కశ్మీర్ టు కన్యాకుమారి.. బైక్‌పై రోషిణీ ఒంటరి ప్రయాణం

నీ మీద నీకు నమ్మకం ఉంటే నీ కలలన్నీ సాకారమైనట్టే. తీరని కలలంటూ ఏవీ లేవు. ప్రయత్నిస్తే సాధ్యం కానివేవీ ఉండవు. మహిళలకు తమకేం కావాలో అది నెరవేర్చుకునే శక్తి సామర్ధ్యాలున్నాయి. అందుకోసం పోరాడే చాకచక్యముంది. ఈ విషయం పదే పదే నిరూపితమవుతూనే ఉంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ ఒంటరిగా బైక్ మీద వెళ్లి వచ్చిన రోషిణి శర్మ కథ వింటే అదే తెలుస్తుంది

0

రోషిణీ శర్మ ఉత్తరప్రదేశ్‌ లోని నరోరా అనే చిన్న టౌన్లో జన్మించింది. ఆమెకు ట్రెక్కింగ్‌ అన్నా ట్రావెలింగ్‌ అన్నా ఎంతో ఇష్టం. ఒంటరిగా ప్రయాణించాలంటే ఇంకా ఎంతో ఇష్టం. లేడీ చేగువేరాలా చరిత్ర పేజీల్లో చెరగని మోటార్ సైకిల్‌ డైరీస్

రాయాలన్న కోరిక. ఎన్నాళ్లిలా నాలుగ్గోడల మధ్య గొంగళి పురుగులా బతకడం. సీతాకోకచిలుకలా మారి అలా ఈ ప్రపంచం చుట్టేయాలి. కళ్లకు గంతలు విప్పేయాలి. హాయిగా ఆనందంగా ప్రపంచంతో కబుర్లాడేయాలన్న ఆశలామెవి. అవి నెరవేర్చుకునేందుకు రోషిణీ అనుక్షణం ప్రయత్నిస్తూనే వచ్చింది. అందులో భాగంగా మొదట బెంగళూరు పూణే, బెంగళూరు చెన్నై ఒంటరిగా బైక్ పై ప్రయాణాలు చేసింది. ఇలాగే దేశమంతా చుట్టేయాలన్న గట్టి తలంపుకొచ్చింది.

11 రాష్ట్రాలు 14 రోజులు. కన్యాకుమారి నుంచి లెహ్‌ వరకూ. మొత్తం 5453 కిలోమీటర్లు. ఇంజనీరింగ్ చదివిన శర్మ రూట్‌ మ్యాప్ రెడీ చేసింది. ఇది పైకి లాంగ్‌ ట్రిప్పే కానీ రోషిణీ విషయంలో మాత్రం అంతకన్నా ఎక్కువ. తన యాత్రలో సోషల్‌ అండ్‌ ఎమోషనల్‌ ఫీలింగ్స్ కలగలసి ఉంటాయి. తన ధ్యేయమల్లా ఒక్కటే.. ఒంటరిగా ఆడది రోడ్డు మీద తిరగడానికే కష్టం. అలాంటిది దేశమంతా చుట్టి రావడమా? అనే సోకాల్డ్‌ కామెంట్స్ కి చెక్ పెట్టాలి. ఇతర ఆడపిల్లలకు తానొక రోల్‌ మోడల్‌ కావాలి.

ఇలా తన లక్ష్యమేంటో చెప్పిందో లేదో బంధు మిత్రుల నుంచి తాను ఏవైతే వినకూడదనుకుందో ఆ మాటలన్నీ వినాల్సి వచ్చింది. అయినా ఇవేవీ లెక్క చేయకూడదని ముందుగానే డిసైడ్‌ కావడం వల్ల అసలవి ఇబ్బందిగానే అనిపించలేదు. అయినా ప్రతి ప్రయత్నం కాదూ.. కూడదూ.. అనే మాటల నుంచే మొదలవుతుంది. తన చుట్టూ ఉన్న వారి మాటలెలా ఉన్నా.. మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఒంటరి ప్రయాణం అందునా ఓ ఆడపిల్ల.. అది కూడా బైక్ మీద వెళ్లడం.. ఇబ్బందికరమన్న వాస్తవం తన స్పీడ్‌ కి బ్రేకులు వేసింది. ఈ ప్రాంతాల్లో ఆడవారి మీద అత్యాచారాలు ఎక్కువ. హత్య చేయడానికి సైతం వెనకాడని మృగాళ్లు తిరుగుతుంటారని చెబుతున్నాయి లెక్కలు. అసలు తాను నిరూపించదలుచుకుంది ఇదే కదా? గాంధీజీ కన్న కలలు నిజం కావాలంటే తాను బైకును ముందుకు నడిపించక తప్పదు. అలా జరగాలంటే ఎక్కడ కష్టాలుంటాయో.. ఆ రూట్‌ కే ఫిక్సవ్వాలనుకుంది శర్మ. 

