ఏఏ వస్తువులపై ఎంతెంత జీఎస్టీ విధిస్తారంటే..

ఏఏ వస్తువులపై ఎంతెంత జీఎస్టీ విధిస్తారంటే..

Wednesday June 14, 2017,

2 min Read

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఒకే దేశం-ఒకే పన్ను విధానానికి మరికొద్ది రోజులే సమయం మిగిలింది. జూలై1 నుంచి జీఎస్టీ పన్ను విధానం అమల్లోకి రానుంది. ఇప్పటికే వస్తువులు, సేవలపై పన్ను రేట్లు నిర్ణయించగా.. మరికొన్నింటిపై వచ్చిన అభ్యర్థనలు జీఎస్టీ కౌన్సిల్ పరిశీలిస్తోంది. దాదాపు వెయ్యి రకాల వస్తువులపై నాలుగు విధాల పన్ను వసూలు చేయనున్నారు.

image


ఇప్పటికే జీఎస్టీ కౌన్సిల్‌ పన్ను రేట్లను కూడా నిర్ణయించింది. ఐతే 133 రకాల వస్తువులపై అభ్యంతరాలు రాగా.. అందులో 66 రకాల వస్తువులపై పన్ను రేట్లను సవరించింది జీఎస్టీ కౌన్సిల్‌. మిగితా వాటిపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించారు.

నాలుగంచెల పన్ను విధానంలో అత్యవసర వస్తువులపై తక్కువ పన్ను, విలాసవంతమైన వాటిపై అధిక పన్ను వసూలు చేయనున్నారు. ద్రవ్యోల్బణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పలు రకాల ఆహారోత్పత్తులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు. నిత్యవసరాలపై కనిష్ట జీఎస్టీ వసూలు చేయనున్నారు.

జూలై1 నుంచి ఒకేపన్ను విధానం అమలు కానుండడంతో ఏయే వస్తువులపై ఎంత మొత్తం జీఎస్టీ వసూలు చేయనున్నారో ఒకసారి పరిశీలిస్తే..

జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చినవి

మాంసం, చేపలు, చికెన్‌, గుడ్లు, పాలు, మజ్జిగ, పెరుగు, తేనె, పండ్లతో పాటు కూరగాయలకు మినహాయింపు ఇచ్చారు. వీటితో పాటు పిండి, శనగలు, బ్రెడ్‌, పప్పు, ఉప్పులకు కూడా జీఎస్టీ ఉండదు. స్టాంపు, జ్యూడిషియల్‌ పేపర్లు, ప్రింటెడ్‌ పుస్తకాలు, గాజులు, చేనెత వస్త్రాలతో పాటు వెయ్యి రుపాయల లోపు హోటల్స్‌, లాడ్జీలకు కూడా మినహాయింపు నిచ్చారు.

ముడి డైమండ్లపై 0.25 శాతం, బంగారం, వెండిపై 3శాతం పన్ను విధించనున్నారు. ఐతే ప్రస్తుతం బంగారంపై 2 శాతం పన్ను వసూలు చేస్తుండగా. పలు రాష్ట్రాల్లో 6శాతం కూడా వసూలు చేస్తున్నారు. జీఎస్టీ అమలుతో పన్ను రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ప్రజలకు ఊరట కలగనుంది.

5శాతం జీఎస్టీ

వెయ్యి రుపాయలలోపు ప్యాకింగ్‌లో ఉన్న ఆహార పదార్థాలపై 5శాతం జీఎస్టీ విధించనున్నారు. దీంతో పాటు 500 రుపాయల లోపు చెప్పులు, శాండిల్స్‌, షూలతో పాటు పాలపొడి, బ్రాండెడ్ పన్నీరు, కాఫీ, టీ, పిజ్జా, కిరోసిన్‌, బొగ్గు, మెడిసిన్‌, స్టంట్‌, లైఫ్‌ బోట్స్‌, ట్రాన్స్‌ పోర్టు సర్వీస్‌ అంటే రైలు, విమాన ప్రయాణాలు, చిన్న రిస్టారెంట్లపై 5శాతం జీఎస్టీ విధిస్తారు. దాంతో పాటు డయాబెటిస్‌ పేషెంట్లు ఎక్కువగా ఉపయోగించి ఇన్సులిన్‌, అగరుబత్తీలపై కూడా 5శాతం జీఎస్టీ వసూలు చేస్తారు.

12శాతం జీఎస్టీ

మాంస ఉత్పత్తులు, వెన్న, పాలకోవా, నెయ్యి, డ్రై ఫ్రూట్స్‌, జంతువుల కొవ్వు, నామ్కీన్‌, ఆయుర్వేద మందులు, పళ్లపొడి, కలర్ బుక్స్‌, గొడుగులు, కుట్టు మిషన్లు, సెల్ ఫోన్స్‌, నాన్‌ ఏసీ హోటల్స్‌, బిజినెస్‌ క్లాస్ ఎయిర్ టికెట్స్‌, ఎరువులుపై 12శాతం జీఎస్టీ విధించనున్నారు.

18శాతం జీఎస్టీ

ఇక 500రుపాయలకు పైగా ఫుట్‌వేర్లపై 18శాతం పన్ను వేయనున్నారు. బీడీఆకులు, అన్ని రకాల బిస్కెట్స్, చక్కెర, మొక్కజొన్నతో తయారయ్యే చిరుతిళ్లు పై 18శాతం జీఎస్టీ విధిస్తారు. వీటితో పాటు జామ్స్‌, సాస్‌, సూప్‌, ఐస్ క్రీం, మినరల్ వాటర్‌ పై కూడా ఇదే పన్ను రేటును వసూలు చేయనున్నారు. టిష్యూ పేపర్‌, ఎన్వెలప్‌, నోట్‌ బుక్స్‌, కెమెరా, స్పీకర్స్‌, మానిటర్స్‌ తో పాటు ఏసీ బార్లు, టెలికాం, ఐటీ, ఫైనాన్స్‌ సర్వీసులపై 18శాతం ట్యాక్స్‌ వసూలు చేయనున్నారు.

28శాతం జీఎస్టీ

ఇక ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్కహాల్‌, బీడీలు, సిగరెట్లు, సిగార్లపై 28శాతం పన్ను వసూలు చేయనున్నారు. వీటితో పాటు చూయింగ్‌ గమ్‌, సారా తయారీలో ఉపయోగించే మొలాసిస్‌, పాన్‌ మసాలా, సోడా, హెయిర్ షాంపోలపై కూడా ఇదే రేటును విధిస్తారు. టైల్స్‌, వాటర్ హీటర్‌, వెయింగ్‌ మిషన్‌, వ్యాక్యూమ్‌ క్లీనర్‌, షేవర్స్‌, హెయిర్‌ క్లిప్పర్స్, ఆటో మోబైల్స్‌, మోటార్ సైకిల్స్‌, ప్రైవేట్‌ ఎయిర్ క్రాఫ్ట్‌, ఫైవ్ స్టార్ హోటల్స్‌, రేస్ క్లబ్స్‌, సినిమాలపై 28శాతం జీఎస్టీ విధించనున్నారు.