తండ్రిని చంపిన వాళ్లను పగబట్టి.. ఐఏఎస్ అయిన కింజల్ సింగ్

తండ్రిని చంపిన వాళ్లను పగబట్టి.. ఐఏఎస్ అయిన కింజల్ సింగ్

Friday February 24, 2017,

3 min Read

కొన్ని కొన్ని జీవితాలు సినిమా కథల్లాగే ఉంటాయి. ఐఏఎస్ కింజల్ సింగ్ స్టోరీ కూడా అచ్చం సినిమా కథలాంటిదే. బయోపిక్ కి ఏమాత్రం తీసిపోని స్టోరీ. తండ్రిని చంపిన వాళ్లను కటకటాల వెనక్కి పంపాలని కంకణం కట్టుకుని, అమ్మ మీద ఒట్టేసి ఐఏఎస్ అవుతుంది. కణకణమండే అమ్మ గుండెను చిన్నప్పుడే అరచేతుల్లోని తీసుకుని 30 ఏళ్లనాటి ప్రతీకారం తీర్చుకుంటుంది. మూడు దశాబ్దాలపాటు తన తల్లి ఆవేదనను కోర్టుబోను ముందు ఆవిష్కరించి జడ్జిచేత జయహో అనిపిస్తుంది. తెగువ చూపిన మగువ మరెవరో కాదు కింజల్ సింగ్ ఐఏఎస్.

image


1982 మార్చి 12. అప్పుడు సమయం అర్ధరాత్రి దాటింది. అది ఉత్తర్ ప్రదేశ్ లోని గోండా జిల్లా మాధవ్ పూర్ అనే గ్రామం. కరడుగట్టిన ఇద్దరు నేరస్తులు ఒక ఇంట్లో తలదాచుకున్నారని పోలీసులకు తెలిసింది. డీఎస్పీ కేపీ సింగ్ తన అనుచరులతో గ్రామంలోకి ఎంటరయ్యారు. ఊరంతా నిద్రమత్తులో జోగుతోంది. పక్కా సమాచారంతో ఒక ఇంటి తలుపు తట్టారు. అనుకున్నట్టే ఇద్దరు క్రిమినల్స్ అక్కడున్నారు. హఠాత్ పరిణామంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. నిమిషాల వ్యవధిలోనే తుపాకులు పేలాయి. క్షణాల్లో ఊరంతా అల్లకల్లోలం.

కట్ చేస్తే, ఇద్దరు నేరస్తులతో పాటు 12 మంది గ్రామస్తులు చనిపోయారు. డీఎస్పీ కేపీ సింగ్ కూడా నెత్తుటి మడుగులో ఉన్నాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయాడు. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచనలం రేపిన ఈ ఎన్ కౌంటర్- తర్వాత కొద్దిరోజుల్లోనే బూటకమని తేలింది. డీఎస్పీని తోటి పోలీసులే చంపారని తేటతెల్లమైంది. ఇన్ స్పెక్టర్ సరోజ్ అవినీతిని డీఎస్పీ ప్రశ్నించాడని, తనపై అంతర్గత విచారణకు కూడా ఆదేశించాడని మనసులో కసి పెంచుకున్నాడు. ఎప్పటి నుంచో సమయం కోసం ఎదురు చూశాడు. టైం అలా కలసిరావడంతో చంపేశాడు. ఛాతీమీద గన్ బారెల్ పెట్టి మరీ పేల్చాడు.

డీఎస్పీ భార్య విభా సింగ్ ఒంటరి పోరాటానికి దిగింది. చార్జిషీట్లు, సాక్ష్యులు, వాయిదాలు.. కేసు ఇలా సాగుతోంది. ఇద్దరు చంటిపిల్లను వెంటేసుకుని కోర్టుల చుట్టూ తిరిగింది. ఆ కేసు అలా నడుస్తుండగానే ఆమెకు వారణాసి ట్రెజరరీలో డిపార్టుమెంట్ తరుపున ఉద్యోగం వచ్చింది. రోజులు గడుస్తున్నాయి. కేసులో ఒక్కోదారి మూసుకుపోతోంది. పిల్లలకు అప్పుడప్పుడే ఊహ తెలుస్తోంది. ఒకసారి కింజల్ అడిగింది నాన్నేడమ్మా అని. విభాసింగ్ కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు. కన్నీళ్లు దిగమింగుకుంది. తను ఏడిస్తే ఆడపిల్లల గుండె ఎక్కడ చెదిరిపోతుందో అని దుఖాన్ని కొంగులో మూటగట్టుకుంది. కొంతకాలం తర్వాత కింజల్ సింగ్ కి జరిగిందంతా అర్ధమైంది. జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది, అమ్మ చూస్తుండగా దోషులను కటకటాల్లోకి నెట్టాలని మనసులో ప్రతిన బూనింది. తన తండ్రిని పొట్టనపెట్టుకున్న దుర్మార్గులను కోర్టుకీడ్చి అమ్మ కన్నీళ్లకు లెక్క చెప్పాలని సంకల్పించింది.

