స్వచ్ఛంద సంస్థలను సక్సెస్ చేసే కన్సల్టెన్సీ ఇది !

స్వచ్ఛంద సంస్థలను సక్సెస్ చేసే కన్సల్టెన్సీ ఇది !

Tuesday September 01, 2015,

4 min Read

సైకిల్ ఫ్రేమ్స్ తయారు చేసేందుకు వెదురు కర్రలను ఉపయోగించే మణిపూర్ వర్కర్ల కోసం.. సౌత్ ఏషియన్ బాంబూ ఫౌండేషన్(SABF) ప్రారంభించారు కామేష్ సలాం. ఈ సంస్థ వెదురు సైకిళ్లను మార్కెట్ చేస్తుంది. అదే సమయంలో వెదురు వాడకాన్ని ప్రోత్సహించడంపై ప్రచారం చేస్తుంది. అయితే ఎస్ఏబీఎఫ్ ఆశించిన స్థాయి ఫలితాలు సాధించలేకపోవడంతో... కన్సల్టింగ్ ఫర్ సోషల్ గుడ్ (CSG) రంగంలోకి దిగింది. అద్భుతమైన రిజల్ట్స్ అందుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తాము సామాజిక సంస్థలకు ఏ విధంగా సహాయపడగలమో సీఎస్‌డీ సహ వ్యవస్థాపకుడు శివధావన్ వివరిస్తున్నారు.

"ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తూ, విజయం సాధించిన అనేక స్వచ్ఛంద సంస్థల వివరాలు తెలుసుకున్నాం. బాంబూ టెక్నాలజీస్‌లో నిపుణులైన ప్రొఫెసర్ వి.ఎం. చారియర్‌ను సంప్రదించాం. ఈయన ఐఐటీ ఢిల్లీలో సెంటర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీకి ఫ్యాకల్టీగా విధులు నిర్వహిస్తున్నారు. సైకిల్స్‌ను షేర్ చేసుకోవం ద్వారా.. ఆదాయం ఆర్జించవచ్చనే ఆలోచనను ప్రతిపాదించాం. తాజ్‌మహల్‌తోపాటు.. టూరిస్టులు అధికంగా వచ్చే ఇతర హెరిటేజ్ ప్రాంతాలను.. ఈ సైకిళ్లకు స్టాండ్స్‌గా గుర్తించాం. దీనికి సంబంధించిన ప్రతిపాదనను తయారు చేసి.. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు అందించాం. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నాం."-శివ ధావన్

సీఎస్‌జీ అందించిన విలువైన సూచనలపై కామేష్ ఇలా స్పందించారు. “వెదురు ఉత్పత్తులకు సరైన మార్కెట్ ఎక్కడ లభిస్తుందో మాకు తెలియచేశారు. ప్రపంచవ్యాప్తంగానూ, మన చుట్టూ ఉన్న సమాజంలో ఎప్పుడేం జరుగుతోందో, దేనికి ఎలా ప్రతిస్పందిచాలో తెలిసిన యువ మేథావులు సీఎస్‌జీలో ఉన్నారు. ఈ కాలం యువతకు, ప్రజలకు ఏం కావాలో... దానికి తగినట్లుగా సూచనలు అందించడం వీరి ప్రత్యేకత. మాకు ఇలాంటివన్నీ తెలియవు. మా ఉత్పత్తులను సరైన ప్రాంతంలో విక్రయిస్తే... ఎలాంటి మార్కెట్ ఉంటుందో తెలియచేసి, మాకు సాయం చేసిన సీఎస్‌జీకి కృతజ్ఞతలు”

శివ ధావన్

శివ ధావన్


దేవ్ ప్రియమ్

దేవ్ ప్రియమ్


సీఎస్‌జీ వెనుక కథ

దేవ్ ప్రియమ్, శివ ధావన్‌లు.. 2014 జనవరిలో కన్సల్టింగ్ ఫర్ సోషల్ గుడ్‌ను ప్రారంభించారు. అప్పటికి వారింకా ఢిల్లీ ఐఐటీలో విద్యార్ధులే. సీఎస్‌జీని ప్రారంభించే ముందు.. వీరిద్దరూ కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేశారు. స్వచ్ఛంద సంస్థలు-స్టూడెంట్స్ మంచి భాగస్వామ్యం కాదనే విషయం వారికప్పుడే అర్ధమైందట. సాంకేతిక ప్రతిభ, అనుభవంతోపాటు.. విద్యార్ధులను కలుపుకుంటేనే సామాజిక రంగంలో మంచి ఫలితాలు సాధించగలమని తెలుసుకున్నట్లు చెబ్తున్నారు శివ.

