ఒకప్పుడు నెలకు రూ. 4 సంపాదన.. నేడు ప్రపంచ వ్యాప్తంగా 22 రెస్టారెంట్లకు ఓనర్‌  

సురేష్ పూజారి విజయగాథ

0

ఇది 1950 నాటి సంగతి. అతని వయసు అప్పుడు పదేళ్లు. సొంతూరు కర్నాటకలోని ఉడిపి జిల్లా పదుకోన్. కొన్ని కారణాల వల్ల పొట్టచేత పట్టుకుని మంబై వెళ్లిపోయాడు. ఓ గుడి దగ్గరున్న బడ్డీ కొట్టులో పనికి కుదిరాడు. నెలకు 4 రూపాయల జీతం. కొంతకాలం తర్వాత ముంబై పోర్ట్ ట్రస్ట్ క్యాంటీన్‌కు వెళ్లాడు. అక్కడ ఇంకో రెండు రూపాయలు ఎక్కువిస్తానన్నారు.

రోజులు దొర్లిపోతున్నాయి. ఎంతకాలం ఒకరి దగ్గర పనిచేయాలి అన్న భావన అతని మనసులో తొలుస్తోంది. తెలిసిన వ్యక్తి దగ్గర కొంత అప్పు చేశాడు. తాను దాచుకున్న పైసలు కలిపాడు. ఒక ఫ్రూట్ జ్యూస్ సెంటర్ ప్లాన్ చేశాడు. దాంతోపాటు పావ్ భాజీ కూడా. చౌపట్టీ ఏరియాలో ఒక చిన్న తోపుడు బండిలో అంతా సెట్ చేశాడు.

అనతికాలంలోనే జ్యూస్ సెంటర్ పికప్ అయింది. మరో ఆలోచన లేకుండా లామింగ్టన్ రోడ్డులో రెండో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేశాడు. ఈసారి శాండ్విచ్‌, ఇడ్లీ, ఫ్రైడ్ రైస్ జత కలిశాయి. సుఖ్‌ సాగర్ పేరుతో ఏర్పాటు చేసిన రెండు సెంటర్లు అదృష్టం కొద్దీ క్లిక్కయ్యాయి.

ఎన్నో ఒడిదొడుకులు.. మరెన్నో ఆటుపోట్లు. కష్టాల తర్వాత సుఖాలన్నట్టు.. ఒక విజయం తర్వాత మరో విజయం. అలా బ్రాంచీలు 22 అయ్యాయి. అందులో 8 ముంబైలోనే ఉన్నాయి. 7 బెంగళూరులో, ఒకటి మైసూరులో, మరొకటి చెన్నైలో ఉంది. సౌదీ, దుబాయ్, ఖతార్‌ లో సుఖ్ సాగర్ బ్రాంచీలున్నాయి. 22 హోటళ్లతో పాటు ఒక షాపింగ్ మాల్, ఒక ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ, దాంతోపాటు బెంగళూరులో ఒక త్రీస్టార్ హోటల్ ఉంది.

ఇదీ సురేష్ పూజారి విజయగాథ. చిన్న బండిలో మొదలైన బజ్జీల వ్యాపారం నేడు దేశవిదేశాల్లో స్టార్ హోటళ్లుగా మారిందంటే కారణం అతనిలో ఉన్న కసి, పట్టుదల. పూజారి సక్సెస్ స్టోరీ విని అమితాబ్ బచ్చన్ ప్రత్యేకంగా వచ్చి షేక్ హ్యాండిచ్చారు. ఇక మాజీ కేంద్రం మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ అయితే అప్పట్లో సుఖ్ సాగర్ కు రెగ్యులర్ కస్టమర్.

కస్టమర్ల టేస్ట్ ఏంటో, వాళ్ల అభిరుచి ఏంటో తెలసుకోగలిగాను కాబట్టే హోటల్ బిజినెస్ లో సక్సెస్ కాగలిగాడు సురేష్ పూజారి. అదే తన రియల్ లెర్నింగ్ గ్రౌండ్ అంటాడు. రోజుకి ఎంతలేదన్నా 18 గంటలు పనిచేసేవాడు. అలా కష్టపడుతూనే రాత్రిపూట బడిలో చేరాడు. తొమ్మిదో క్లాస్ దాకా ఎలాగో నెట్టుకొచ్చాడు. కానీ టెన్త్ వరకు వచ్చేసరికి కష్టమైంది. అలా చదువుకి ఫుల్ స్టాప్ పడింది. కానీ ఇప్పటికీ పుస్తక పఠనం అతని హాబీ. ఆ అభిరుచితోనే వెయ్యిదాకా బుక్స్ కలెక్ట్ చేశాడు. అందులో ఏ ఒక్కటీ చదవకుండా వదల్లేదట.

వ్యాపారం ఒక్కటే కాదు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా అనాథలకు అభాగ్యులకు చదువు, కడుపునిండా అన్నం పెడుతున్నాడు. సుమారు వెయ్యిమందికి తన సంస్థల్లో ఉపాధి కల్పించాడు.

1976లో పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు కుమారులు. వాళ్లంతా ఇండియాతో పాటు విదేశాల్లో ఉన్న సుఖ్ సాగర్ రెస్టారెంట్ల ఆపరేషన్స్ చూసుకుంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణాన్ని అలవర్చుకున్న సురేష్ పూజారి.. తన సొంత ఊరిని ఏమాత్రం మరిచిపోలేదు. పదుకోన్ గ్రామంలో ఎందరో పేద పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడు. ఆ ఊరిలో ఒక కమ్యూనిటీ హాల్ కూడా కట్టిచ్చాడు. 

ఇంకో విషయం ఏంటంటే.. తన స్టాఫ్ లో ఎవరికైనా ఒంట్లో బాగాలేక సెలవు పెడితే- పెయిడ్ లీవ్ ఇస్తాడు. అదికాకుండా వారి మెడికల్ బిల్లు కూడా తనే చెల్లించి పెద్దమనసు చాటుకుంటాడు. సిబ్బందిలో ఎవరికైనా రుణం కావల్సి వస్తే కాదనడు. సొంతంగా బిజినెస్ పెట్టుకుంటానంటే భుజంతట్టి ప్రొత్సహిస్తాడు.

భోళా శంకరుడు.. నిరాడంబరుడు... మనసున్న మనిషి... పదిమందికీ ఆదర్శంగా నిలిచే ఒక నిస్వార్ధ వ్యాపారి... ఈ కాలంలోనూ పూజారి లాంటి వారు ఎంతమంది ఉంటారు చెప్పండి. 

Related Stories