పొలిటికల్ స్టార్టప్ ఆమ్ ఆద్మీకి స్ఫూర్తి ఎవరంటే..

"ఆప్" ముందడుగుపై అశుతోష్ మనసులో మాట...

Monday April 04, 2016,

4 min Read


ఎన్డీటీవీ వాక్ ద టాక్ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా .. ఓసారి కాలేజీ కుర్రాళ్లలా ఉన్న ఇద్దరిని ఇంటర్వ్యూ చేయడం చూశా. నిజానికి నేను వాక్ ద టాక్ కార్యక్రమానికి రెగ్యులర్ ప్రేక్షకుడిని ఏమీ కాదు. కానీ ఆ ఇద్దరు కుర్రాళ్ల ఆలోచనలు, చెబుతున్న విషయాలు చూస్తే అలా చూస్తూ ఉండాలనిపించింది. తర్వాత తెలిసిందేమిటంటే ఆ ఇద్దరూ దేశంలోనే అగ్రశ్రేణి ఈ-కామర్స్ కంపెనీల్లో ఒకటైన స్నాప్ డీల్ వ్యవస్థాపకులు కునాల్ బన్సల్, రోహిత్ బన్సల్. 2,75,000 మంది అమ్మకందారులు, 30 మిలియన్ల ఉత్పత్తులు, 6వేల పట్టణాలను కలుపుతున్న ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్. ఈ ఘన విజయం కేవలం ఆరేళ్లలోనే సాధ్యమయింది. బిజినెస్ మ్యాగ్నెట్స్ గా మారిన వీరిద్దరూ ఇప్పటికే 30 ఏళ్లకు అటూఇటూగా ఉన్నవారే.

వారిద్దరూ శేఖర్ తో మాట్లాడుతున్న సమయంలో... తాము ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను వివరించారు. స్టార్టప్ కంపెనీ ప్రారంభించాలనుకున్న తర్వాత, ప్రారంభించిన తర్వాత ఎన్నోసార్లు ఇక మా పని అయిపోయిందనుకున్న సందర్భాలు ఉన్నాయన్నారు. వారిద్దరూ ఓ సందర్భాన్ని వివరించారు. 2007లో స్నాప్ డీల్ నడకలు ప్రారంభించిన మొదట్లో.. చేతిలో రూ.50 వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. కానీ తర్వాత రోజు ఉద్యోగులకు రూ.5 లక్షల రూపాయలు జీతాలు చెల్లించాల్సి ఉంది. అప్పుడే స్టార్టప్ బాధలు ఎందుకు..? హాయిగా ఉద్యోగం చేసుకోవడం మంచిదనే ఆలోచన వారికి రావచ్చు. కానీ వారు మాత్రం ధైర్యం కాల్పోలేదు. మిత్రుల దగ్గర అప్పులు చేసి జీతాలు చెప్పించారు. తమపై నమ్మకంతో సంస్థను కొనసాగించారు. అనితర సాధ్యమైన విజయాలను సాధించారు. స్నాప్ డీల్ ఓ రేంజ్ కి ఎదిగిన తర్వాత కూడా అంటే 2013లో కూడా వారిద్దరూ సేమ్ అలాంటి పరిస్థితినే చూశారు. చేతిలో లక్ష డాలర్లు ఉంటే తర్వాత రోజు ఐదు లక్షల డాలర్లను జీతాల కోసం జమ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈసారి వారు గతంలోలా టెన్షన్ పడలేదు. తమ అనుభవంతో ఆ ఇబ్బందిని తేలిగ్గానే పరిష్కరించారు. ఇలాంటి పరిస్థితుల గురించి టెన్షన్ పడి... నమ్మకం వదిలేసుకుంటే వారు ఈ రోజు ఈ స్థితిలో ఉండేవారా...?