ఆడవారి పాలిట వజ్రాయుధం పెప్పర్ స్ప్రే వెంట పెట్టుకుంది. అలాగని పెద్ద ప్రిపరేషన్లేవీ చేయలేదు. వాటర్ బాటిల్‌ వగైరా చిన్నా చితకా ఏర్పాట్లంతే. రాత్రి బస ఎక్కడ మంచిదో ఫ్రెండ్‌ నుంచి చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకోడం.. అక్కడ ఆగడం.. తిరిగి కిక్ కొట్టి బండిని రయ్ మనిపించడం. మధ్యలో అడవులూ ఇతర నిర్మానుష్య ప్రదేశాలొచ్చేసేవి. అక్కడి వాతావరణం చూసి ఒక్కోసారి భయం వేసేది. వెనక్కు వెళ్దామన్నా వెళ్లలేని పరిస్థితి. కొన్ని సార్లంతే ముందుకెళ్లడం మినహా మరో మార్గం ఉండదు.. అని దారి వెతుక్కుంటూ వెళ్లేది.

దారి వెంబడి ఎదురైన ప్రతి సవాలూ ఓ పాఠంలాంటిదే. ఇదీ జీవితమని గుణపాఠం నేర్పేదే. ఇంట్లో కూర్చుని టీవీల్లో గమనించడం వేరు. కొండా కోనలను ప్రత్యక్షంగా చూడ్డం వేరు. ఎవరి సాయం లేకుండా.. ఎంత దూరమైనా.. అన్న మాటే మంత్రంగా ప్రతి అడ్డంకీ ఇష్టంగా అదిగమిస్తూ ముందుకెళ్తూ ఉంటే.. ఆ ఫీలింగ్స్ ఇచ్చే ఎంజాయ్ మెంటే.. ఎంజాయ్ మెంట్‌ అనుకుంటూ ప్రయాణం సాగించింది శర్మ.

బంధు మిత్రులొక పక్క ఎగ్జైటింగా ఫీలవుతుంటే తాను మాత్రం ఉల్లాసంగా ఉత్సాహంగా యాత్ర చేయడానికే ఎక్కువ ఇంట్రస్ట్‌ చూపింది. అక్కడక్కడా కొన్ని స్థానిక పత్రికల్లో తన సాహసయాత్ర గురించి వార్తలు చూసి.. తనకు తానే భుజం చరుచుకుని సంబర పడింది రోషిణీ. మరి తనది ఒంటరి ప్రయాణం కదా? ఆ టైంలో మనకు మనం మెచ్చుకుంటూ ఎంకరేజ్ చేసుకుంటూ సాగాలి. తప్పదు.. రోషిణీ శర్మ ఈ టూర్ ప్లాన్ చేయడానికి ఎనిమిది నెలల సమయం తీసుకుందట. లక్ష రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయట. ఓ బైక్, కెమెరా, సెల్‌ ఫోన్.. ప్రయాణంలో ఆమె సాధనాలు. బండి మీద దూరతీరాలకు చేరడం.. అక్కడి ప్రకృతిని కెమెరాల్లో బంధించడం. ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం సెల్‌ ఫోన్ లో సంప్రదించడం.. ఇలా సాగింది రోషిణీ సాహస యాత్ర.

ఎండా, వానా, చలీ, బురదా, రాయి, రప్పా ఇలా ప్రతిదీ ఆమె ప్రయాణంలో ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నించినవే. ఆమె సామర్ధ్యానికి పరీక్ష పెట్టినవే. వాటన్నిటినీ ఏ మాత్రం లెక్క చేయక ఎంతో ఓపిగ్గా అన్నింటినీ దాటుకుని గమ్యం చేరింది రోషిణీ.

వెనుదిరిగి చూసుకుంటే 5 వేల కిలోమీటర్లు. వినేవాళ్లకెలా ఉంటుందో తెలీదుగానీ, తనకు మాత్రం చాలా ప్రశాంతంగా, సాధారణంగా అనిపించింది. అసాధ్యం సుసాధ్యమైందన్న ఉద్వేగాల్లాంటివేం లేవ్. అయితే ఫేస్ బుక్ లో స్టేటస్‌ అప్ డేట్‌ చేశాక మొదలైంది అభినందనల పరంపర. వాళ్లందరూ అలా మెచ్చుకుంటే, అప్పుడర్ధమైంది. తనది ఎంత పెద్ద యాత్రో. ఈ యాత్ర మధ్యలో పెప్పర్ స్ప్రే అవసరమే రాలేదు. అయినా మనస్సులో సంకల్పమనే ప్రేరణ ముందు ఈ స్ప్రే ఏపాటి..? ఇప్పుడు రోషిణీ శర్మ నెక్స్ట్ జర్నీ

ఎక్కడికో తెలుసా? యూరప్. ఆల్ ది బెస్ట్‌ రోషిణీ.. నువ్వు చంద్రమండలమైనా ఈజీగా చుట్టిరాగలవ్‌. వెళ్లిరా రోషిణీ వెళ్లిరా.. ప్రపంచమంతా నీ కళ్లతో చూసి, వాటికి నీవైన ఫీలింగ్స్ అద్ది.. మాకు పరిచయం చెయ్‌.. ఏమంటావ్‌!