అనాథ రోగుల ఆకలి తీరుస్తున్న మనసున్న మారాజు!

దిక్కులేని వారికి పెద్దదిక్కుగా నిలుస్తున్న పాట్నావాసి-అనాథ రోగులకు గుర్మీత్ సింగ్ నిస్వార్థ సేవ -

0

కోట్లు మూలుగుతున్నా ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలని కలికాలమిది. అలాంటిది కుటుంబ పోషణ భారంగా మారినా.. అనాథలను ఆదుకోవాలన్న తపనతో ఓ మహా క్రతువును నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు పాట్నాకు చెందిన గుర్మీత్ సింగ్ . ఆకలితో అలమటిస్తున్న అనాథ రోగుల కడుపునింపుతూ వారందరికీ ఆత్మబంధువయ్యాడు.

జబ్బు చేసిన వారికి సపర్యలు చేయడమంటే మాటలు కావు. అదే ఆరోగ్యం విషమించి మృత్యువుకు దగ్గరైన వారికి.. అదీ ముక్కూ మొహం తెలియని వారికి సేవ చేయాలంటే ఎంతో పెద్ద మనసుండాలి. అలాంటి గొప్ప వ్యక్తుల కోవలోకి వస్తారు సర్దార్ గుర్మీత్ సింగ్. పాక్ మూలాలున్న గుర్మీత్ సింగ్ కుటుంబం మూడు తరాల క్రితమే పాట్నాలో స్థిరపడింది. మానవ సేవే మాధవ సేవ అని నమ్మే గుర్మీత్ సింగ్ చిరైయాంటాండ్ ప్రాంతంలో వస్త్ర దుకాణం నడిపుతున్నారు. ఆదాయం అంతంత మాత్రమే అయినా గత 25 ఏళ్లుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో అన్నార్తుల ఆకలి బాధలు తీరుస్తూ నిస్వార్థ సేవ చేస్తున్నారు.

అన్నం కోసం అలమటించే అనాథలు ఎక్కడున్నా అక్కడకు చేరుకుని వారి కడుపునింపుతారు సర్దార్ గుర్మిత్ సింగ్. అంతేకాదు.. మనుషులెవరూ కనీసం ఒక్క నిమిషం నిల్చునేందుకు ఇష్టపడని పాట్నా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లోని అనాథల వార్డులో మృత్యువుకు దగ్గరైన వ్యక్తుల ఆకలి తీరుస్తున్నారు. రోగులకు ఇంత రొట్టె తినిపించి తన పనైపోయిందనుకోకుండా వారు కూడా మనుషులేనన్న భావన కల్పిస్తున్నారు గుర్మీత్ సింగ్.

“నా జీవితంలో అప్పటి వరకు పరిచయంలేని వ్యక్తి చేసిన సాయం ఎన్నటికీ మరువలేనిది. జబ్బుపడిన సోదరి చికిత్స కోసం నానా తంటాలు పడుతున్న సమయంలో ఆయన ఆపద్భాందవుడిలా ఆదుకున్నారు. ఆ సమయంలో డబ్బు లేక నేను పడిన అవస్థ వర్ణనాతీతం. డబ్బు మనిషిని ఎంత నిస్సాహాయున్నిచేస్తుందో నాకు అప్పుడే అర్థం అయింది. ఆయన చేసిన కేవలం మాకు ఆర్థిక సాయం మాత్రమే చేయలేదు. నా సోదరి జీవితాన్ని దానం చేశారు. ఆ తర్వాత ఆయనెప్పుడూ కనిపించలేదు”.- గుర్మీత్ సింగ్

పరిచయంలేని వ్యక్తి తనకు చేసిన సాయాన్ని స్పూర్తిగా తీసుకుని జీవితాన్ని మానవ సేవకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు గుర్మీత్ సింగ్. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా చివరకు ప్రళయం వచ్చినా పాట్నా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లోని అనాథల వార్డులో రోగులు ఆకలితో అలమటించే పరిస్థితి రానివ్వరు గుర్మీత్ సింగ్. ఎవరి నుంచి ఆర్థిక సాయం ఆశించకుండానే గత 25 ఏళ్లుగా ఆయన ఈ సేవ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 100 మంది సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యేందుకు గుర్మీత్ సాయం చేశారు. ఆరోగ్యం కుదుటపడిన రోగులను వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు.