వీరి అనుభవాలు చూసిన తర్వాత నాకు ఆప్ ప్రస్థానమే గుర్తొచ్చింది. ఆప్ ని ఓ స్టార్టప్ గా భావిస్తే స్నాప్ డీల్ ఎన్ని కష్టాలు పడిందో అన్నీ ఆప్ కూడా భరించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ...అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి ఆవిర్భవించింది. దేశవ్యాప్తంగా ప్రజల్లో అవినీతిపై ఉన్న వ్యతిరేకత అన్నా ఉద్యమంతో బయటకు వచ్చింది. అన్నా ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రజలను ఆకర్షించింది. అయితే అరవింద్ కేజ్రీవాల్ రాజకీయపార్టీ ఏర్పాటు చేయాలనుకున్న సమయంలో అన్నా ఉద్యమంలో చీలిక వచ్చింది. రాజకీయ పార్టీ పెట్టవద్దని.. పెడితే తన మద్దతు ఉండదని అన్నా హజారే కేజ్రీవాల్ కు స్పష్టంగా చెప్పారు. అన్నా హజారే... ఓ మహత్మ గాంధీ.. ఓ జయప్రకాష్ నారాయణ్ గా మంచి ఫాలోయింగ్ ఉన్న నేత. ఆయన లేకుండా ముందుకు వెళ్లే ఆలోచన చేయడం ఆ పరిస్థితుల్లో అసాధ్యమనిపించింది. ఎలా చెప్పినా ఆయన వినే పరిస్థితుల్లో లేరు. అప్పటికే ఉద్యమం ఔచిత్యం కోల్పోయింది. ఇక రాజకీయాలే మార్గమని అరవింద్ కేజ్రీవాల్ గట్టిగా నమ్మారు. దేశం నుంచి అవినీతి మురికిని కడగాలంటే రాజకీయ పార్టీ పెట్టాల్సిందేనని కేజ్రీవాల్ తో పాటు అతని బృందం గట్టిగా భావిస్తోంది. అయితే అన్నా హజారే లేకుండా ఇది సాధ్యమా.. అనేది మొదటి సందేహం. హజారే లేకుండా పార్టీ పెట్టడం ఆత్మహత్యా సదృశమేనని చాలామంది వారించారు. అయితే చివరికి అన్నాహజారే లేకుండా పార్టీ ప్రారంభించాలని కేజ్రీవాల్ బృందం నిర్ణయించుకుంది.

ఢిల్లీనే మొట్టమొదటి కార్యక్షేత్రంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఎన్నికలు ఏడాది తర్వాత ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీని ప్రకటించి మెల్లగా ఒక్కో వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటూ పోయాం. మా ఆశయాలు నచ్చిన వారందరూ పార్టీ కార్యకర్తలు చేరారు. అందరూ ఢిల్లీలో సంప్రదాయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ఆప్ మాత్రమే ప్రత్యామ్నాయమని చెప్పేలా ప్రచారం ప్రారంభించారు. అయిదే ఇది చాలా క్లిష్టమైన అంశం. అవినీతికి వ్యతిరేంగా ఆప్ పై ఢిల్లీ ప్రజలకు ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ఇది అందరికీ తెలుసు. అయితే కాంగ్రెస్, బీజేపీలను ఆప్ ఓడించగలదని వారికి నమ్మకం కలిగించడమే మాకు అతి కష్టమైన పనిగా మారింది. దశాబ్దాల తరబడి ఎన్నికల రాజకీయంలో పండిపోయిన కాంగ్రెస్, బీజేపీలను తట్టుకుని నిలబడగమా.. అతి సాధ్యమా..?

అయితే ఆప్ సభ్యులందరికీ విజయంపై నమ్మకముంది. అందుకే ఒక్క శాతం కూడా నిర్లక్ష్యం లేకుండా సిన్సియర్ గా ప్రయత్నాలు చేశాం. విశ్లేషకులు, అంచనాలు వేసేవాళ్లు... ఆప్ కు నాలుగు సీట్లు వస్తే గొప్ప అన్నట్లు ప్రచారం చేశారు. కానీ ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అన్నాహజారే మద్దతు ఇవ్వకపోయినా ఇది సాధ్యమైంది. ఈ విజయం కునాల్ బల్, రోహిత్ బన్సాల్ చెప్పిన అనుభవాన్ని పోలినట్లు లేదూ.. ?

