'అమ్మా! మందులు వేసుకున్నావా!'

చేదు మాత్రలు మింగమని తియ్యగా చెప్పే మెడిఅలర్ట్‌• రోజూ 10 వేలమంది రోగులకు క్యూర్‌ ఆన్‌ డెలివరీ సందేశాలు• రోబోట్లను విడిచి రోగుల సేవకు దిగిన ఇంజనీర్లు• ఎంత బిజీగా ఉన్నా ఆప్యాయంగా పలకరించే సదుపాయం

Friday July 24, 2015,

3 min Read

'మందులు మహత్తరమైనవి. అవిరోగాన్ని నయం చేస్తాయి. కాకపోతే, మీరు సమయానికి వేసుకున్నప్పుడే సుమా!' అని యశ్‌ కపూర్‌తో డాక్టర్‌ అన్నారు.

ఈ మాటలే యశ్‌, పీతాంబర్‌ ఝాని ప్రేరేపించాయి. వారికి తెలిసిన సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్యానికి అనురాగాన్ని జోడించాలన్న తలంపు కలిగింది. ఈ ఇద్దరు ఢిల్లీ కుర్రాళ్లు మెడిఅలర్ట్‌ సర్వీసు ఆరంభించారు. 'మందులు వేసుకున్నారా?' అని ఆప్యాయంగా అడిగే అలర్ట్‌ సర్వీసు ఇది. ఎవరో ఒకరిద్దరిని కాదు, ఏకంగా 10 వేల మందిని నిత్యం అలర్ట్‌ చేస్తుంటారు.

గతంలోకి వెళితే...

యశ్‌ కపూర్‌కి చిన్నప్పటి నుంచీ టెక్నాలజీ అంటే ప్రాణం. కాలేజీ రోజుల్లోనే రోబోటిక్స్‌పై పనిచేశారు. సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధిలో సొంతంగా చాలా ప్రాజెక్టులు చేశారు. అమెరికాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నాసా కోసం లూనార్‌ రోబోట్లను కూడా యశ్‌ రూపొందించారు.

అతను, పీతాంబర్‌ చిన్ననాటి స్నేహితులు. వాళ్లిద్దరూ ఒకే స్కూలు, ఒకే కాలేజీ, చివరికి హాస్టల్‌లో ఒకే రూమ్‌మేట్లు. వీళ్లు ఫరీదాబాద్‌లో ఎచ్లన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో చదువుకున్నారు. మెడిఅలర్ట్‌ కన్నా ముందు టెలికాం రంగంలో 2జి/3జి బ్రాడ్‌బ్యాండ్‌కు సంబంధించి తలెత్తే సమస్యలను తీర్చడానికి ఓ ప్రాజెక్టు చేశారు.

అయినప్పటికీ, వీళ్ల దగ్గరున్న నిధులు అంతంతమాత్రమే కావడంతో ఈ రంగంలో పాతుకుపోయిన పెద్ద తలకాయలతో పోటీ పడలేకపోయారు. 'దాంతో అనివార్యంగా మేము ఐటి, హెల్త్‌ కేర్‌ సర్వీసు రంగంలోకి మళ్లవలసి వచ్చింద'న్నారు యశ్‌.

ఈ మిత్రద్వయం 2014 ఆగస్టులో క్యూర్‌ ఆన్‌ డెలివరీ స్థాపించారు.

క్యూర్‌ ఆన్‌ డెలివరీ (COD)కి ప్రేరణ ఏమిటి?

కొన్నేళ్లక్రితం జరిగిన ఘటన యశ్‌ మనసును కదిలించేసింది.

ఆయన తండ్రికి రక్తపోటు. సమయానుసారంగా మందులు వేసుకోవడాన్ని నిర్లక్ష్యం చేసేవారు. ఒక రోజున ఆఫీసులో ఉండగానే, ఆయనకు వాంతులు, తీవ్రమైన తలనొప్పి, మైకం కమ్మడం సంభవించాయి.

అంత తీవ్రమైన పరిస్థితిలోనూ ఆయన తనంతటతానే దగ్గరలోని డాక్టర్‌ దగ్గరకు వెళ్లారు. గుండె పోటు వచ్చిందని డాక్టర్‌ గుర్తించారు. దీనికి కారణం ఆయన వేళకు మందులు వేసుకోకపోవడమేనని కూడా తేల్చి చెప్పారు.

అప్పటికి యశ్‌ ఇంకా కాలేజీ స్టూడెంటే. విషయం తెలియగానే హాస్పిటల్‌కి వెళ్లారు. డాక్టర్‌తో మాట్లాడిన తర్వాత, వేళకు మందులు వేసుకోవడం ఎంత ముఖ్యమో గ్రహించారు. మందులు వేసుకోవలసిందిగా గుర్తు చేయడం రోగులను ప్రేమించేవారి బాధ్యతని భావించారు.

ఈ చేదు అనుభవంతో వాస్తవంలోకి వచ్చారు యశ్‌. 'నాస్నేహితులతోనూ, సహోద్యోగులతోనూ ఈ విషయమ్మీద మాట్లాడినప్పుడు దాదాపు అందరిదీ ఇదే అనుభవమని తెలిసొచ్చింది. అందరిలోనూ తమ కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండాలనే కోరిక ఉందని గుర్తించాను' అని తెలిపారు.

