ట్రావెల్ ఏజెంట్ మోసంతో పుట్టిన 1000 కోట్ల బిజినెస్ ఐడియా

తండ్రికి టికెట్లు బుక్ చేసే ఏజెంట్ మోసం అరికట్టడం నుంచి పుట్టిన ఐడియా..చుట్టుపక్కల వాళ్లకు టికెట్లు బుక్ చేయించడంతో వ్యాపారం మొదలు..ఇప్పుడు 275 మంది ఉద్యోగులు, 30 వేల మంది ఏజంట్ల నెట్వర్క్

ట్రావెల్ ఏజెంట్ మోసంతో పుట్టిన 1000 కోట్ల బిజినెస్ ఐడియా

Monday April 06, 2015,

4 min Read

డబ్బు విలువ.. ఓ వ్యాపారవేత్తకన్నా ఎక్కువగా ఎవరికి తెలుస్తుంది..? తెలిసిన వారు ఎంతో కొంత మొత్తం ఇస్తే గాని, సుదూర ప్రాంతాలకు ప్రయాణించలేని ఓ యువకుడు.. కోట్ల రూపాయల సామ్రాజ్యానికి సహ వ్యవస్థాపకుడు కావడం అంటే సామాన్యమా..? డబ్బు విలువ బాగా తెలుసు కాబట్టి, తన తెలివితేటలకు సానబట్టి, పొదుపు సూత్రంతో.. అత్యున్నత స్థాయికి చేరాడా యువకుడు. ఇంతకీ ఎవరా యువకుడు..? ఏంటా కథ అనే కదా మీ ప్రశ్నలు..? దానికి సమాధానమే ఈ కథనం.

దిగ్భ్రాంతి నుంచి ఆలోచన !

రికాంత్ పిట్టి.. ఈజీ మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు. పెద్దగా ప్రయాస పడకుండానే వ్యాపారవేత్త అవడం ఎలాగో రికాంత్ ప్రొఫైల్ చూస్తే ఇట్టే అర్థమై పోతుంది. రికాంత్ తండ్రి ఓ వ్యాపారి. తరచూ ప్రయాణాలు చేసేవాడు. అందుకోసం ముందుగా నిర్ణయించుకున్న తేదీల ప్రకారం, ప్రయాణ టికెట్లను ఓ ఏజెంట్ ద్వారా ముందుగానే బుక్ చేసుకునేవాడు. మనం మాట్లాడుతోంది... ఆన్ లైన్ ట్రావెల్ ఏజెన్సీలు పెద్దగా వ్యాప్తిలో లేని 2005 నాటి కథ. ఓ చిన్న సంఘటన.. రికాంత్ జీవితాన్నే మార్చేసింది. యాదృచ్ఛికంగా, తన తండ్రి ప్రయాణ టికెట్ ధరను, అతను ఆన్ లైన్ చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఏజెంట్, టికెట్ అసలు ధరకన్నా, రూ 1500 అధికంగా వసూలు చేస్తున్నట్లు రికాంత్ గుర్తించాడు. తన తండ్రి నెలకు పదిహేను టికెట్లను ఏజెంట్ ద్వారా బుక్ చేసిన ఫలితంగా.. సుమారు రూ. 20 వేలు నష్టపోతున్నట్లు తేలింది.

image


సరికొత్త యోచన

టికెట్ ఏజెంట్ మోసాన్ని జీర్ణించుకోలేక పోయిన రికాంత్... దాన్ని అరికట్టే దిశగా తీవ్రంగా ఆలోచించాడు. ఏజెంట్ పై ప్రత్యక్ష చర్య కన్నా.. అతడి మోసాన్ని అరికట్టే దిశగా ఆయన ఆలోచనలు సాగాయి. ఐఐటిలో చదువుతున్న తన పెద్దన్నయ్య సహకారంతో.. రికాంత్ సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. తొలినాళ్ళలో.. తన తల్లిదండ్రుల టికెట్లను తానే బుక్ చేయడం ప్రారంభించిన రికాంత్.. తర్వాతి రోజుల్లో తన బంధుమిత్రుల ప్రయాణ టికెట్లనూ బుక్ చేయడం మొదలు పెట్టాడు. త్వరలోనే బంధుమిత్రులు, ఇరుగు పొరుగులు, టికెట్ల ధరలపై వంద నుంచి రూ.150 సర్వీసు ఛార్జి మాత్రమే అదనంగా వసూలు చేస్తున్న రికాంత్ సేవలను గుర్తించారు. దీంతో.. రికాంత్ బిజీగా మారాడు. తన సేవల ద్వారా, సొంతంగా పాకెట్ మనీ సంపాదించడం మొదలు పెట్టాడు. టికెట్ ధరపై అదనంగా వసూలు చేస్తున్న మొత్తం గురించి తొలినాళ్ళలో రికాంత్ తన తండ్రికి తెలియకుండా జాగ్రత్తపడ్డాడు (చాలామంది వ్యాపారవేత్తలు.. తొలి నాళ్ళలో తండ్రి వద్ద ఇలాగే గోప్యతను పాటిస్తారేమో!) రికాంత్ ను ఇంజనీరింగ్ లేదా పైలెట్ కోర్సు చేయించి.. విదేశాలకు పంపాలని భావించిన ఆయన తండ్రి.. రికాంత్ లోని విభిన్నమైన ఆసక్తిని గమనించి, తన స్నేహితులకూ రికాంత్ సేవల గురించి సిఫారసు చేయడం ప్రారంభించారు.