అయితే అధికారాన్ని చేపట్టిన 49 రోజులకే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం రాజీనామా చేసింది. ఆప్ పని పోయిందని రాజకీయ నిపుణులు, విశ్లేషకులు ప్రచారం ప్రారంభించారు. అప్పుడు అది అంతా మోదీ మయం. మోదీని ఏకైక లీడర్ గా ప్రొజెక్ట్ చేస్తూ బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. మోదీ ప్రభంజనంలో ఆప్ కూడా కొట్టుకుపోయింది. ఢిల్లీలో ఒక్క స్థానాన్ని కూడా అందుకోలేకపోయింది. దాంతో వారు మరింత రెచ్చిపోయారు. ఆ తర్వాత వచ్చిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఘనవిజయం సాధించింది. మోదీ చరిష్మా మరింత పెరిగింది. ఐదవ రాష్ట్రం ఢిల్లీ. అక్కడే అవే ఫలితాలు వస్తాయని విశ్లేషకులు చెప్పుకుంటూ వస్తున్నారు. పైగా కేజ్రీవాల్ తొందరపడి రాజీనామా చేశారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.

అయినా మేం నమ్మకాన్ని కోల్పోలేదు. మా ఆలోచనల్లో కూడా మార్పు రాలేదు. మేం అవినీతికి పాల్పడకుండా ప్రజల కోసం ఏం చేయాలో అన్నీ అన్నీ చేయడానికి ప్రయత్నించాం. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఏ మాత్రం సంకోచించకుండా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా విషయంలో ప్రజలకు క్షమాపణలు చెప్పాం. ఢిల్లీ కోసం... ఢిల్లీ ప్రజల కోసం మాకో ఎజెండా ఉందని స్పష్టంగా చెప్పాం. అయితే గత 30ఏళ్లలో లేని విధంగా అత్యంత పవర్ ఫుల్ ప్రధాని ఉన్నారు. ఆయన పార్టీ ఢిల్లీ పీఠం కోసం అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోంది. బీజేపికి అన్ని రకాల వనరులూ ఉన్నాయి. మా దగ్గర ఏం ఉన్నాయి..? మనీ లేదు కానీ అంతకు మించి ఆప్ కోసం పనిచేసే వలంటీర్స్ ఉన్నారు. ప్రజలు మా మాటలను నమ్మారు. మోదీ మేనియా అంతా ఉత్తదేనని నిరూపించారు. ఢిల్లీ అసెంబ్లీలో మూడు సీట్లు తప్ప మిగిలినవన్నీ ఆప్ కే కట్టబెట్టారు ప్రజలు.

ఆప్ సామాన్యుల కోసం పనిచసేస్తున్న పార్టీ. భారత్ రాజకీయ గమనాన్ని ఆప్ మార్చగలదు. నిజాయితీ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం... ఆమ్ ఆద్మీ. అధికారాన్ని సామాన్యుడికి దగ్గరకు చేయడమే ఆప్ పని. ఢిల్లీ వ్యూహాన్నే ఇప్పుడు పంజాబ్ లోనూ అమలు చేయడానికి ఆప్ ప్రయత్నిస్తోంది. పరిస్థితులూ అలాగేఉన్నాయి. పంజాబ్ లోనూ ఢిల్లీ తరహా విజయమే ఆప్ నమోదు చేయనుంది.

శేఖర్ గుప్తా ప్రోగ్రామ్ లో వారు చెప్పినట్లు... మొదటిసారి స్నాప్ డీల్ ఫౌండర్స్ ఇద్దరికి కష్టాలు వచ్చినప్పుడు వెనక్కి పారిపోయే ఇప్పుడు స్నాప్ డీల్ ఉండేదా..? రాజకీయ స్టార్టప్ అయిన ఆప్ కూడా అంతే...! మా పని అయిపోయిందని అంతా ప్రచారం చేసినప్పుడే మేం డీలాపడిపోతే విజయం దక్కేదా..? అంతా... మనపైన మనం పెట్టుకున్న నమ్మకాన్ని.. పని పట్ల చూపే ఆసక్తిని బట్టి ఉంటుంది. కునాల్, రోహిత్ విజేతలు. ఆప్ కూడా..!

రచయిత: అశుతోష్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత

అనువాదం: సౌజన్య