ఇంటి భోజనం తినిపిస్తున్న ఈజీ ఖానా !

ఇంటి భోజనం తినిపిస్తున్న ఈజీ ఖానా !

Wednesday December 23, 2015,

2 min Read

ఇంటిభోజనం చేసి చాలా రోజలైంది గురూ! ఈ మధ్యకాలంలో తరచుగా వినిపిస్తున్న మాట ఇది. చదువు కోసమో, ఉద్యోగం కోసంవేరే చోట ఉండాల్సి వస్తోంది. ఆ పరిస్థితుల్లో మనకి నచ్చిన ఫుడ్ దొరకచ్చు. గత్యంతరం లేక అడ్డమైన తిండీ తినక తప్పదు. నచ్చింది దొరక్క.. నచ్చని దాంతో పడలేక చాలామంది సఫర్ అవుతున్నారు. ముఖ్యంగా టెకీలు, స్టూండెంట్లు. రూంలో చేయి కాల్చుకోలేక ఆఫీసులో కడుపు కాల్చుకుంటున్నారు. అలాంటి వారికోసమే పుట్టుకొచ్చింది ఢిల్లీ బేస్డ్‌ -ఈజీ ఖానా!

image


నచ్చంది తినలేక.. నచ్చింది దొరకక

ఆయుష్ ఆనంద్, పంకజ్‌ భాట్లా, విశ్రుత్‌ గవారీ! ముగ్గురూ ఫ్రెండ్స్. వారి ఆలోచనల్లోంచి పుట్టిందే ఈజీ ఖానా కాన్సెప్ట్‌. రోజూ ఆఫీసుల చుట్టూ తిరిగే డబ్బావాలాలు, కార్పొరేట్ ఆఫీసుల్లో కెఫెటేరియాలను చూసీచూసీ విసుగెత్తిపోయారు. వాళ్లు పెట్టింది తినలేక మనసుకి నచ్చిన ఫుడ్ దొరక్క ఎంతోమంది అవస్థలు పడటం వాళ్లు గమనించారు. ఉరుకుల పరుగల జీవితంలో అదంతా తప్పదు. అయినా కడుపుకి ఇంత తిననప్పుడు ఎంత గొడ్డు చాకిరీ చేసి ఏం లాభం? ఇంటి భోజనానికి మొహంవాచిన వారు ఎందరో! వీళ్లందరినీ దృష్టిలో పెట్టుకుని మొదలుపెట్టిన వ్యాపారమే ఈజీ ఖానా! వాస్తవానికి ఫుడ్‌ సప్లయ్ అనేది దేశంలో భారీ మార్కెట్. దాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలేంత సీన్ ఎవరికీ లేదు. మొత్తానికి మొత్తం కాకపోయినా దాన్ని ఎంతోకొంత ఆర్గనైజ్డ్‌ గా నడపాలనే ఈ రంగంలోకి దూకామంటారు ఆయుష్‌.

అనుకున్న టైంకి డెలివరీ

మొన్ననే, సెప్టెంబర్‌ లో ఒక చిన్న రూంలో ఆఫీస్ సెట్ చేశారు. టెక్నికల్ సపోర్టు కోసం శుభాంక్ శ్రీ వాత్సవను పెట్టుకున్నారు. ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేశారు. లాజిస్టిక్ దగ్గర్నుంచి డెలివరీ వరకూ ఈ ముగ్గురూ చూసుకుంటారు. ఆర్డర్లన్నీ వెబ్‌ సైట్లో ఉంటాయి. ఎప్పటికప్పుడు మెనూ మార్చుకుంటూ, అనుకున్న టైంకి డెలివరీ చేస్తూ, సేల్స్ పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

మొదట్లో భయం పట్టుకుంది

మొదట వ్యాపారం ఏమైపోతుందో అని భయపడ్డారు. ఎందుకంటే తొలి 20 రోజులు మొత్తం వచ్చిన ఆర్డర్లు నాలుగంటే నాలుగే. అంత ఘోరంగా మొదలైంది. అయినా వెనుకడుగు వేయలేదు. ఈజీ ఖానా గురించి ఆ నోటా ఈ నోటా పాకింది. మూడు నెలలు తిరిగేసరికి సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఎంతలేదన్నా రోజుకు 150 పైనే ఆర్డర్లు వస్తున్నాయి. అందులో రిపీట్ ఆర్డర్లు రోజుకి 50 శాతం ఉన్నాయని గర్వంగా చెప్తున్నాడు ఆయుష్‌.

ఫండింగ్‌ .. ఫ్యూచర్‌

తినే తిండితో ఫక్తు వ్యాపారం చేయడమంటే ముగ్గురికీ ఎక్కడో మనసు చివుక్కుమంది. అందుకే ఫుడ్ ఫర్ ఆల్ కాన్సెప్టుతో దయాగుణాన్ని కూడా చాటుకుంటున్నారు. మధ్యాహ్నం మూడు తర్వాత ఆర్డర్లు పోగా- మిగిలిన ఆహారాన్ని అనాథలకు, అన్నార్తులకు పంచుతారు. ఈ మధ్యే ఒక ఏంజిల్ ఇన్వెస్టర్ లక్ష డాలర్ల పెట్టుబడి పెట్టాడు. దాంతో వ్యాపారాన్ని మరింత విస్తారించాలనే ప్లాన్ ఉన్నారీ ముగ్గురు. టెక్నికల్ గా అప్ డేట్ అవుతూ డెలివరీని మరింత సులువు చేయాలన్నది వీరి ఆలోచన.

ఫుడ్ డెలివరీ సెక్టార్‌ అనేది నేడు రెండు బిలియన్ డాలర్ల మార్కెట్. ఏడాదికి అది 30-40 శాతం పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంటి భోజనాన్ని మిస్సయ్యే ప్రతీ వ్యక్తీ తమ కస్టమరే అంటాడు ఆయుష్‌.

“పని చేయడం ఎంత ఇంపార్టెంటో మనసుకి నచ్చింది తినడం కూడా అంతే ముఖ్యం. అలాంటి వాళ్లకోసమే మా టీం పనిచేస్తుంది”- ఆయుష్‌

మార్కెట్‌ లో విపరీతమైన పోటీ ఉంది. దాన్ని అధిగమించాలంటే క్వాంటిటీలో క్వాలిటీలో డెలివరీలో రాజీపడొద్దు. అందుకే సెంట్రలైజ్డ్‌ కిచెన్ ఏర్పాటు చేసి హబ్ అండ్ స్పోక్‌ మోడల్‌ లో ముందుకు పోతున్నామంటాడు ఆయుష్‌.