కారుకి ఏం జరిగినా క్షణాల్లో అలర్ట్ చేసే పరికరాన్ని తయారు చేశారు

నలుగరు ఐఐటీయన్ల ఆవిష్కరణ కార్ నాట్

కారుకి ఏం జరిగినా క్షణాల్లో అలర్ట్ చేసే పరికరాన్ని తయారు చేశారు

Monday February 06, 2017,

3 min Read

ఇండియన్ ఫ్యామిలీలో కారు ఒక అపురూప ఆస్తి. చిన్నదో, పెద్దదో, లగ్జరీదో, బేసిక్ మోడలో.. చిన్న గీత పడితేనే తట్టుకోలేరు. రాంగ్ పార్కింగ్ పేరుతో ట్రాఫిక్ పోలీసులు లాక్కెళ్తే షేమ్ గా ఫీలవుతారు. డ్రైవర్ మిస్ యూజ్ చేస్తున్నాడని తెలిస్తే తట్టుకోలేరు. దొంగలు ఎత్తుకెళ్లిన సందర్భంలో ఇంటిల్లిపాదీ హైరానా పడే సీన్ ఇమాజిన్ చేసుకోవచ్చు. హైఎండ్ లగ్జరీ కార్ల సంగతి పక్కన పెడితే, బేసిక్ మోడల్ కార్లను కాపాడుకోవడం యజమాని బాధ్యతే. కానీ టెక్నికల్ సపోర్ట్ లేకుండా అదంత ఈజీ కాదు. అలాంటి సమస్యకు కార్ నాట్ అనే పరికరంతో కత్తిలాంటి పరిష్కారం కనిపెట్టారు నలుగురు ఐఐటీ స్టూడెంట్లు.

దొంగతనం జరిగినా, డ్రైవర్లు మిస్ యూజ్ చేస్తున్నారనిపించినా, మాల్ ఫంక్షన్స్, టోయింగ్ ఇలా సమస్య ఏదైనా ఆ చిన్నపరికం అలర్ట్ చేస్తుంది. కారుకి ఏం జరిగిందో చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్లో తెలిసిపోతుంది. అది కూడా రియల్ టైం అప్ డేట్ తో బజర్ మోగుతుంది.

image


పుష్కర్ లిమాయే, ప్రథమేష్ జోషి, ఉర్మిళ్ షా ఐఐటీ ముంబై స్టూడెంట్లు. ఇంకొకరు వడ్గాంకర్. అతడిది నాసిక్. అందరూ ఐఐటీయన్లు కావడంతో ఎమ్మెన్సీ కంపెనీల్లో ఉద్యోగాలొచ్చాయి. కానీ నలుగురికీ జాబ్ మీద అంతగా ఆసక్తి లేదు. కొత్తగా ఏదో సాధించాలనే తలంపు ఒక పట్టాన ఉండనీయలేదు. మనసంతా స్టార్టప్ మీదకు లాగింది. ఉద్యోగాలకు గుడ్ బై కొట్టారు. మంచినీళ్లు తాగినంత ఈజీగా జాబ్ వదిలేశారు కానీ, పేరెంట్స్ ని ఒప్పించడానికి మాత్రం మూడు చెరువుల నీళ్లు తాగారు. వాళ్లు ససేమిరా అన్నారు. నచ్చజెప్పడానికి తలప్రాణం తోక్కొచ్చింది. ఎలాగోలా వాళ్లు సరే అన్నారు.

2015 మే నెలలో పైలట్ ప్రాజెక్ట్ సిద్ధమైంది. డివైజ్ కి కార్నాట్ అని నామకరణం చేశారు. చూడ్డానికి ఇది చిన్న పరికరమే. ఓడీబీ పోర్టులో బిగించేలా తయారుచేశారు. కొన్ని అడిషనల్ సెన్సర్లు, టూజీ సిమ్ కార్డ్ ద్వారా కార్ నాట్ అల్గారిథమ్స్ కారుకి ఏం జరిగినా అలర్ట్ చేస్తాయి. యాక్సిడెంట్ దగ్గర్నుంచి వెహికిల్ థెఫ్ట్, మాల్ ఫంక్షన్స్, మిస్ యూజ్.. ఇలా ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా క్షణాల్లో చేతిలోని స్మార్ట్ ఫోన్ మోగుతుంది. దానికి సంబంధించిన యాప్ (ఐఓఎస్/ఆండ్రాయిడ్) డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంజిన్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా, బ్యాటరీ ఛేంజ్ చేసే టైమొచ్చినా డివైజ్ అలర్ట్ చేస్తుంది. మైలేజీ కూడా చెప్తుంది.

