తేనెలూరే ఆమె స్వరంపై భాస్వరంలా మండుతున్నారు

తేనెలూరే ఆమె స్వరంపై భాస్వరంలా మండుతున్నారు

Tuesday March 14, 2017,

2 min Read

ఆమె స్వరానికి పరవశించని హృదయం లేదు. ఆమె గాత్రానికి తదాత్మ్యం పొందే ఆత్మలేదు. ఆమె పాట వింటున్నంత సేపూ అనిర్వచనీయమైన అలౌకికానందం కలుగుతుంది. తెలియని ప్రశాంతత దేహంతా పరుచుకుంది. మస్కిష్కమంతా నిర్మలత్వం అలుముకుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే తేనెలూరు ఆమె కంఠంలో సాక్షాత్తూ భగవంతుడే తిష్టవేసుకుని ఉంటాడు. అలాంటి స్వరంపై భాస్వరంలా మండి పడుతున్నారు మతఛాందసవాదులు. ముస్లిం మతంలో పుట్టి హిందూ భక్తిగీతాలాపన ఏంటని భగ్గుమంటున్నారు.

image


సుహానా సయ్యద్. 22 ఏళ్ల ముస్లిం అమ్మాయి. కర్నాకటలోని శివమొగ్గ జిల్లా సాగర అనే టౌన్ ఆమె సొంతూరు. మంచి సింగర్. మధురమైన ఆమె గాత్రం ఆమెకు దేవుడిచ్చిన వరం. అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. స రి గ మ ప వంటి టీవీ రియాలిటీ షోల్లో పాల్గొంది. ఆమె గాత్రం అందరికీ నచ్చింది. ఒక భక్తిగీతం పాడమని పార్టిసిపేట్స్ అంతా రిక్వెస్ట్ చేశారు. వాళ్ల మాట కాదనలేక వేంకటేశ్వర స్వామి కీర్తన ఒకటి పాడింది. అందరూ లేచి చప్పట్లు కొట్టి అభినందించారు. ఆ క్రమంలో గజ అనే సినిమాలో పాడేందుకు అవకాశం వచ్చింది. అది భక్తిగీతం. వేంకటేశ్వరస్వామిని కీర్తిస్తూ పాడే పాట.

అదే ఆమె చేసిన నేరమైంది. ఆ పాట విన్న మతపెద్దలు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ముస్లిం మతంలో పుట్టి హిందూ భక్తిగీతాలు ఎలా ఆలపిస్తావని ఆమెను పగబట్టారు. ఫేస్ బుక్ లో ఒక పేజీ క్రియేట్ చేసి మరీ వేధిస్తున్నారు. అన్యమత పురుషుల ముందు ఏదో పాటపాడి దానికే ఆహా ఓహో అని విర్రవీగకు.. నువ్వేదో సాధించావని భ్రమపడకు.. నీ అందాన్ని ప్రదర్శిస్తూ పాడిన పాటల వల్ల నీ తల్లిదండ్రులు నరకానికి పోతారు.. కాబట్టి ఇకపై నువ్వు బుర్ఖా ధరించకు.. దాన్ని నీకు గౌరవించడం చేతకాదు.. అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మతపెద్దల నుంచి ఇంతటి స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వచ్చినా సుహానా బెదరలేదు. ఇండస్ట్రీ ఆమెకు మద్దతు పలికింది. కళకు, కళాకారులకు కులం, మతం రంగులు పులమడం అనాగరికమని వారంతా విమర్శించారు. మేమున్నామంటూ తోటి కళాకారులు, సింగర్స్ గొంతుకలిపారు. మతాల ఆధారంగా కళాకారుల్ని విభజించలేరని ప్రతి సవాల్ చేశారు.

సుహానా చేసినదాంట్లో తప్పేంటో అర్ధం కావడం లేదు. ముస్లిం అయినంత మాత్రాన హిందూ గీతాలు పాడొద్దా..? అలా అనుకుంటే ఓ ముస్లిం కవి రాసిన పాటల్ని నేను పాడాను. దానికేమంటారు.. కాబట్టి సంగీతానికి మతం, భాష అడ్డుగోడ కాదు అంటాడు ప్రముఖ గాయకుడు రఘు దీక్షిత్.

మతఛాందసవాదులు ఏమైనా అనుకోనీయండి. సుహానాకి జరిగిన అవమానం ఒకరకంగా మంచికే జరిగింది. వాళ్లు అలా ఫత్వాలు జారీ చేశారు కాబట్టే, మతసామరస్యాన్ని పాటించేవాళ్లు గొంతు విప్పారు. మతపెద్దలు విమర్శించారు కాబట్టే.. వందల మంది లౌకికవాదులు మద్దతు పలికారు. వందమంది ఛాందసవాదుల విమర్శలకంటే.. పవిత్ర హృదయంతో మెచ్చుకున్న ఒక్క ప్రశంస గొప్పది.