"2012, 2013 సమ్మర్‌లో ఎన్‌జీఓలతో కలిసి పనిచేసిన కొంతమందిని ఇంటర్వ్యూ చేశాను. అయితే.. ఆశించిన స్థాయిలో అనుభవం రాకపోయినా.. సామాజిక బాధ్యత వారిలో కొంత రూపుదిద్దుకుంది. స్వచ్ఛంద సంస్థల అవసరాలను తీర్చేందుకు వీలుగా.. ప్రతిభావంతులైన విద్యార్ధులను మార్చేందుకు ఒక సంస్థ అవసరమని అప్పుడే గుర్తించాను" అన్నారు దేవ్.

సీఎస్‌జీ ప్రధానోద్దేశ్యం

సమాజంలో మార్పు కోసం ప్రయత్నించే అనుభవజ్ఞులైన కార్పొరేట్ కన్సల్టెంట్స్‌, కాలేజ్ స్టూడెంట్స్‌కు మధ్య లాభాపేక్ష లేని వారధి కన్సల్టింగ్ ఫర్ సోషల్ గుడ్. స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలకు మరింత మెరుగులు దిద్దడం, వాటిని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేందుకు తగినన్ని సలహాలు, సూచనలు చేయడమే కాకుండా.. పలు కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటాం అన్నారు దేవ్.

“ఆయా పరిశ్రమలపై తగినంత పరిశోధన, గణాంకాల విశ్లేషణ తర్వాత.. ఎన్‌‌జీఓలు అనుసరించాల్సని వ్యూహాలను ప్రతిపాదిస్తాం. విద్యార్ధులు ఆయా సంస్థలకు ప్రతినిధులుగా వ్యవహరిస్తూ.. నిధుల సేకరణ, నెట్‌వర్క్ విస్తరణలు చేసేలా ఒక కార్యక్రమాన్ని రూపొందించాం”- దేవ్.

ప్రారంభించినప్పటి నుంచి సీఎస్‌జీ మెంబర్లు.. అనేక సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేశారు. ఐఐటీ ఢిల్లీలో సివిల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది ప్రియల్ మొత్వాని. ఈమె ఉరవు అనే ఎన్‌జీఓకు సహాయం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగావకాశాలు ప్రోత్సహించాలనే అంశంపై.. ప్రజలు, ప్రభుత్వం, వ్యాపారులతో కలిసి చర్యలు చేపడుతూ ఉంటుంది ఉరవ్.

షహీద్ సుఖ్‌దేవ్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ స్టడీస్‌లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న సుక్రుతీ గోయల్... సీఎస్‌జీ మరో మెంబర్. ఈమె ఆరోహణ్ లెర్నింగ్ సెంటర్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తోంది. పీపుల్ ఫర్ పారిటీ, సేవ్ ద చిల్డ్రన్, యూత్ ఫర్ సేవ వంటి మరికొన్ని స్వచ్ఛంద సంస్థలతోనూ వీరు భాగస్వామ్యం అయ్యారు.

ఇంతగా సమాజం కోసం పాటుపడే సంస్థను ఏర్పాటు చేసిన వీరు.. ఎంత అనుభవజ్ఞులో అనిపిస్తోందా... ప్రస్తుతం దేవ్ వయసు 23ఏళ్లు కాగా... శివ ఏజ్ 22మాత్రమే. వీరు దేశంలో టాప్ కన్సల్టెన్సీగా గుర్తింపు పొందిన సంస్థలో ఫుల్‌టైం జాబ్ చేస్తూ... ఇలా ఎన్‌జీఓ, స్వచ్ఛంద సంస్థలకు సాయం చేస్తున్నారు.

కన్సల్టింగ్ ఫర్ సోషల్ గుడ్ టీం ఇదే

కన్సల్టింగ్ ఫర్ సోషల్ గుడ్ టీం ఇదే


విజయావకాశాలు ఎన్నో?

ప్రస్తుతం దేవ్, శివలు కాలేజ్ స్టూడెంట్స్ కాదు. కాలేజ్ రోజుల మాదిరిగా... ఇష్టం వచ్చినట్లుగా టైం కేటాయించడం కుదరదు. అయినా సరే... సీఎస్‌జీని మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామంటారు ఈ ఇద్దరు మిత్రులు.

