విప్రో ఉద్యోగం వదిలి జీడిపప్పు రైతుల వెంటపడ్డాడు !

పుట్టెడు కష్టాలతో భారతీయ రైతు నిత్యం నష్టాల ఊబిలో ఉంటాడు. అధునాతన వ్యవసాయ పద్ధతులు అందుబాటులో లేక నానా తంటాలు పడుతుంటాడు. అలాంటి వారి కోసం అడపా దడపా ఆశాకిరణాలు వెలుస్తుంటాయి. మన శశి కూడా అంతే.

విప్రో ఉద్యోగం వదిలి జీడిపప్పు రైతుల వెంటపడ్డాడు !

Monday June 22, 2015,

4 min Read

సంస్థలను స్థాపించడమంటే సవాళ్లను ఆహ్వానించినట్లే. కొన్ని పాఠాలు కష్టపడి నేర్చుకోవాలి. అయితే వాటికి తగిన ఫలితం కూడా ఉంటుంది. శశి శేఖర్ క్రిష్ అదే విషయాన్ని అర్థం చేసుకున్నారు. వృత్తి రీత్యా ఇంజనీర్, ప్రవృత్తి రీత్యా పరిశోధకుడైన శశి…ఐఐటీ మద్రాసులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. మైక్రో ఎలక్ట్రానిక్స్ ఆయన ప్రత్యేకత. వీఎల్ఎస్ఐ అల్గోరిథమ్స్ పై పరిశోధనలు చేస్తూ ఐఐఎస్సీ బెంగళూరులో డాక్టరేట్ పొందారు. డిగ్రీ చదివే రోజుల్లోనే ఆయన బస్సులకు కొత్త వెల్డింగ్ పరికరాలపై దృష్టి పెట్టారు. దాన్ని ఆచరణలో పెడుతూ సరికొత్త మార్గంలో నడవాలనుకున్నారు. అందుకు అభ్యంతరం చెప్పిన ఆయన తండ్రి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలని సూచించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే నాటికి వ్యవస్థాపనపై ఆసక్తి తగ్గిన శశి.. కార్పొరేట్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.

శశి విప్రోలో చేరారు. కొత్త అవకాశాల కోసం వెదకాలన్న జిజ్ఞాస మాత్రం తగ్గలేదు. ఉద్యోగం చేస్తూనే పరిశోధన కొనసాగించి.. డాక్టరేట్ డిగ్రీ పొందారు. ఏడేళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత పరిశ్రమ ఏర్పాటుపై మళ్లీ దృష్టి మళ్లింది. ఇంతవరకూ ఆయన ప్రయాణం మంచి అనుభవాన్నే ఇచ్చింది. శశి ఇప్పుడు నానో పిక్స్ అనే సంస్థకు వ్యవస్థాపకుడు. సన్నకారు రైతులకు జీడిపప్పు టెస్టింగ్ మరియు గ్రేడింగ్ నిర్వహించే యంత్రాలను ఈ సంస్థ తయారు చేస్తుంది. విప్రోలో పనిచేసిన ముగ్గురు సహచరులతో కలిసి ఈ కంపెనీ ఏర్పాటుపై చర్చించారు. ఉద్యోగం ఏడాది పాటు చేసిన తర్వాత పొదుపు చేసిన డబ్బుతోనే ఇది సాధ్యమనే నిర్ణయానికి అంతా వచ్చేశారు.

“విప్రోలో నేను సంపాదించిన దానితో పోల్చితే ఐదు రెట్లు ఆదాయం పొందా. ఏడాది తర్వాత ఉద్యోగం మానెయ్యాల్సి వచ్చినప్పుడు ముగ్గురు సహచరులు వెనక్కి తగ్గారు. మంచి వేతనం వదులుకునేందుకు వాళ్లు సిద్ధంగా లేరు. అప్పుడు నేనొక్కడినే మిగిలాను..” అని శశి తన తొలి నాటి అనుభవాలను వివరించారు. 

