జయహో ఇస్రో..! జయహో భారత్..!!  

ఒకేసారి 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఇస్రో

0

అంతరిక్షంలో ఏ దేశమూ చేయని సాహసం..! ఇస్రో విజయ పరంపరలో నూతనాధ్యాయం..! అంతరిక్ష పరిశోధనారంగంలో దేశ చరిత సువర్ణ లిఖితం..! శతాధిక ఉపగ్రహాలను నింగిలోకి పంపించి.. ప్రపంచమే నివ్వెరపోయే సరికొత్త ప్రయోగాన్ని దిగ్విజయం చేసింది ఇస్రో! 104 ఉపగ్రహాలతో నిప్పులు చిమ్ముతూ తారాపథంలోకి దూసుకెళ్తున్న వాహననౌకను చూసి, యావత్ ప్రపంచం నిబిడాశ్చర్యంతో భారత్ వైపు చూసింది!! శాస్త్రసాంకేతిక రంగంలో దేశ సత్తా ఏంటో ఇస్రో మరోసారి విశ్వానికి చాటిచెప్పింది!

అంతరిక్ష పరిశోధనల్లో తిరుగు లేదని ఇస్రో మరోసారి నిరూపించింది. అగ్రదేశాలు కూడా చేయని సాహసం చేసి సక్సెస్అయ్యింది. పీఎస్ఎల్వీ-సీ37 రాకెట్ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపించింది. సరిగ్గా ఉదయం 9 గంటల 28 నిమిషాలకు ప్రయోగం మొదలైంది. దాదాపు 20 నిమిషాల వ్యవధిలో రాకెట్ నుంచి ఉపగ్రహాలు వేరయ్యాయి. మొత్తం నాలుగు దశల్లో రాకెట్ కక్ష్యలోకి చేరింది. ఒక్కో బాక్స్ లో 25 ఉపగ్రహాల చొప్పున మొత్తం నాలుగు బాక్సులను రాకెట్లో అమర్చారు.

ఇప్పటి వరకు ఒకేసారి 23 ఉపగ్రహాలను మాత్రమే పంపిన అనుభవం మాత్రమే ఇస్రోకు ఉంది. ఐతే ఒకేసారి 104 ఉపగ్రహాలు పంపించే విషయంలో ఇస్రో సక్సెస్ అయింది. అంతర్జాతీయంగా రష్యా మాత్రమే 37 ఉపగ్రహాలను ఒకే వాహక నౌక ద్వారా కక్ష్యలోకి పంపింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 29 ఉపగ్రహాలనే కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. తాజా ప్రయోగంతో భారత్అగ్రదేశాల రికార్డు బద్దలు కొట్టింది.

ఇస్రో అంతరిక్షంలోకి పంపిన 104 ఉపగ్రహాల్లో 101 విదేశాలకు చెందినవే. అమెరికా, ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్, కజకిస్థాన్, నెదర్లాండ్స్ యూఏఈ కి చెందిన ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిలో 96 ఉపగ్రహాలు అమెరికాకు చెందినవే కావటం విశేషం. మిగిలిన మూడు ఉపగ్రహాలు కార్టోశాట్ 2డి, ఐఎన్ఎస్1ఎ, ఐఎన్ఎస్1బి శాటిలైట్లను మన శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇందులో కార్టోశాట్ 2డి అత్యాధునిక కెమెరాలతో భూమికి సంబంధించిన కీలక సమాచారంతో పాటు ఐదేళ్లు సెన్సార్ రిమోట్ సేవలు అందించనుంది. మిగతా రెండూ నేవిగేషన్ వ్యవస్థకు సాయపడే నానో శాటిలైట్స్. మొత్తమ్మీద 1,378 కిలోల బరువు కలిగిన 104 ఉపగ్రహాలను భూమికి 505 నుంచి 524 కిలోమీటర్లు ఎత్తులోని సూర్యానువర్తన ధృవ కక్ష్యలో ప్రవేశపెట్టారు.

రాకెట్ ప్రయోగం సక్సెస్ కావటంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు. పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. అంతరిక్ష పరిశోధనల్లో తమ సంస్థ సాధిస్తున్న విజయాల పట్ల ఇస్రో చైర్మన్ కిరణ్ ఆనందం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తల సమష్టి కృషితోనే పీఎస్ఎల్వీ-సీ37 ప్రయోగం విజయవంతమైందని కిరణ్ కొనియాడారు. త్వరలో మరో సుదీర్ఘ ప్రయోగానికి రెడీ అవుతున్నామని, ఈ ఏడాది చంద్రయాన్-2 ను ప్రయోగించనున్నట్లు తెలిపారు.

పీఎస్ఎల్వీ-సీ37 ప్రయోగం విజయవంతమవడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఒకేసారి 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపి ప్రపంచ రికార్డు సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తలను మోడీ ట్విటర్ ద్వారా అభినందించారు. ఈ ప్రయోగం దేశానికి, మన అంతరిక్ష పరిశోధన రంగానికి గర్వకారణమని కొనియాడారు. మన శాస్త్రవేత్తలకు దేశం సెల్యూట్ చేస్తోందని ప్రధాని ట్వీట్ చేశారు.

పీఎస్ఎల్వీ సీ-37 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు హర్షం వ్యక్తం చేశారు. ఎంతో కఠినమైన ప్రయోగాన్ని సులభతరంగా సక్సెస్ చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంతో ఇస్రో ఖ్యాతి ఖండాంతరాలు దాటిందన్నారు.

భారతదేశాన్ని ప్రబలశక్తిగా నిలిపిన శాస్త్రవేత్తలకు వందనం.. శతకోటి వందనం. జయహో ఇస్రో.. జయహో భారత్..

Related Stories