ఫైనల్ ప్రాడక్ట్ అనుకున్నంత ఈజీగా రాలేదు. ఎన్నో ప్రయత్నాలు. మరోన్నో ఫెయిల్యూర్స్. టెక్నికల్ ఇష్యూస్ ఒకదానివెంట ఒకటి వచ్చాయి. నాన్ స్టాండర్డ్ ఓబీడీ పోర్టుల మూలంగా అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. అయినా విసుగు చెందలేదు. ప్రాజెక్టుని మధ్యలో వదిలేయలేదు. బీటా వెర్షన్ లో ట్రై చేశారు. అలా ఐదు నెలల తర్వాతగానీ నమూనా తయారుకాలేదు.

image


2015 నవంబర్ లో ఫ్రీచార్జ్ ఫౌండర్లు కునాల్ సా, సందీప్ టాండన్ సీడ్ ఫండింగ్ చేశారు. మరోవైపు కస్టమర్ల అభిప్రాయాలను సేకరించారు. వారు ఈ డివైజ్ పట్ల ఏ మేరకు మొగ్గుచూపుతున్నారో తెలుసుకున్నారు. అలా కారు కొనేటైంలోనే ఈ డివైజ్ కొనేలా గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలను మనసులో పెట్టుకుని ధర నిర్ణయించారు. త్వరలో యాప్ ద్వారా డెలివరీ సర్వీసు కూడా తీసుకు రాబోతున్నారు. ప్రొడక్షన్ పెంచడానికి టెక్నికల్ టీమ్ ని ఎక్స్ పాండ్ చేశారు. రెండు నెలల్లోనే మార్కెట్లో పోటీకి నిలిచారు. ఇప్పటిదాకా 1,500 మంది యూజర్స్ ఉన్నారు. యూనిట్ బేసిస్ చూసుకున్నా బిజినెస్ లాభదాయకంగానే ఉంది.

త్వరలో టూ వీలర్ కి కూడా ఇలాంటి పరికరాన్ని తయారుచేయాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే, ఇప్పటిదాకా ఇండియాలో ఏ ద్విచక్ర వాహనానికీ కారుమాదిరి ఓబీడీ పోర్టు సదుపాయం లేదు. కాబట్టి ఇప్పట్లో అదంత ఈజీ కాదంటున్నారు.

ఇక మార్కెట్ సైజ్ చూసుకుంటే, ఇలాంటి పరికరాల బిజినెస్ 1బిలియన్ డాలర్ల పైనే ఉంది. కార్నాట్ కి పోటీగా ఆల్రెడీ కార్ ఐక్యూ ఉంది. ఆటోవిజ్, మిండా గ్రూపుకి చెందిన కార్రాట్ ఉండనే ఉంది. మ్యాప్ మై ఇండియా వారి డ్రైవ్ మేట్ ప్రాడక్ట్ కూడా మార్కెట్లో నడుస్తోంది. దాదాపు అన్ని కంపెనీల హార్డ్ వేర్ చైనా నుంచి తెచ్చి బిల్డప్ చేసిందే.

అయినా సరే, వచ్చే త్రైమాసికానికి బ్రేక్ ఈవెన్ పాయింటుకి చేరుకుంటామని కార్నాట్ టెక్నాలజీస్ సంస్థ ధీమా వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా మార్కెటింగ్ పెంచుకోవాలని భావిస్తున్నారు. 2017-18 ఆర్ధిక సంవత్సరానికి 2 మిలియన్ డాలర్ల బిజినెస్ చేయాలనేది నలుగురు కుర్రాళ్ల సంకల్పం.

వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి