వాళ్లకు బావులు తవ్వడమంటే మంచినీళ్లు తాగినంత ఈజీ  

0

సాధారణంగా బావులు తవ్వడమనేది మగవారు చేసే పని. ఆ పనికి మహిళలు పెద్దగా ఆసక్తి చూపించరు. ఎందుకంటే అది శారీరక శ్రమతో కూడుకున్నది కాబట్టి. అయితే ఆ ఊళ్లో మాత్రం మగవారికి తామేం తీసిపోమంటూ మహిళలు ముందుకొ ఏకంగా 3వందలకు పైచిలుకు బావుల్నే తవ్విపడేశారు. రాళ్లొచ్చినా, మట్టి వచ్చినా అవలీలగా భూమిని చీల్చేస్తూ, చుట్టుపక్కల జనాలకు నీటి కష్టాలు లేకుండా చేస్తున్నారు.

కేరళ పలక్కాడ్ జిల్లాలోని పొక్కుట్టుకావు పంచాయితీ పరిధిలో ఇప్పుడు ఎరిని నోట విన్నా ఆ 300 మంది మహిళల పేర్లే. మగవాళ్లే అతి కష్టం మీద చేయగలిగే పనిని, అవలీలగా చేస్తూ వారెవ్వా అనిపిస్తున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారెంటీ స్కీం కింద కొంత మంది మహిళలు బావులు తవ్వడంలో ఆరితేరారు. మొదట్లో అడిగితే మగవాళ్ల పని మేం చేయలేం అన్నారు. పైగా రోజుకి 240 రూపాయలంటే అంటే ఇంకా కష్టం అన్నారు. అయితే అందులో ఒక ఐదుగురు ఆడవాళ్లు మాత్రం బావులు తవ్వుతాం అంటూ ముందుకొచ్చారు. వాళ్లను చూసి మరికొంతమంది జతకలిశారు. అలా దాదాపు 300 మంది దాకా గ్రూపులుగా కలిశారు.

ఈ 300 మంది సుమారు మూడేళ్లలో 310 బావుల దాకా తవ్వారు. అన్ని బావుల్లోనూ నీళ్లు వచ్చాయి కానీ, ఆరు బావుల్లో మాత్రం బండరాయి తగిలింది. అది మినహా అన్నీ సక్సెస్ అయ్యాయి.

బావులు తవ్వడమనేది కేవలం మగవాళ్లు చేసేపనా? తామెందుకు చేయలేం.. మగవారు చేసే పనులెన్నో ఆడవారు చేస్తున్నారు.. ఈ బావులొక లెక్కా అంటూ ముందుకు వచ్చాం. మమ్మల్ని చూసి స్ఫూర్తితో మరికొంతమంది వచ్చారు. ఇప్పుడు బావిని తవ్వడం మాకు మంచినీళ్లు తాగినంత ఈజీ అంటున్నారు మహిళలు. ఎంత లోతుకైనా దిగుతాం. మట్టి ఎత్తిపోస్తాం.. దేనికైనా తెగింపు అనేది కావాలి. ఆ స్ఫూర్తి మాలో పుష్కలంగా ఉందంటున్నారు.

వాళ్లను చూసి చుట్టుపక్కల మహిళలు కూడా బావులు తవ్వే పనికి రెడీ అంటున్నారు. ఉపాధి పొందడం ముఖ్యంగానీ, పనిలో ఆడ-మగ తారతమ్యం లేదని చెప్తున్నారు. వాళ్ల ఉత్సాహాన్ని చూసి పంచాయతీరాజ్ అధికారులు కూడా ప్రోత్సహిస్తున్నారు. మహిళలు తమకాళ్ల తాము నిలబడాలంటే మగవాళ్లతో సమానంగా అన్ని రంగాల్లో ముందుండాలి. ఉద్దేశంతోనే బావులు తవ్వే విషయంలో అధికారులు మరింత ఎంకరేజ్ చేస్తున్నారు.

Related Stories

Stories by team ys telugu