అంత విశేషమేముంది?

మెడిఅలర్ట్‌ అనేది కుటుంబ సభ్యులు వాయిస్‌ నోట్స్‌ సెట్‌ చేసుకుంటే, తద్వారా 'మందులు వేసుకోమ'ని తమవాళ్లకు గుర్తు చేయవచ్చు.

అంతేకాదు, తమ తమ వృత్తి వ్యాపకాలలో బిజీగా ఉన్నప్పటికీ స్వయంగా గుర్తు చేసిన అనుభూతిని పొందగలుగుతారు. రోగులకు ఇది ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. ఎమోషనల్‌ సపోర్టుగా పనిచేస్తుంది.

'ఒకసారి ఊహించుకోండి, ఫోన్‌ రింగ్‌ అయ్యింది. మీ అమ్మగారు లిఫ్ట్‌ చేశారు. మీ గొంతు ఆప్యాయంగా 'అమ్మా మందులు వేసుకున్నావా?' అని రిమైండ్‌ చేస్తే... ఆమె మనసుకు ఎంత హాయిగా ఉంటుందో ఊహించండి. ఎంతమాత్రం ఆమె తన మందుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండలేరు' అన్నారు ఎన్‌.ఎస్‌.నవీన్‌. ఆయన ఈ కంపెనీకి ఆపరేషన్స్‌ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు.

సౌలభ్యంకోసం వీరిని కేర్‌గివర్‌ (గుర్తు చేసేవారు), మెడిసిన్‌-టేకర్‌ (మందులు వేసుకోవలసినవారు)గా పేర్కొంటారు. కేర్‌గివర్‌ రిమైండర్లను ఫోన్‌ కాల్‌, ఎసెమ్మెస్‌, ఈమెయిల్‌... ఇలా ఏ రూపంలోనైనా పంపవచ్చు. అవతలివైపున ఉన్నవారు (మెడిసిన్‌-టేకర్‌) ఏ మాధ్యమంలో అందుబాటులో ఉంటారనేదానిని బట్టి, రిమైండర్‌ కాల్‌ ఎంచుకోవచ్చు. ఫోన్‌ద్వారా రిమైండర్‌ పంపదలిస్తే ముందుగా కేర్‌గివర్‌ తన వాయిస్‌ మెసేజ్‌ను రికార్డు చేయాల్సి ఉంటుంది. నిర్దేశిత సమయంలో కాల్‌ చేసి, మెడిసిన్‌-టేకర్‌కి గుర్తు చేస్తుంది. ఎసెమ్మెస్‌, ఈ మెయిల్‌ రూపంలో గుర్తు చేయదలిస్తే, కేర్‌గివర్‌ ముందుగానే ఇచ్చిన సందేశాన్ని చూపెడతాయి.

మెడిఅలర్ట్‌ కేవలం ఫోన్‌ కాల్‌కి మాత్రమే రుసుం వసూలు చేస్తుంది. అదికూడా చాలా స్వలం. నెలకు 250 రూ.లు ఖర్చుతో, నలుగురు మెడిసిన్ టేకర్లకు రిమైండర్లు పంపుకోవచ్చు. ఈమెయిల్‌, ఎసెమ్మెస్‌ సర్వీసు ప్రస్తుతానికి ఉచితమే!

రిమైండర్‌ సదుపాయాన్ని ఆసుపత్రులకుకూడా కల్పించారు. ప్రతి పేషెంటును సొంత మనిషిగా భావించే ఆసుపత్రులవారు దీనిని ఉపయోగించుకుంటున్నారు. రోగులతో ఒక సమాచార చానెల్‌ను ఏర్పాటు చేసుకుని, విజిట్‌ చేసే సమయం, టెస్టులు, మందులు గుర్తు చేస్తుంటారు.

ఇప్పటివరకు స్పందన ఎలా ఉంది?

'2014 డిసెంబర్‌లో మెడిఅలర్ట్‌ ఆరంభించాం. నిత్యం దేశవ్యాప్తంగా 24 వేలమందికి రిమైండర్లు పంపుతున్నాం. బి2బి కింద న్యూఢిల్లీలోని మెట్రో, అపోలో ఆసుపత్రులతో భాగస్వాములమై ఉన్నాం.

కొంతమేరకు పోటీ ఉన్నప్పటికీ, మేము ఇచ్చే సర్వీసు రీత్యా మార్కెట్టులో మాదే పైచేయి. ఇతరులు అరకొర సర్వీసు ఇస్తున్నారు. ఏకకాలంలో మేము ఆసుపత్రికి, రోగులకు లాభాన్ని చేకూరుస్తున్నాం' అన్నారు యశ్‌.

భవిష్యత్తుపై అంచనాలు

'హాస్పిటల్‌ సెగ్మంట్‌లో అనూహ్యంగా కిందిస్థాయిలో డిమాండ్‌ ఏర్పడింది. కాస్త ఊపిరి తీసుకున్న తర్వాత జనరల్‌ ఫిజీషియన్‌ స్థాయిలోనూ, సెకండర్‌ కేర్‌ సెగ్మంట్‌లోనూ అవకాశాలకోసం అన్వేషిస్తాం' అన్నారు యశ్‌.