"ఇక్కడ పనిచేస్తున్న స్టూడెంట్స్‌కి కోర్ టీం దగ్గరుండి సహకారం అందిస్తారు. అందిరికీ ఈ సంస్థ భవిష్యత్తు మీదా, సాధించబోయే ఫలితాలమీదా పూర్తి నమ్మకం ఉంది. కొత్త రిక్రూట్‌మెంట్ కూడా ముందుగా నిర్ణయించిన క్రమ, కఠిన పద్ధతిలోనే జరుగుతుంది. ప్రతీ ఏడాది ప్రాజెక్టుల నిర్వహణతోపాటు.. మెంటార్స్‌గా పనిచేసేందుకు కొత్త ప్రెసిడెంట్, కోర్ టీం నియమించుకుంటాం. కన్సల్టెంట్లుగా వ్యవహరించేందుకు ముందుకొచ్చే విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కాలేజ్, కార్పొరేట్ ఉద్యోగం పూర్తయ్యాక... మిగిలిన సమయంలో మార్గదర్శకులుగా వ్యవహరించేందుకు ముందుకొస్తున్నారు" అని చెప్పారు శివ.

స్టూడెంట్ టీంని విజయవంతమైన మెంటార్లుగా తీర్చిదిద్దడమే మా పని. క్లయింట్‍‍కి ప్రాజెక్టును సంతృప్తికర స్థాయిలో అందించేందుకు... ప్రతీ వారాంతంలోనూ టీం మీటింగ్స్ నిర్వహిస్తాం. క్లయింట్‍తో ప్రతీ పదిహేను రోజులకొకమారు భేటీ అవుతాం - శివ ధావన్

వనరులు-సవాళ్లు

సీఎస్‌జీకి సంబంధించిన ఆర్థిక అంశాలను పరిశీలిస్తే.. ఇప్పటివరకూ సొంత నిధులతోనే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆర్థిక స్థిరత్వాన్ని సాధించేవరకూ.. భాగస్వాముల అవసరం ఉందంటున్నారు దేవ్. అయితే.. దీర్ఘ కాలంలో మాత్రం.. సొంతగానే నిలబడేలా సీఎస్‌జీని తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం.”అని చెప్పారు శివ.

"స్టూడెంట్స్‌కు స్కిల్ డెవలప్‌మెంట్, ట్రైనింగ్ ఇచ్చే విషయంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రతీ ఏటా కొత్తవారిని రిక్రూట్ చేసుకోవడం, అనుభవజ్ఞులైన గ్రాడ్యుయేట్స్ వెళ్లిపోతుండడంతో.. ప్రొఫెషనల్స్ సంఖ్య పెరగడం లేదు. ఈ రెండు విభాగాల మధ్య సమతుల్యం పాటించాల్సిన అవసరం ఉంది. అప్పుడే నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్, స్కిల్ డెవలప్‌మెంట్ సెషన్స్‌ను సమగ్రంగా నిర్వహించగలుగుతాం" అంటున్నారు దేవ్.

ఇప్పటి విద్యార్ధుల్లో సమాజం ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను డీల్ చేయాలనే తపన కనిపిస్తోంది. వాటికి తమ దగ్గర పరిష్కారాలు ఉన్నాయని, వాటితో సమాజాన్ని మార్చగలమనే నమ్మకం వారిలో ఉంది. దీంతోపాటు నిజమైన ప్రపంచాన్ని దగ్గరగా చూసే అవకాశం రావడం.. విద్యార్ధులకు వాస్తవాలపై కళ్లు తెరిపించే విషషమే. తమ కెరీర్‌ను ఎంచుకునేందుకు ఈ కాన్సెప్ట్ సహాయపడుతోంది అంటున్నారు దేవ్, శివలు. సామాజిక, కార్పొరేట్ రంగాల్లో అనుభవం కలిగిన మరింతమందిని వాలంటీర్లు చేర్చుకోగలమనే విశ్వాసం వారిలో ఉంది.

చిన్న ఎన్‌జీఓలకు... సామాజిక స్టార్టప్‌లకు.. తాము 'డాల్‌బెర్గ్' మాదిరిగా ఎదగాలన్నది దేవ్, శివల కల. ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్ వారంతట వారే ముందుకొచ్చి... సమాజం మార్పు, అభివృద్ధికి పాటుపడేలా కృషి చేయాలనే ఆలోచన రగిలించేందుకు ప్రయత్నిస్తోంది కన్సల్టింగ్ ఫర్ సోషల్ గుడ్.