విందు భోజనం లాంటి విక్టరీ కొట్టిన "డైనౌట్"

విందు భోజనం లాంటి విక్టరీ కొట్టిన "డైనౌట్"

Friday March 11, 2016,

3 min Read


నాలుగేళ్ల క్రితం..

ఢిల్లీలోని ఓ రెస్టరెంట్ లాంజ్...

నలుగురు యువకులు టెన్షన్ గా ఎదురుచూస్తున్నారు.

గంట దాటి పోయింది...

రెండు గంటలు దాటిపోయింది...

మూడు గంటలు దాటిపోయింది...

అప్పుడుగానీ వారి నిరీక్షణ ఫలించలేదు..

అప్పుడే రెస్టరెంట్ ఓనర్ చాంబర్ నుంచి ఓ వ్యక్తి బయటకు వచ్చాడు. ఆ నలుగురు దిగ్గున లేచి స్టిఫ్ గా నిల్చున్నారు. అతనిచ్చిన కవర్ ను అత్యంత జాగ్రత్తగా అందుకున్నారు. అపురూపంగా తడిమి చూసుకున్నారు. ప్రపంచకప్ గెల్చిన పసికూన క్రికెట్ జట్టులా గంతులేశారు. రెస్టరెంట్ లో ఉన్నవాళ్లంతా వాళ్లవైపు వింతగా చూశారు. అందరూ అపాయింట్ మెంట్ వచ్చిందేమో అనుకున్నారు. కానీ అందులో అది లేదు... అంతకు మించి ఇంకేదో ఉంది. ....అది వారికి ఎలాంటిదంటే..

విష్ణుమూర్తి చేతిలో సుదర్శనచక్రం లాంటిది...!

అర్జునుడి చేతిలో గాండీవం లాంటిది

శివుని చేతిలో త్రిశూలం లాంటిది... !

ఇంతకీ అందులో ఏముందంటే రూ. 2,000/- చెక్కు...

మీరు విన్నది నిజమే. 2వేల రూపాయలే. మరి ఆ మాత్రం దానికే అంత అవసరమా..? 2 వేలకే ఇన్ని ఉపమానాలా..? అని అనుకోవద్దు. అది వారి ప్రయత్నంలో సాధించిన తొలి సంపాదన. అది విజయం సాధించగలరని వారికి ఇచ్చిన ఆత్మవిశ్వాసం. దీన్నే స్ఫూర్తిగా తీసుకోకుండా... రూ.2 వేలేగా అని వారనుకుంటే ఇవాళ... ఏడాదికి 200 శాతం వృద్ధి నమోదు చేస్తున్న స్టార్టప్ "డైనౌట్" ఉండేది కాదేమో..!

డైనమేట్ లాంటి "డైనౌట్"

రెస్టరెంట్లలో సీట్ రిజర్వేషన్ ఫ్లాట్ ఫామ్ పై సృష్టించిన స్టార్టప్ "డైనవుట్". అంకిత్ మోహ్రోత్రా, సాహిల్ జైన్, నిఖిల్ బక్షి, వివేక్ కపూర్ అనే నలుగురు మిత్రుల కృషి ఫలితం. చాలా మందిలా పెట్టుబడేం లేకుండా కేవలం తమ పాకెట్ మనీతో లాంచ్ చేశారు. యాప్ ద్వారా సీట్లను రిజర్వ్ చేసే అవకాశం కల్పిస్తామని చాలామందిని బతిమాలారు. కొంతమంది ఆసక్తి చూపించలేదు. కొందరు మాత్రం అవకాశం కల్పించారు. అలా ఇచ్చిన వారిని ఎవరినీ వీరి స్టార్టప్ నిరాశ పరచలేదు. ఆరు నెలల కాలంలోనే ఒక్క ఢిల్లీ నగరంలోనే ఎనిమిది నుంచి పది వేల టేబుల్ రిజర్వేషన్లను సాధించారు. ఈ స్టార్టప్ సక్సెస్ ఇంతటితో ఆగదని ఫండింగ్ సంస్థలు గుర్తించాయి. ఈ లోపే టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ ఎవరూ ఊహించనంతగా దాదాపు ఆరవై కోట్ల రూపాయలకుపైగా ఆఫర్ చేసి ఈ స్టార్టప్ ను ఎక్వైర్ చేసింది. అయినా ఈ నలుగురి బాధ్యతల్లో ఏ మాత్రం మార్పు లేదు. ఈ స్టార్టప్ వ్యవహారాలన్నీ ఇప్పటికీ వీరే చూస్తున్నారు.

