గొర్రెలతో 25 వేల కోట్ల సంపద సృష్టించాలి- కేసీఆర్

0

గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. గొల్ల, కురుమ, యాదవులకు గొర్రెల పంపిణి చేసే పథకాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. 825 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను, ఇన్సూరెన్స్ పత్రాలను సీఎం కేసీఆర్ అందజేశారు.

అభివృద్ధి అంటే కేవలం పరిశ్రమలు పట్టణాలు మాత్రమే కాదు.. గ్రామాలు బలంగా ఉంటేనే నిజమైన అభివృద్ధి తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయ పడ్డారు. ఆర్థిక ప్రగతిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని గుర్తు చేశారు. 2024 నాటికి తెలంగాణ బడ్జెట్ రూ. 5 లక్షల కోట్లు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మూడేళ్ల తర్వాత ఇండియాలో అత్యంత ధనవంతులైన గొల్లకురుములు తెలంగాణలో ఉన్నారని చెప్పుకుంటారని కేసీఆర్ అన్నారు. రెండున్నర ఏళ్లలో గొర్రెలు మూడు ఈతల్లో ఏడున్నర కోట్ల జీవాలు అవుతాయని కేసీఆర్ తెలిపారు. గొల్లకురుమలు 25 వేల కోట్ల సంపదను సృష్టించబోతున్నారని సీఎం అన్నారు. గ్రామ సీమల్లోనే నైపుణ్యం కలిగిన మానవ వనరులున్నాయని ఆయన అభిప్రాయ పడ్డారు.

గొర్రె మందల దగ్గరికి వచ్చే వైద్యం అందించేందుకు ప్రతీ నియోజకవర్గానికి ఒక సంచార వైద్యశాల ఏర్పాటు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే 100 బస్సులకు ఆర్డర్ ఇచ్చామన్న కేసీఆర్.. అత్యవసర సేవల కోసం డయల్ 1962ను ఏర్పటు చేశామన్నారు. గ్రామీణ తెలంగాణ ధనవంతమైతేనే తెలంగాణ ధనవంతం అవుతుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

గొర్రెల పంపిణీ సందర్భంగా కేసీఆర్ గొల్లకురుమలను ఆప్యాయంగా పలకరించారు. వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. గొల్లకురుమలతో కలిసి ఫోటోలు దిగారు. రుమాలు, గొంగడి ధరించి ఒగ్గుడోలు వాయించారు.

Related Stories

Stories by team ys telugu