మీ స్టార్టప్ సరైన రూట్లోనే వెళ్తోందా..?

Saturday March 12, 2016,

4 min Read


స్టార్టప్ ల రంగంలోకి వచ్చేవారంతా ఒక్కోసారి సందిగ్దంలో పడిపోతారు. సరైన మార్గంలోనే వెళ్తున్నామా అన్న సందేహం వస్తోంది. ఒకేసారి పోటీ పెరిగినట్లు ఉక్కిరిబిక్కిరవుతారు. ఒకరో ఇద్దరో కాదు..  ప్రపంచవ్యాస్తంగా ఔత్సాహిక వ్యాపారవేత్తలంతా ఇలాంటి సవాళ్లనే ఎదుర్కొంటున్నారు. 

వ్యాపారం ఎందుకు? చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఇంటిపట్టున ఉండక.. అంటూ ఉచిత సలహాలిచ్చేవారు ఎక్కువయ్యేకొద్దీ ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. ఈ యాంబియెన్స్ లో ఒక ఔత్సాహిక వ్యాపారవేత్త తన భవిష్యత్ మార్కెట్ ఎలా ఉంటుందో ఊహించలేకపోవచ్చు. కానీ సరిగా ప్లాన్ చేసుకుని… రేపు ఏం జరగబోతుందో అంచనా వేస్తే సగం విజయం సాధించినట్లే అంటున్నారు విశ్లేషకులు. 

అయినాగానీ, నూటికి నూరుశాతం కచ్చితంగా భవిష్యత్ ను అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాదు. అలాంటి వారికోసం అలోక్ గోయల్ విలువైన సూచనలు చేస్తున్నారు. గోయల్ ప్రస్తుతం బెంగళూరులో మొబైల్ అండ్ సాస్ బిజినెస్ కంపెనీ సైఫ్ ఎండీగా పనిచేస్తున్నారు. గతంలో రెడ్ బస్ సీఓఓగా, ఫ్రీఛార్జ్ సీఈఓగా సేవలందించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో చదువుకున్న అలోక్ ను ఫోర్బ్స్ మ్యాగజైన్ సైతం గుర్తించింది.

“వ్యాపారాల్లో మొత్తం మూడు రకాలుంటాయి. ఒకటి సుస్థిరమైన వ్యాపార సామ్రాజ్యం స్థాపించాలనుకోవడం, రెండోది చేయలేమని చేతులెత్తేసేటప్పుడు దాన్ని వేరే కంపెనీకి అమ్మి… తక్కువ నష్టాలతో బయటపడటం. మూడోది వ్యాపారం చేద్దామనుకుని… ప్రారంభించి ఎందుకులే అనుకుని ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం సాధించడం”-గోయల్

ఏం చేయాలనుకుంటున్నారు?

అలోక్ గోయల్ చెప్పినట్లు ఆ మూడింటిలో ఏదో ఒకదానిపై మొదట్లోనే స్పష్టత రావడం మంచిది. ఒకటి బిజినెస్, రెండోది ప్రోడక్ట్, మూడోది హ్యాక్. ఈ మూడింటిలో మీరు ఏ వర్గానికి చెందుతారో అంచనా వేసుకోండి.

బిజినెస్ 

స్థిరమైన రాబడికోసం సుస్థిరమైన వ్యాపారాన్ని చేయాలనుకుంటే… కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక ఆటుపోట్లను తట్టుకోవాలన్న ఆత్మ స్థైర్యం ఉండాలి. ఇప్పుడు ప్రపంచం టెక్నాలజీ చుట్టూ తిరుగుతోంది. అందుకే మంచి వ్యాపారానికి ఉండాల్సిన కొన్ని లక్షణాలను పరిశీలిద్దాం.

మీ వ్యాపారం పోటీని తట్టుకోగలదా?

ఒక వ్యాపారాన్ని విజయవంతం చేయాలనుకుంటే… ఇప్పటికన్నా పదిరెట్లు ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. లేదా… పది రెట్లు సమయం వెచ్చించి కష్టపడాల్సి ఉంటుంది. అధిక శ్రమ లేదా అధిక పెట్టుబడి. రెండింటిలో ఏదో ఒకటి అవసరం. స్టార్టప్స్ లో అంత డబ్బు పెట్టలేరు కాబట్టి.. మంచి నెట్ వర్క్ ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే మార్కెట్లో నిలబడలేరు. పోటీదారుల దెబ్బకు డీలాపడిపోతారు. అందుకే సమర్థవంతమైన టీం, నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలి.

కారుకన్నా వేగంగా దూసుకుపోయే గుర్రాన్ని తయారు చేయాలనుకుంటున్నారా?

ప్రతి కొన్నేళ్లకు ఒకసారి వ్యాపారం తన స్వరూపాన్ని మార్చుకుంటుంది. అంటే అందులో పూర్తిస్థాయి మార్పులొస్తాయి. మార్కెట్లో కొత్త విజేతలు పుట్టుకొస్తారు. పాతవాసలను వదిలించుకోవాలి. ఉదాహరణకు 2009లో ఎస్ఎంఎస్ సొల్యూషన్స్ పై పరిశోధనలు మొదలుపెట్టారు. కొన్ని కంపెనీలు ఇంకా అక్కడే ఉండిపోయాయి. ప్రపంచం పరుగులు తీస్తున్నా వారు ఆ వేగాన్ని అందుకోలేక పోయారు. స్మార్ట్ ఫోన్స్ గురించి ఆలోచించలేకపోవడమే వారి వెనుకబాటుతనానికి కారణం.

సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కోసం వేరే సంస్థపై ఆధారపడుతున్నారా?

నేను చాలామంది ఔత్సాహహిక పారిశ్రామికవేత్తలను కలిశాను. వాళ్లంతా ఏదో పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుందాం అనుకుంటారు. ఓవర్ నైట్ పెద్ద కంపెనీగా మారిపోదాం అనుకుంటారు. అయితే అదంతా భ్రమని తర్వాత తెలుసుకుంటారు. ఎందుకంటే ఎదగాలనుకుంటే… పార్ట్ నర్ గా ఉన్న పెద్ద కంపెనీయే మనల్ని పోటీదారుగా భావించి స్టార్టింగ్ లో ఎంకరేజ్ చేసి తర్వాత తొక్కేస్తుంది.

టెక్నాలజీ, మార్కెట్ పై పూర్తి స్థాయి అవగాహన ఉందా?

మన ఉత్పత్తులను పోటీ కంపెనీలు కాపీ కొడతాయి. అయితే టెక్నాలజీపై మనకున్న లోతైన పరిజ్ఞానాన్ని మాత్రం కాపీ కొట్టలేవు. దీనికి చక్కని ఉదాహరణ రెడ్ బస్. దాన్ని మొదట్లో కేవలం ఓటీఏ సాఫ్ట్ వేర్ అనుకున్నారు. పోటీదారులు మా వ్యూహాలను అర్థం చేసుకునేలోపే మేం విజయం సాధించాం.

మీకంటూ కొంతమంది సప్లయర్స్ ఉన్నారా?

సప్లయర్స్ తో గొడవలు ఎప్పుడూ ఉండేవే. మార్జిన్ కోసం కీచులాటలు తప్పవు. అయితే వ్యాపారంలో విజయం సాధించారంటే మాత్రం వారే చచ్చుకుంటూ మీ దగ్గరకు వస్తారు. మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ ధింగానా దీనికి చక్కని ఉదాహరణ.

మీ బిజినెస్ ప్లాన్ ప్రత్యర్థులకన్నా బెటర్ గా ఉందా?

ఏ వ్యాపారానికైనా వ్యూహాలు చాలా ముఖ్యం. వ్యూహం బాగుంటేనే విజయం. మనం ఒక కొత్త ఉత్పత్తిని ప్రారంభించినంత మాత్రాన … వినియోగదారులు తమ అలవాట్లు మార్చుకుని మన దగ్గరకు వస్తారని అనుకోవద్దు. మార్కెట్ అద్భుతంగా ఉందన్న ఉద్దేశంతో చాలామంది లాండ్రీ సర్వీసులు ప్రారంభించారు. అయితే లోకల్ ధోబీలకు వారెవరూ పోటీ ఇవ్వలేక డీలాపడిపోయారు.

మీరు దిగాలనుకున్న వ్యాపారంలోకి బడా కంపెనీలు రాబోతున్నాయా?

మీరు స్టార్టప్ ప్రారంభించబోయే రంగంలో పెద్ద కంపెనీలు వస్తే మీవైపు కస్టమర్లు చూడరు. అయితే పక్కా ప్రణాళిక, ముందుచూపుతో రంగంలోకి దిగితే మాత్రం నష్టమేమీ లేదు. ఎవరి బిజినెస్ వారిదే.

ఈ ప్రశ్నలన్నింటికీ మంచి మీ నుంచి అన్నీ అనుకూలమైన సమాధానాలే వస్తాయని అనుకోను. స్టార్టప్స్ పెట్టాలనుకునే ప్రతివ్యక్తి ఈ ప్రశ్నలు వేసుకోవాలి. మీ స్టార్టప్ బిజినెస్ సెగ్మెంట్ లోకి రాకపోతే… అది ప్రోడక్ట్ లేదా హ్యాక్ విభాగంలోకి వస్తుంది.

ప్రోడక్ట్

ఒక పెద్ద కంపెనీ మీ స్టార్టప్ ను మింగేసే పరిస్థితి వచ్చిందనుకోండి. అప్పుడు మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటారు. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా ఆలోచించాలి. పెద్ద కంపెనీలు ఒక నిర్ణయాన్ని అమలు చేయడానికి కొంత టై పడుతుంది. ఈలోగా మీరు ముందుకెళ్లొచ్చు. మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి వస్తే బడా కంపెనీకి మీ వ్యాపారాన్ని అమ్మేయాలి. ఎంతోకొంత లాభాలతో బయటపడే ప్రయత్నం చేయాలి.

మీ డిస్ట్రిబ్యూషన్ ను మీరు చేసుకోలేకపోయినా… వేరే కంపెనీపైనే పూర్తిగా ఆధారపడే పరిస్థితి వచ్చినా… బిజినెస్ ను వదిలించుకుని బయటపడటం ఉత్తమం.

హ్యాక్

బిజినెస్ లేదా ప్రోడక్ట్ విభాగంలోకి మీరు రాలేదంటే కచ్చితంగా మీరు హ్యాక్ కేటగిరీలోకి వస్తారు. స్టార్టప్ ప్రారంభించి నడపలేని పరిస్థితి వస్తే మీ ప్లాన్ ను వేరే కంపెనీకి ఇచ్చి ఆ కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగంలో చేరండి.

undefined

undefined


స్టార్టప్స్ లో చాలా అంశాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ ప్రశ్నలకు మీ దగ్గర జవాబులున్నాయో … లేదో చూసుకోవాలి. ఆటుపోటులను తట్టుకుని చేయగలమన్నా సత్తా ఉన్నప్పుడే రంగంలోకి దిగాలి.