17ఏళ్లుగా ఆ 8 గ్రామాల ప్రజలు దీపావళినాడు టపాసులు ఎందుకు పేల్చడం లేదు..?  

0

దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. కానీ పరమార్ధం మాత్రం టపాసులు పేల్చడం. ఇక్కడ ఎవరి మనోభావాలనో కించపరచాలనే ఉద్దేశం ఎంతమాత్రమూ కాదు. ఎవరి సరదా వారిది. కాకపోతే నిశ్శబ్ద దీపావళి జరుపుకునే కొందరి గురించి కాసేపు మాట్లాడుకుందాం!

తమిళనాడు ఇరోడ్ జిల్లా. కొంగునాడు ప్రాంతంలో ఉన్న ఈ జిల్లాలో తమిళం, తెలుగుతో కలిపి ఎనిమిది లాంగ్వేజీలు మాట్లాడుతారు. భిన్న భాషల సమ్మేళనంగా ఉన్న ఈ జిల్లా ప్రజల మనసు బంగారం. అందునా ప్రత్యేకంగా వెళోడ్ బర్డ్స్ శాంక్చువరీ చుట్టూ ఉన్న 8 గ్రామాల ప్రజల హృదయమైతే వెన్నకన్నా మెత్తనిది. మొత్తం 750 గడపలుంటాయి. వారంతా సుమారు 80 హెక్టార్లలో పరుచుకున్న పక్షుల సంరక్షణ కేంద్రం చుట్టూ ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు.

అక్కడికి వలస పక్షులు సీజన్ల వారీగా వస్తుంటాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి పెద్ద ఎత్తున వస్తుంటాయి. అక్కడే గూడు కట్టుకుని, గుడ్లు పెట్టి, పొదిగి పిల్లలతో సొంత దేశానికి ఎగిరిపోతాయి. అవన్నీ మూడు నెలలపాటు ఈ బర్డ్స్ శాంక్చువరీలో ఉంటాయి.

దాదాపు 20 ఏళ్లుగా వారంతా పక్షులతో మమేకమైపోయారు. వాటికి ఏ చిన్న ఆపద రానీయరు. కనీసం పెద్దగా శబ్దం కూడా చేయరు. అవి ఎక్కడ భయపడిపోతాయో అని కంగారు పడతారు. వాటిని ఎంత ప్రాణప్రదంగా చూసుకుంటారంటే.. దీపావళి నాడు కనీసం టపాసుల జోలికి కూడా వెళ్లరు. ఇది నిన్నామొన్న తీసుకున్న నిర్ణయం కాదు. గత 17 ఏళ్లుగా అదే మాటమీద ఉన్నారు.

ఒక చిన్న మతాబు కూడా పేల్చక కొన్నేళ్లవుతోంది అని చిన్నస్వామి అనే ఒక పెద్దాయన గర్వంగా చెప్తున్నాడు. కాకర పువ్వొత్తులు కూడా కాల్చమని అంటున్నాడు. కాకపోతే ఈ మధ్యన పిల్లలు మారాం చేస్తుంటే, ఒకటీ రెండు వెన్నెలతాళ్ల లాంటివి ఇస్తున్నామని అంటున్నారు.

నోరులేని పక్షుల కోసం పదిహేడేళ్లుగా 8 గ్రామాల ప్రజలు దీపావళిని నిశ్శబ్దంగా జరుపుకుంటున్నారంటే నిజంగా వాళ్లది గొప్ప మనసే కదా..  

Related Stories

Stories by team ys telugu