ఐఏఎస్ కావాలి. కింజల్ సింగ్ ఆశయం అదే. తండ్రి కోరుకున్నది కూడా అదే. తన కూతురు ఐఏఎస్ కావాలని కలగన్నాడు. కానీ పరిస్థితి చూస్తే దయనీయంగా ఉంది. అయినా సరే ఎంచుకున్న లక్ష్యాన్ని వదిలిపెట్టే సవాలే లేదు. కాలేజీ చేరేనాటికి మరో చేదువార్త. అమ్మకు కేన్సర్ సోకింది. ఎంతోకాలం బతకదని అర్ధమైంది. చావు గురించి విభాకి భయం లేదు. ఎందుకంటే కూతుళ్లిద్దరూ అనుకున్న గమ్యాన్ని ఎంతకష్టమైనా చేరుకుంటారు. వాళ్లమీద ఆమెకు నమ్మకం ఉంది. అందుకే సంతోషంగా తన ప్రతీకారాన్ని వాళ్ల చేతుల్లో పెట్టి కన్నుమూసింది.

నాన్నలోని నిజాయితీ, అమ్మలోని తెగువ.. ఇద్దరు ఆడపిల్లలకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. అమ్మ చనిపోయిన కొన్నాళ్లకే డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్స్. తరువాత చెల్లి ప్రాంజల్ సింగ్ తో కలిసి కింజల్ ఢిల్లీకి షిఫ్టయింది. యూపీఎస్సీ పరీక్షలపై మనసు లగ్నం చేశారు. 2007లో ఎగ్జామ్ క్లియర్ చేశారు. కింజల్ కి 25వ ర్యాంక్ వచ్చింది. ప్రాంజల్ సింగ్ 252 ర్యాంక్ తెచ్చుకుంది.

అనుకున్నట్టుగానే కింజల్ సింగ్ ఐఏఎస్ అయింది. జీవితకాలం ప్రతీకారాన్ని తీర్చుకునే టైమొచ్చింది. రంగంలోకి దిగి 30 ఏళ్లనాటి ఫైల్ తిరగదోడింది. వాదాలు ప్రతివాదాలు సాక్ష్యులు, వాంగ్మూలం.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చకచకా జరిగిపోయాయి. దాచేస్తే దాగని సత్యం దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనించింది. 8మంది పోలీసులను సీబీఐ కోర్టు దోషులుగా తేల్చింది. మొత్తం 19 మంది మీద చార్జిషీటు దాఖలైతే, విచారణ జరిగే సమయంలో పదమంది చనిపోయారు. మరో ఏడుగురు రిటైరయ్యారు. బూటకపు ఎన్ కౌంటర్ చేసినందుకు సరోజ్ సహా ముగ్గురు పోలీసులకు మరణశిక్ష, మరో ఐదుగురికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది. కింజల్ పగ చల్లారింది. తల్లి ఆత్మ శాంతించింది. 31 ఏళ్ల న్యాయ పోరాటం ఫలించింది. కోర్టు మెట్ల మీద హర్షధ్వానాలు మిన్నంటాయి.

నాన్న తాలూకు గుర్తులేమీ లేవు. ఊహ తెలిసేనాటికి అమ్మ కన్నీళ్లు తెలిశాయి. ఆమె పోరాటమే నాకు స్ఫూర్తినిచ్చింది. ఆమె తెగువే నాకు కొండంత బలాన్నిచ్చింది. ఆమె కన్నీళ్లు నా గుండెను రాటుదేలేలా చేశాయి. న్యాయం ఎప్పటికీ ఓడిపోదని మరోసారి రుజువైంది. తండ్రిని చంపిన వాళ్లకు శిక్ష పడింది. సంతోషం.. కానీ ఇదంతా చూడ్డానికి అమ్మలేదు. అదొక్కటే జీవితంలో వెలితి అంటారామె.

తన తల్లిలాంటి కష్టం మరో తల్లికి రాకూడదే విధి నిర్వహణలో నిష్కర్షగా వుంటారు. కళ్లలో రౌద్రం.. మాటల్లో గాంభీర్యం.. నడకలో ఆవేశం.. కింజల్ సింగ్ ఐఏఎస్ అంటే దమ్మున్న ఆఫీసర్.. గట్స్ ఉన్న ఆఫీసర్..