శశి వెనుకంజ వేయలేదు. తన పరిశోధనల్లోనూ.. పనిలోనూ ఇమేజ్ ప్రాసెసింగ్‌పై దృష్టి పెట్టారు. ఇమేజ్ ప్రాసెసింగ్ సొల్యూషన్స్‌లో ఆటోమోటివ్ పరిశ్రమ వేగం పుంజుకోవడం ఆయన గమనించారు. తనిఖీలు, పరిశీలన, సమీకరణ లాంటి అంశాల్లో ఇమేజ్ ప్రాసెసింగ్‌ను వినియోగిస్తున్నారు. ఇలాంటి పనుల్లో శశికి పూర్వానుభవం ఉంది. నిర్దేశిత వినియోగదారులకు శశి ఈ పని చేసి పెట్టాడు. చెన్నైలో కొందరు మిత్రులు ఆటోమోటివ్ పరిశ్రమలో పనిచేయడంతో శశి అక్కడకు వెళ్లారు. “యంత్రంలోని భాగాలను తనిఖీ చేసే కెమెరా ఆధారిత సొల్యూషన్స్‌ను వారికి అందించడం ప్రారంభించాను. స్క్రూ గట్టిగా బిగించి ఉందా లేదా… ట్యూబ్ సరిగ్గా అమర్చారా లేదా లాంటి అంశాలు తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడింది. స్క్రూలు, నట్లు పరిమాణం తెలుసుకునేందుకు కూడా ఇది పనికివచ్చింది. నేను చూపిన పరిష్కారాల కోసం జనం చాలా కాలంగా వేచి ఉన్నారు” అని శశి చెబుతారు. ఏడాది పాటు తానొక్కడే ఆ వ్యవస్థను నడిపారు. తర్వాత హుబ్లీలోని సంకల్ప్ సెమీ కండక్టర్స్‌తో చేతులు కలపాలని నిర్ణయించుకుని.. అక్కడి పనులను చూసేందుకు వెళ్లారు. అక్కడ అనుకున్నది జరగకపోయినా దేశ్ పాండే ఫౌండేషన్‌తో పరిచయం ఏర్పడింది. 

కాఫీ టేబుల్ కాలగమనాన్ని మార్చేసింది

టెక్నాలజీ వల్ల సమాజంపై పడే అనుకూల ప్రభావం, వ్యాపారంలో మనుగడ సాగించగలిగే స్వభావమూ ఆయనకు బోధపడ్డాయి. ఒక సారి హుబ్లీలో మిత్రుడితో కాఫీ తాగుతూ… నానో పిక్స్ సంస్థలో ఇమేజ్ ప్రాసెసింగ్ సొల్యూషన్స్ పై తన పనిని వివరించారాయన. నట్స్‌లో పరిమాణాలు, ఆకారాలు, రకాలను వర్గీకరించే వీలుందని తనకు తెలిసిన టెక్నాలజీని వివరించారాయన. అయితే శశి మిత్రుడు మాత్రం ఈయన వెరుశెనగ, జిడిపప్పు గురించి మాట్లాడుతున్నారని అనుకోవడం యాధృచ్ఛికమే అయినా అది ప్రయోజనకరమే అయ్యింది. అదే రోజున అయన మిత్రుడు ఒక జీడిపప్పు ఉత్పత్తిదారుడిని కలుసుకున్నారు. జీడిపప్పు గ్రేడింగ్ లో ఖర్చు పెరిగిపోతోందని, నైపుణ్యం ఉన్న కార్మికులు దొరకడం లేదని ఆయన వాపోయాడు. దానితో ఆ ఉత్పత్తిదారుడికి శశిని పరిచయం చేశారు. ఉత్పత్తిదారునికి నట్స్, బోల్ట్స్ అవసరం లేదని… జీడిపప్పు గ్రేటింగ్‌కు పరిష్కారం కావాలని మాటల సందర్భంలోనే శశి అర్థంచేసుకున్నారు. 

నానో సార్టర్ యంత్రంలో టీమ్

నానో సార్టర్ యంత్రంలో టీమ్


“ఈ పని మాత్రం ఎందుకు చేయకూడదని నాకు అనిపించింది. వెంటనే ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేసి వారికి చూపించాను. నా సాఫ్ట్‌వేర్ చూసి వాళ్లు తృప్తి చెందారు. అయితే జీడిపప్పు పరిశ్రమలో కేవలం సాఫ్ట్‌వేర్ ను ఎవరూ కొనుగోలు చేయరని చెప్పారు. చివరిదాకా ఉపయోగపడే యంత్రం కావాలన్నారు. దానితో నేను ఒక ప్రతిపాదన రూపొందించి దేశ్ పాండే ఫౌండేషన్‌కు సమర్పించాను. కొంత డబ్బు సర్దుబాటు చేసేందుకు వాళ్లు అంగీకరించారు. నేను నా బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఇంతలో మాకు మరికొంత మంది కస్టమర్లు కూడా దొరికారు. పద్దెనిమిది నెలల్లో యంత్రం సిద్ధమైందని'' శశి వివరించారు. 

