకరించడానికి నేనో ఉదాహణ చెబుతా. నెదర్లాండ్‌కి చెందిన డాక్టర్ విక్టర్ మన్హావే ఆయుశక్తికి వచ్చారు. మూడు సంవత్సరాల పాటు ఆయుశక్తి వచ్చిన వంధ్యత్వ రోగులను దగ్గరుండి పరిశీలించారు. పలు కేసులను అధ్యయనం చేశారు. వారిలో పీసీఓడీ, వీర్యకణాల సంఖ్య, కదలికలు తక్కువగా ఉన్న వ్యక్తులు, తరచూ గర్భస్రావం అవుతున్న స్త్రీలు, సాధారణ వంధ్యత్వం ఉన్నవారు ఉన్నారు. ఆ పరిశోధనల నిర్ధారణ ప్రాతిపదికన మన్హావే నెదర్లాండ్ లోని ఎరమస్ యూనివర్శిటీలో ఓ థీసిస్ సమర్పించారు. వంధ్యత్వ సమస్యకు అల్లోపతి చికిత్సలో 15 నుంచి 20శాతం సక్సెస్ రేట్ ఉంటే ఆయుశక్తి ఆయుర్వేద వైద్యవిధానంలో 42శాతం కేసులు విజయవంతం అయ్యాయని అతను నివేదించారు. అంటే అల్లోపతి కంటే డబుల్ సక్సెస్ అన్నమాట.

ఆ నివేదికే టర్నింగ్ పాయింట్ గా మారింది, దీనిగురించి తెలియడంతో పశ్చిమదేశాలకు చెందిన డాక్టర్లు ఆయుశక్తిలో భాగస్వాములవ్వాలని ఈ చికిత్స విధానం అక్కడా ప్రవేశపెట్టేందుకు ముందుకొచ్చారు. దీంతో డాక్టర్ నరమ్ తన భర్తతో కలిసి ఏఏ మందులు ఓవర్ ది కంటర్ విక్రయించవచ్చో జాబితా తయారు చేసే పని ప్రారంభించారు. 1987లో ఆయుశక్తి ఆయుర్వేద ను స్థాపించారు.

image


మహారాష్ట్రలోని పల్ఘర్‌లో మొదటగా మందుల తయారీ ప్లాంట్‌ని ప్రారంభించారు. ఆయుర్వేద ఉత్పత్తుల తయారీకి వాళ్ల దగ్గర ఒకే యంత్రం ఉంది. మందుల తయారీ వాళ్లకు సులువైన పనే అయితే యూరోపియన్ ప్రమాణాల పరీక్షలు పాస్ కావడం, సర్టిఫికెట్ పొందడం రూపంలో కంపెనీకి పెద్దసవాల్ ఎదురైంది. “మా ఉత్పత్తులు టెస్టింగ్, సర్టిఫికెట్ జారీ చేసి యూరప్‌కి పంపించేందుకు మాకో ల్యాబ్ దొరికింది. అయితే సంవత్సరం తర్వాత రొటీన్ చెకప్‌లో మా ఉత్పత్తులకు సరైన ప్రమాణాలు లేవని యూరోపియన్ ల్యాబ్ తేల్చేసింది. భారతీయ ప్రయోగశాలలకు విశ్వసనీయతలేదని నిరూపణ అయ్యింది. మా ఉత్పత్తుల స్వచ్ఛతను కూడా వాళ్లు ప్రశ్నించారు'’ అని గుర్తుచేసుకున్నారు డా.నరమ్.

ఈ సమస్యను పరిష్కరించేందుకు మొత్తం టీమ్ తీవ్రంగా కృషిచేసింది. చివరకు ఐఐటీ టెక్నాలజిస్టుల సాయంతో సమస్య తీరింది. ఈ అనుభవం నేర్పిన గుణపాఠంతో ఇకపై తమ ఉత్పత్తులన్నీ బ్యాచ్‌ల వారీగా జర్మనీకి చెందిన ల్యాబ్‌లో పరీక్షచేయించాలని నిర్ణయించారు. ‘హెవీ మెటల్ ఫ్రీ, మైక్రోబియన్, పెస్టిసైడ్ ఫ్రీ ఉత్పత్తులు తయారుచేయాలనుకున్నాం, భారతదేశ మొత్తమ్మీద హెవీ మెటల్స్‌ని పరీక్షించే AASF యంత్రమే లేదు. పెద్ద పెద్ద ఫార్మాకంపెనీల్లో పెద్ద ల్యాబ్‌లు ఉండే చోట కూడా ఇటువంటి మెషీన్ లేదు. నేను చెబుతున్నది 1993 నాటి విషయం, ప్రస్తుతం మాదగ్గరే ఆ యంత్రం ఉంది. అయితే అప్పట్లో మాకది అతిపెద్ద ఛాలెంజ్. ఒక పనిచేయాలని గట్టిగా సంకల్పిస్తే మార్గం అదే దొరుకుతుందని అప్పుడే నేను నేర్చుకున్నా’’ అని అకస్మాత్తుగా అరుస్తూ చెప్పారు డా.నరమ్

అంతర్జాతీయ సహకారం

2005 సంవత్సరం వరకు ఆయుశక్తి వ్యక్తిగత ప్రాక్టీస్ లా ఉండేది. ప్రకటనలు, పీఆర్ వంటివిలేవు. అయినప్పటికీ చాలా పేరుప్రఖ్యాతలు సంపాదించింది. 300 వందలకు పైగా రోగులు క్లినిక్‌కి వచ్చేవారు. ప్రాంఛైజీలు తెరవాలన్న నిర్ణయం ఆయుశక్తిని పరుగులు పెట్టించింది. అప్పటి నుంచి ఆయుశక్తి ఆయుర్వేద భారత్‌లో ఏడు శాఖలు జర్మనీలో మూడు శాఖలు తెరుచుకున్నాయి..

