సిటీ ప్రోగ్రామ్స్ గైడ్ 'ఈవెంట్స్ హై'

 సిటీ ప్రోగ్రామ్స్ గైడ్ 'ఈవెంట్స్ హై'

Saturday May 02, 2015,

2 min Read

ప్రతీ రోజు మన చుట్టూ చాలా కార్యక్రమాలు జరుగుతూంటాయి. వాటిలో అనేక వాటి వివరాలు మనకు తెలీదు. ఫలానా ప్రోగ్రాం ఇక్కడ జరిగింది అని తెలిస్తే... అరే ముందే తెలిసుంటే ఓసారి వెళ్లొచ్చేవాళ్లం కదా అనుకుంటూ ఉంటాం. కానీ వాటి గురించి మనకు ముందుగా తెలిసేదెలా? ఏదైనా కార్పొరేట్ కంపెనీ నిర్వహించేదో, ఎవరైనా సెలబ్రిటీ వచ్చేదో అయితే ప్రచారం భారీగా ఉంటుంది. స్థానిక వార్తాపత్రికలు, కొన్ని ఆన్‌లైన్ పోర్టల్స్, వాల్ పోస్టర్లు ఎన్ని ఉన్నా.. సమాచారం అందరికీ అందే అవకాశం లేదు. మన ఆసక్తి ఏమిటో స్నేహితులకూ పూర్తిగా తెలిసే ఛాన్స్ ఉండదు.

image


ఇంత అమాయకత్వంగా బతికేస్తున్నామా ?

తాజాగా జరిపిన ఓ సర్వేలో... 85శాతం మంది తమకు చుట్టుపక్కలేం జరుగుతోందో తెలీదని చెప్పారు. అనేక కార్యక్రమాలు పూర్తయ్యాకే వాటి సంగతి తెలుస్తోందని చెప్పారు. తాము మిస్ అయినందుకు చాలా బాధపడ్డామని కూడా చెప్పారు. ఇదే తరహా అభిప్రాయం అందరిలోనూ ఉండే ఉంటుంది. ఇప్పటివరకూ స్థానిక ఈవెంట్స్ అన్నిటి గురించి సమాచారం ఒక్కచోటే లభించేలా చేసేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. ఉచితంగా అహ్వానించేవో, పెయిడ్ ఈవెంట్స్.. ఇలా అన్నిటి గురించిన సమాచారం ఇచ్చేందుక ఈవెంట్స్‌హై అనే సంస్థ ప్రయత్నిస్తోంది.


ఈవెంట్స్‌హై టీం ఇదే

నికేష్ గరేరా - సహవ్యవస్థాపకుడు, సీఈఓ

అర్వింద్ బాత్రా - సహవ్యవస్థాపకుడు, సీటీఓ

పరాగ్ శార్దా- సహ వ్యవస్థాపకుడు, అండ్రాయిడ్ ఎక్స్‌పర్ట్

స్థానికంగా జరిగే కార్యక్రమాలు సమాజంపై చాలా ప్రభావం చూపుతాయి. ఏదైనా ప్రత్యేక విభాగం వారో, సామాజిక వర్గాల వారో ఉమ్మడిగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం మన సంస్కృతిలో భాగం. కానీ వీటి గురించిన సమాచారం సేకరించడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఈవెంట్స్‌హై ఇలాంటి సమస్యలన్నిటినీ తీరుస్తామని చెబ్తోంది. ఆయా నగరాల్లో జరిగే ఈవెంట్స్ అన్నిటి గురించీ సవివరంగా అందించేందుకు ప్రయత్నిస్తోంది. వ్యక్తులు తమ అభిరుచులకు అనుగుణంగా ఆయా ప్రాంతాలు, నగరాల్లో జరిగే కార్యక్రమాల వివరాలు తెలుసుకునే వీలు కల్పిస్తోంది ఈవెంట్స్‌హై.


మార్కెట్ ఎంత ?

ప్రస్తుతం స్థానిక ఈవెంట్స్ మార్కెట్ దేశవ్యాప్తంగా లెక్కకడితే ₹5వేల కోట్లు దాటిపోతుంది. ఇది ఏటేటా 20-25 శాతం వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగమిది. ఈ తరహా ఈవెంట్స్‌కు హాజరవడం గతంలో చాలా తక్కువ మందికే ఉన్నా... ప్రస్తుతం ఇదో కల్చర్‌గా అభివృద్ధి చెందింది. అందుకే ఈవెంట్ ఆర్గనైజర్ల సంఖ్య ఇప్పుడు విపరీతంగా పెరిగిపోతోంది. తమ లక్ష్యానికి అనుగుణంగా అతిథులను సేకరించడం ఇప్పుడు నిర్వాహకులకు సవాల్‌గా మారుతోంది కూడా.

image


ఇదే ఈవెంట్స్‌హై చూపించే పరిష్కారం

"అద్భుతమైన ఈవెంట్స్ గురించిన సమాచారం మొత్తం అందిస్తాం మేం. ఆయా నగరాల్లో ప్రాంతాలవారీగా వివరాలుంచుతాం. ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం ఉన్నవాటి గురించే కాదు... వ్యక్తిగతంగానే హాజరు కావాల్సిన వాటి ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తాం. వ్యక్తుల ఇష్టాలు, అభిరుచులు, ప్రాంతాలకు అనుగుణంగా డీటైల్స్ ఉంటాయి. ప్రతీ ఈవెంట్‌కి విడివిడిగా వివరాలుంటాయి. తరచుగా జరిగే కొన్నింటి విషయంలో ఆయా కార్యక్రమాల నిర్వహణ తీరు, నాణ్యత, రివ్యూలు కూడా అందించేందుకు ప్రయత్నిస్తాం. పిల్లలను తీసుకెళ్లొచ్చా, జంటగా వెళ్లే అవకాశముందా, డ్రస్ కోడ్ సంగతేంటి, పార్కింగ్ సదుపాయాలు ఎలా ఉంటాయో సహా... మొత్తం సమగ్ర సమాచారం అందిస్తున్నాం మేం. సరైన నిర్ణయం తీసుకునేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది కూడా. ఆయా ప్రోగ్రామ్స్‌‍కి సంబంధించిన ఎలర్ట్స్ ఏర్పాటు చేసుకునే సౌకర్యం కూడా ఉంది. " అంటున్నారు ఈవెంట్స్ హై టీం.

మొత్తంగా చెప్పాలంటే.. ప్రతీ కార్యక్రమానికి కొన్ని ఇబ్బందులు పడుతుంటాం. ఇలాంటి సమస్యలపై ముందుగానే అవగాహన వచ్చేలా ఈవెంట్స్ హై ప్రయత్నిస్తోంది. ప్రోగ్రామ్స్‌కు హాజరయ్యేదే ఎంజాయ్ చేయడానికి అయినపుడు... చిరాకు పెట్టే చిన్న చిన్న సమస్యలకు దూరంగా ఉంచడమే తమ లక్ష్యమంటోందీ కంపెనీ.