జీడిపప్పు పరిశ్రమలో మొదటి నుంచి చివరి వరకూ సాగే ప్రక్రియను శశి అర్థం చేసుకో గలిగారు. ఈ రంగంలో ఉన్న రైతులకు గ్రేడింగ్ జరిపే తీరు తెలియదు. రైతులు శ్రమపడితే ఎగుమతిదారులు కాసుల పంట పండించుకుంటూ వచ్చేవారు.

యంత్రం తయారైంది కానీ కొనేవారేరీ !

“భారీ పెట్టుబడి పెట్టగలిగిన వాళ్లే రాణిస్తున్నారు. జీడిపప్పు ఉత్పత్తి చేసే రైతులు మాత్రం గ్రేడింగ్ చేసి విక్రయించుకునే స్థితిలో లేరు. రైతుల కోసం మేము యంత్రాన్ని తయారు చేశాం. గ్రేడింగ్ చేసిన తర్వాత జీడిపప్పును అమ్ముకోగలిగితే వారికి మంచి లాభాలు అందుతాయి” అని శశి చెబుతారు. ఊరూరా తిరిగిన శశి…జీడిపప్పు పరిశ్రమపై జనంతో మాట్లాడారు. ఆయన తయారు చేసిన యంత్రాన్ని ప్రతీ ఒక్కరూ సందేహంగానే చూశారు. ఇదీ చాలా ఖర్చుతో కూడుకున్న పని అని… తమకు లాభాసాటిగా ఉండకపోవచ్చని అందరూ అన్నారు. చివరకు రిస్క్ తీసుకునేందుకు ఒక రైతు ముందుకు వచ్చారు. ఈ యంత్రం పనిచేస్తే ఆర్డర్లు తీసుకోవచ్చు. ఏడాదికి అరవై లక్షలు టర్నోవర్ వస్తుందని శశి అంచనా వేశారు. “ఆ రైతు మా యంత్రాన్ని కొన్నారు. అనుకున్న సమయానికి నాలుగు రోజుల ముందే పని పూర్తి చేసుకోగలిగారు. దానితో ఇతర రైతులకు కూడా మా యంత్రం గురించి తెలిసిపోయింది. యంత్రాల విక్రయం వేగం పుంజుకుంది. రైతులతో పాటు వాణిజ్యపరంగా గ్రేడింగ్ చేసే వారితో కూడా ఒప్పందాలు కుదిరాయి. రైతులకు, ఎగుమతి దారులకు సేవలు అందించగలిగాం. రైతులకు యాభై శాతం సబ్సిడీ అందుతోంది. పన్నెండు లక్షల రూపాయల యంత్రం వారికి ఆరు లక్షలకే అందుబాటుకు వచ్చింది. పెట్టిన పెట్టుబడి ఎనిమిది నుంచి పది నెలల కాలంలో తిరగొచ్చింది” అని శశి తన వ్యాపార రహస్యాన్ని వివరించారు. 

ఇంతవరకూ 15 యంత్రాలను విక్రయించిన శశి.. ఆర్థిక సంవత్సరం ఆఖరుకు మరో పాతిక యంత్రాలను అమ్మేందుకు సిద్ధమవుతున్నారు. నేడు నానో పిక్స్ సంస్థలో 28 మందితో కూడిన శక్తిమంతమైన బృందం ఉంది. శశి కుటుంబం కూడా హుబ్లీకి మారింది. ఒకప్పుడు జీతాలివ్వగా ఆయన ఖాతాలో 3,508 రూపాయలు మిగిలింది. నిజంగా అది పీడకల. అకస్మాత్తుగా మూడు మిషన్ల తయారీకి ఆర్డరొచ్చింది. వాటి విలువ 36 లక్షల రుపాయలు. కాలం వేగంగా మారుతోందని శశి చెబుతారు. చేసిన తప్పులకు బాధ లేదని, కానీ ఆర్థిక ఇబ్బందులు మాత్రం మెలితిప్పేశాయని పాత రోజులను గుర్తు చేసుకుంటారు. కొందరు అసమర్థులను పనిలోకి తీసుకోవడం వల్ల ఆలస్యమైందని గుర్తించారు. కానీ పనితీరు మెరుగుపడుతున్నందుకు సంతోషంగా ఉందంటారు.