ఆదాయం అంతంత మాత్రంగానే ఉండటంతో మొదట్లో అనాథల ఆకలి తీర్చేందుకు ఎన్నో అవస్థలు పడ్డారు సర్దార్ గుర్మీత్ సింగ్. చేతిలో డబ్బుల్లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక దశలో కుటుంబ సభ్యులు కూడా ఆయనకు సహకరించేందుకు నిరాకరించారు. అయినా పట్టువీడకుండా సేవ కొనసాగించారు. ఇంట్లో తినేందుకు తిండి గింజ లేని పరిస్థితి తలెత్తినా ఎలాగోలా డబ్బు సర్దుబాటు చేసి సరుకులు, కూరగాయలు కొని ఇంట్లోనే వండించి ఆకలి తీర్చిన గొప్ప మనసున్న మనిషి గుర్మీత్ సింగ్. అనాథల వార్డులో కనీసం తమంతట తాము తిండి తినలేని స్థితిలో ఉన్న రోగులే ఎక్కువగా ఉంటారు. అలాంటి వారికి స్వయంగా తినిపించి, పడుకునేందుకు పక్క సర్ది, వారి బట్టలు ఉతికే గుర్మీత్ గంటల తరబడి వారితోనే గడువుతారు. పండగల్ని సైతం వారితోనే జరుపుకుంటారు. గుర్మీత్ సింగ్ కు ఐదుగురు కొడుకులున్నారు. పెద్ద కొడుకు పెళ్లి రోజున కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులంతా పెళ్లి హడావిడిలో ఉంటే గుర్మీత్ మాత్రం హాస్పిటల్ లో రోగుల ఆకలి తీర్చే పనిలో ఉన్నారు. రోగులకు అన్నం పెట్టి మిఠాయిలు తినిపించి వారితో తన ఆనందం పంచుకున్నారు. ఆ తర్వాత పెళ్లికి హాజరయ్యారు.

నేను బిజీగా ఉండి హస్పిటల్ కు వెళ్లలేని పరిస్థితి ఉంటే నా పెద్ద కొడుకు హర్ దీప్ సింగ్ ఆ పని పూర్తి చేస్తాడు. గురునానక్ బోధనల ప్రభావంతోనే మానవ సేవ చేస్తున్నాను. రోగులకు అన్నం పెట్టడం నా కర్తవ్యంగా భావిస్తాను. - గుర్మీత్ సింగ్

జబ్బుతో బాధపడుతున్న అనాథల గురించి సమాచారం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకునే గుర్మీత్ వారిని హాస్పిటల్ లో చేర్చి ట్రీట్ మెంట్ చేయిస్తారు. ఆరోగ్యవంతులైన తర్వాత వారిని ఇంటికి చేరుస్తారు. సమాజం కోసం ఏదో చేయాలనుకునే వారికి గుర్మీత్ సింగ్ ఆదర్శంగా నిలుస్తున్నరు. సమాజ సేవ చేయాలంటే ఉండాల్సింది ధృడ నిర్ణయం, నిస్వార్థ భావన అని చెప్పే గుర్మీత్ బాధలో ఉన్న మనిషికి సాయం చేసి వారి ముఖంలో చిరునవ్వు చూసినప్పుడు కలిగే సంతోషం ముందు ఇంకేవీ సాటిరావంటారు. జీవితంలో తాను కోరుకునే అతి పెద్ద ఆనందం అదేనంటారు.

స్వార్థం రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో ముక్కూ మొహం తెలియని వారి కోసం ఇంతగా తపన పడుతున్న గుర్మీత్ సింగ్ చేస్తున్న సేవ అభినందనీయం. ఆయనను ఆదర్శంగా తీసుకుని మరికొందరు ఇదే బాటలో నడిచి దిక్కులేని వారికి పెద్దదిక్కవాలని ఆశిద్దాం.