గత రెండేళ్లలో డైనవుట్ ఏడాదికి రెండు వందల శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. ఎనిమిది పట్టణాలకు విస్తరించింది. సీట్లు రిజర్వేషన్ చేయడానికి 2,500 రెస్టరెంట్లతో ఒప్పందాలు చేసుకున్నారు. "ఇన్ రెస్టో" అనే మరో స్టార్టప్ ను సైతం విలీనం చేసుకున్నారు. ప్లగ్ అండ్ ప్లే రెస్టరెంట్ మేనేజ్మెంట్ ఫ్లాట్ ఫామ్ ను "ఇన్ రెస్టో" అందిస్తోంది. ఈ విలీనంతో "డైనౌట్" తన సేవలను మరింత విస్తరించినట్లయింది. వినియోగదారులకు అత్యుత్తమ డైనింగ్ అనుభూతిని అందించడమే లక్ష్యమంటున్నారు నలుగురు మిత్రులు. స్టార్టప్ ప్రారంభించినప్పటికీ.. ఇప్పటికీ ఆహారపుటలవాట్లు, అభిరుచుల్లో స్పష్టమైన మార్పు వచ్చిందని వీరు అభిప్రాయ పడుతున్నారు.

"నెమ్మదిగా, స్థిరంగా ఎదగడాన్నే మేము నమ్ముతాం. సమష్ఠి కృషిపైనే దృష్టి పెడుతున్నాం. యాప్ ద్వారా అయినా, వెబ్ సైట్ ద్వారా అయినా మా సర్వీసులు వినియోగదారుడ్ని పూర్తిస్థాయిలో సంతృప్తి పరుస్తాయి. మెరుగైన రెస్టరెంట్లతో ఒప్పందాలు చేసుకోవడానికి నిరంతరంగా పెట్టుబడి పెడుతూ ఉండాలి" అంకిత్, డైనౌట్ కో ఫౌండర్
డైనవుట్ టీం <br>

డైనవుట్ టీం


హాట్ కేక్ యాప్ డైనౌట్

ఇప్పుడు రెస్టరెంట్ల నెట్ వర్క్ పెంచుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. దీని కోసం అవసరమైన డాటాను సేకరిస్తున్నారు. కస్టమర్ సెంట్రిక్ గా ఉండేలా డైనౌట్ ఎప్పటికప్పుడు మెరుగ్గా తీర్చి దిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. రీపిట్ కస్టమర్ రేట్ సంతృప్తికర స్థాయిలో ఉంది. డైనౌట్ యాప్ లో సీట్స్ రిజర్వేషన్ చేసుకోవడం వల్ల డబ్బు, సమయం ఆదా అవుతున్నాయన్న కస్టమర్ల ఫీడ్ బ్యాక్.. నలుగురు మిత్రులకు లాభాలను మించిన కిక్ ఇస్తోంది.

స్టార్టప్ ప్రారంభించిన ఆరు నెలలకే ఎక్వైర్ చేసిన టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ నేటి బిజీ జీవితంలో సగటు వ్యక్తి ప్రధానమైన సమస్యను డైనౌట్ తీరుస్తోందని అభిప్రాయపడుతోంది. ఎక్వైర్ చేసినప్పటికీ... ఈ టీంను కొనసాగించకపోవడానికి పెద్ద కారణాలేం లేవని ఈ సంస్థ అధికారులు అంటున్నారు. గత ఏడాదిన్నరగా డైనౌట్ వృద్ది ఊహించినదానికన్నా గొప్పగా ఉందని వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇన్ రెస్టో విలీనంతో డైనౌట్ మరిన్ని ఫ్లాట్ ఫామ్స్ లో విస్తరించడానికి అవకాశం ఏర్పడిందంటున్నారు.

మిత్రులు నలుగురు నాలుగు విభాగాల్లో పని విభజన చేసుకుంటున్నారు. ఇటీవలే ప్రీమియం డైనింగ్ సెక్షన్ సీట్ల రిజర్వేషన్ల కోసం డైనౌట్ ప్లస్ పేరుతో కొత్త సర్వీస్ ను అందుబాటులోకి తెచ్చారు. కస్టమర్లందరికీ అద్భుతమైన డైనింగ్ అనుభవం అందిస్తామని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. ఓ మార్కెట్ సర్వే ప్రకారం ఆన్ లైన్ ద్వారా హోటల్స్ లో సీట్ల రిజర్వేషన్ చేసుకునేవారి సంఖ్య ఏడాదికి 20 శాతానికిపైగానే పెరుగుతోంది. డైనౌట్ వచ్చిన తర్వాత సీట్ రిజర్వేషన్ ఫ్లాట్ ఫామ్ డైనమేట్ లా పేలుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.