జీఎస్టీలో సందేహాలపై ట్రేడర్లకు తెలంగాణ సర్కారు అవగాహన సదస్సులు

జీఎస్టీలో సందేహాలపై ట్రేడర్లకు తెలంగాణ సర్కారు అవగాహన సదస్సులు

Friday July 07, 2017,

2 min Read

జీఎస్టీ వల్ల రాష్ట్ర ఖజానాకి ఆదాయం సమకూరుతుందా? జీఎస్టీ అమలతో పన్నులు ఎగ్గొట్టేవాళ్లెవరో ఈజీగా తెలిసిపోతుందా? ఎంత మొత్తంలో వ్యాపారం చేస్తే ఎంత పన్ను పడుతుంది? వస్తు సేవల పన్ను విధానంలో ఉన్న సానుకూల అంశాలేంటి? జీఎస్టీ ద్వారా చిరు వ్యాపారులకు లాభమా నష్టమా? ఇలాంటి అంశాలపై ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగించేందుకు ప్రభుత్వం అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది.

image


వస్తు, సేవల పన్ను వల్ల రాష్ట్రానికి ప్రయోజనమే తప్ప, నష్టం లేదనేది ప్రభుత్వ నిశ్చితాభిప్రాయం. ముఖ్యంగా పన్ను ఎగ్గొట్టే వాళ్లెవరో ఈజీగా తెలిసిపోతుంది. వాళ్ల దగ్గర్నుంచి ముక్కుపిండి పన్ను వసూలు చేయొచ్చు. ఆ విషయంలో జీఎస్టీ తిరుగులేని తారకమంత్రంలా ఉపయోగపడుతుంది. దాని ద్వారా వచ్చే ఆదాయం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల రూపంలో తిరిగి ప్రజలకే ఉపయోగపడుతుంది. అందుకే జీఎస్టీ పై జనానికి, వ్యాపారులకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తోంది ప్రభుత్వం.

జీఎస్టీ అమలు తీరు ఎలా ఉంటుంది? ఎంత మొత్తంలో వ్యాపారం చేస్తే ఎంత పన్ను పడుతుంది? అనే విషయాలతో పాటు స్థానికంగా వ్యాపారులు, వర్తకులు, ప్రజల నుంచి వచ్చే సందేహాలను నివృత్తి చేస్తున్నారు. జీఎస్టీని అమలు చేయడం వల్ల లాభమా నష్టమా..? అనే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటిని నివృత్తి చేసేలా సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఏ వస్తువుకి ఎంత టాక్స్ పడుతుంది? రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి? పేమెంట్స్ ఎలా కట్టాలి? రిజిస్ట్రషన్ ఎలా చేయాలి? వ్యాట్ లో ఉన్న క్లోజింగ్ స్టాక్‌ జీఎస్టీలో క్రెడిట్ ఎలా అవుతుంది? అందులోకి ఏవేవి వస్తాయి, ఏవేవి రావు? వచ్చే వాటిని ఎలా కాలిక్యులేట్ చేయాలి? ఇన్వాయిస్ ఏ రూపంలో ఉండాలి? వంటి అనేక అంశాలపై డీలర్లకు అవగాహన కల్పిస్తున్నారు. అవగాహన సదస్సుతో పాటు హెల్ప్ సెంటర్, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు ఈ సదస్సులు అన్ని జిల్లాల్లో, అన్ని డివిజిన్లలో జరుగుతున్నాయి.

వస్తు సేవల పన్ను విధానంలో కొన్ని సానుకూలతలున్నాయి. 20 లక్షల రూపాయల లోపు వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారులు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 20 లక్షల నుంచి 75 లక్షల టర్నోవర్ గల వ్యాపారులు ఒక్క శాతం పన్ను చెల్లిస్తే చాలు. జీఎస్టీ ద్వారా లక్షలాది చిన్న వ్యాపారులకు కూడా లాభం చేకూరుతుంది. అందుకే ప్రభుత్వం చొరవతీసుకుని జీఎస్టీ అసలు స్వరూప, స్వభావాలను వారికి విడమరిచి చెప్పి ప్రజల్లో ఉన్న భయాందోళనలు పోగొడుతోంది. జీఎస్టీ పై సమగ్రమైన నోట్ తయారు చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.