సంస్థకు శ్రీకారం

తండ్రి అండదండలతో.. తనకంటూ ఓ సంపాదన మార్గాన్ని ఎంచుకున్న రికాంత్.. గ్రాడ్యుయేషన్ కోర్సు చేసేందుకు కురుక్షేత్ర యూనివర్శిటీని ఎంచుకున్నాడు. మిగిలిన వర్శిటీల్లో మాదిరిగా అక్కడ అటెండెన్స్ సమస్య ఉండదని తెలుసుకున్నాడు. అక్కడ చదువుతున్నప్పుడే.. తన సోదరుడు (ఈజ్ మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు) నిషాంత్ సహకారంతో డ్యూక్ ట్రావెల్స్ పేరిట సంస్థను ప్రారంభించాడు. తన సేవల గురించి గ్రూప్ ఎస్ఎంఎస్ ల ద్వారా ప్రచారం చేశాడు. ఈ ప్రయత్నం సత్ఫలితాలనే ఇచ్చింది. ఎస్ఎంఎస్ లు పంపిన ప్రతిసారీ, కనీసం పాతిక మంది వరకూ.. అతడి సేవలు, ఛార్జీల గురించి వాకబు చేసేవారు. నెమ్మదిగా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా కస్టమర్లు డ్యూక్ సేవలను ఉపయోగించుకోవడం మొదలు పెట్టారు. ఈ సోదరద్వయం.. ఈ-బే ద్వారా టికెట్లను విక్రయించడమూ మొదలు పెట్టింది. (ఇది చట్టరీత్యా సమంజసమో కాదో తెలీదు కానీ, మార్కెటింగ్ లో కచ్చితంగా ఓ పాఠమనే చెప్పాలి)

రికాంత్, ఈజ్ మై ట్రిప్ ఫౌండర్

రికాంత్, ఈజ్ మై ట్రిప్ ఫౌండర్


ఈజ్ మై ట్రిప్

ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో.. ఎదిగే క్రమంలో.. డ్యూక్ ట్రావెల్స్ ను.. ఈజ్ మై ట్రిప్ గా నామాంతరం చేశారీ సోదరులు. తమ బలం గురించి రికాంత్ మాట్లాడుతూ.. తక్కువ ధర, ప్రాసెసింగ్ ఫీ వసూలు చేయక పోవడమే మా బలం.. విజయ రహస్యం అని వివరించారు. ( రేపు, బాగా డబ్బున్న సంస్థలు.. ఈ రంగంలోకి వచ్చి మరింత చౌక ధరలకే టికెట్లను ఇస్తామన్నా ఆశ్చర్యం లేదు)

సవాళ్ళు

రికాంత్ కు రోజులు అందంగా గడుస్తున్నాయి. అతడి ప్రయత్నానికి తండ్రి సహకారమూ తోడైంది. దీంతో సోదరులిద్దరూ సంస్థను విస్తరించాలని నిర్ణయించుకున్నారు. ఎయిర్ డెక్కన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని.. కమిషన్ పద్ధతిలో వారి నుంచి ఏజెన్సీని తీసున్నారు. ట్రావెల్ ఏజెంట్లతో సంబంధాలు మెరుగుపరుచుకుంటూ.. టికెట్ల విక్రయాలను ప్రారంభించారు. అయితే రికాంత్ సోదరులను దురదృష్టం వెన్నాడింది. అప్పట్లో రూ 500 నుంచి రూ 700 మధ్య ధరలకే ఎయిర్ టికెట్లను విక్రయించిన ఎయిర్ డెక్కన్ సంస్థ.. పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. చౌక ధరల టికెట్లు లేకుండా.. మరి ఏ ఇతర టికెట్లనూ విక్రయించలేని దుస్థితి ఎదురైంది. దాంతో.. వాళ్ళు.. చౌక ధరల టికెట్ల విక్రయాలను నిలిపేశారు. సంస్థ ఏ క్షణాన్నైనా మూత పడే పరిస్థితికి చేరింది. దీంతో వాళ్ళు.. ఏజెంట్లకు ఇచ్చే కమిషన్ ను బాగా తగ్గించేశారు. లక్ష్యాలను సాధించడం ద్వారా, ఎవరు సహకరిస్తారో వారి ద్వారానే టికెట్ల విక్రయాలు సాగించాలని ఆ సంస్థ నిర్ణయించింది.

భవిష్యత్తులోకి ...

ప్రస్తుతం.. వీరివద్ద 275 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇంతే కాకుండా 30వేల మంది ట్రావెల్ ఏజెంట్ల వ్యవస్థ నిర్మితమై ఉంది. దాదాపు 800 సంస్థలు వీరి కస్టమర్లుగా ఉన్నారు. వీరి వెబ్ సైట్ ని రోజూ సుమారు 20 వేల మంది సందర్శిస్తున్నారు. ఇప్పుడీ సంస్థ వార్షిక టర్నోవర్ కోట్ల రూపాయల్లోకి చేరింది. వచ్చే ఏడాది నాటికి కనీసం రూ. 1200 కోట్ల వార్షిక టర్నోవర్ ను సాధించాలని, దేశంలోనే అత్యుత్తమ ట్రావెల్ కంపెనీగా పేరు తెచ్చుకోవాలన్నదే తమ లక్ష్యమని రికాంత్ వివరిస్తారు.

నేర్చుకున్న పాఠాలు

తన ప్రస్థానంలో నేర్చుకున్న కీలక అనుభవ పాఠాల సారాన్ని రికాంత్ ఇలా మూడు ముక్కల్లో వివరిస్తాడు.

  1. పనిపైనే శ్రద్ధ ఉంచండి
  2. నిజాయితీగా ఉండండి
  3. మీ పనిని, ఉద్యోగులను గౌరవించండి


Check them out here.