ఆయుశక్తి అంతర్జాతీయ పొత్తులు చుట్టూ ఒక ఆసక్తికరమైన కథ ఉంది, ఓ ఇటాలియన్ మహిళ విక్టోరియా రసిడోరియ ఆధ్యాత్మిక సాధనకోసం భారతదేశానికొచ్చారు. తిరిగి తనదేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా హెపటైటిస్ ఏ వ్యాధి సోకింది. ఎవరో తెలిసిన వాళ్లు చెబితే ఆమె ఆయుశక్తి క్లినిక్‌కి వచ్చారు. అక్కడ 15 రోజుల పాటు చికిత్స పొంది హ్యాపీగా తిరిగివెళ్లారు. 

“ హెపటైటిస్ ఏ శరీరంలో చాలా వేగంగా విస్తరిస్తుంది, రెండు మూడురోజుల పాటు దాని లక్షణాలేవీ మనకు కనపడవు, కానీ బైలరూబన్ అతివేగంతో పెరిగిపోతుంటుంది, ఒక్కరోజులోనే ఆమె కళ్లు పసుపు రంగులోకి మారిపోయాయి. ఆమెను అప్పుడు ఆసుపత్రిలో చేర్పించకుండా ప్రత్యేక ఆహారం, మూలికలు, ఆయుర్వేద మందులు ఇచ్చాం, మా దగ్గర ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సమయంలో రోజూ ఇటలీలో ఉన్న డాక్టర్లతోనూ ఆమె సంప్రదిస్తూ ఉండేది. ఇటలీ వెళ్లిన తర్వాత ఆ డాక్టర్లు ఆమెని చెక్ చేసి ఇంత అద్భుత ఫలితాలు ఎలా సాధ్యమయ్యాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మేం ఏదైతే 15 రోజుల్లో చేసి చూపించామో అది ఆరునెలల్లో కూడా సాధ్యం కాకపోవచ్చు అని చెప్పారు డాక్టర్ నరమ్. 

ఈ సక్సెస్ తో ఐదుగురు ఇటాలియన్ డాక్టర్లు భారత్‌కి వచ్చి ఆయుర్వేద చికిత్స నేర్చుకున్నారు. ఆవిధంగా యూరోప్ లో వారి ప్రస్థానం మొదలైంది. ఇప్పటివరకు భాగస్వాముల ద్వారానే సేవలు విస్తరిస్తున్నారు. యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కలుపుకుని ప్రపంచ వ్యాప్తంగా వంద మంది భాగస్వాములున్నారు. కంపెనీ యాజమాన్యంతో యూరప్, యూకేలో ఆయుశక్తి క్లీనిక్ లు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు డాక్టర్ నరమ్ వెల్లడించారు.

అడుగడుగునా అండగా...

తొలిరోజుల్లో తన భర్త ఇచ్చిన మద్దతు గురించి డాక్టర్ నరమ్ ఎంతసేపైనా ఆగకుండా చెబుతారు, “ నా బిజినెస్ లో సహాయం చేయడమే కాదు , పిల్లలకోసం కొన్నాళ్లు ఆగుదామన్న నా అభ్యర్ధనకు ఆయన ఒప్పుకున్నారు” అని గుర్తు చేసుకున్నారు డాక్టర్ నరమ్. అత్తింటివారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ , నమ్మకస్తులైన స్టాఫ్ అంతా నా బలానికి మూలస్తంభాలని నరమ్ అంటారు. “ మా సంస్థ సిబ్బందిలో కొంతమందైతే 25 సంవత్సరాలకు పైగానే నాతో ఉన్నారు. వాళ్లపై నాకు అపారమైన నమ్మకం, ఎంతగా అంటే వారిపైనే భారం వదిలేసి నేను విశ్రాంతి తీసుకోవచ్చు”.

అసోచామ్ అంచనాల ప్రకారం 2015లో భారతీయ మూలికా పరిశ్రమ 7500 కోట్ల నుంచి 15 వేల కోట్లకు చేరొచ్చు. ప్రాంఛైజీల విస్తరరణ, భాగస్వాముల ద్వారా ఆయుశక్తి కూడా హెర్బల్ ఇండస్ట్రీ ఎదుగుదలలో మిగతా కంపెనీల్లాగే కీలక పాత్ర పోషించనుంది. గత పదేళ్లుగా ఏటా 30% వృద్ధి రేటులో ఆయుశక్తి ముందుకెళ్తోందని డాక్టర్ నరమ్ గర్వంగా చెబుతున్నారు. 

“ప్రతీ చిన్నదానికి మాత్రలు వేసుకోవడం పరిష్కారం కాదని ప్రజలు తెలుసుకుంటున్నారు. దానికంటే సహజ ,సురక్షిత మార్గాలద్వారా నయం చేసుకోవడం ఉత్తమమనే భావనకొస్తున్నారు. మేం ఒకదాని తర్వాత ఒకటి అభివృద్ధిచేసుకుంటూ వచ్చాం. ప్రస్తుతం అన్ని వసతులు సమకూర్చుకున్నాం. ఇక భారతీయ MNC స్థాపనకు రెడీ అవుతున్నా” అని తన ఆశయాన్ని తెలిపారు డా.నరమ్.